ఎన్నికలేవైనా జయం మనదే...

Tue,March 19, 2019 02:00 AM

- మరోసారి జగిత్యాల నుంచే జైత్రయాత్ర
- మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్‌లోను జయకేతనం ఎగరేయాలి
- దేశం నేడు తెలంగాణ గూర్చే మాట్లాడుకుంటోంది
- జాతీయ స్థాయిలోను కేసీఆర్ మార్గదర్శనమే ఉండాలి....
- 16 ఎంపీ సీట్లు మనవే....
- జగిత్యాల ప్రజలు ఓటుతో పాటు నోటూ ఇస్తున్నారు...
- సీఎం సభను విజయవంతం చేయండి
- నిజమాబాద్ లోక్‌సభ అభ్యర్థి కల్వకుంట్ల కవిత...
- టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు...
- కారెక్కిన .కౌన్సిలర్లు
- ఎన్నికల ఖర్చుల కోసం కవితకు రూ. 5,77, 624 లక్షల విరాళాలు...
నమస్తే తెలంగాణ, జగిత్యాల ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో....జగిత్యాల నుంచే టీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభమైందని, ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లోను జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని నిజమాబాద్ టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...పలు పార్టీలకు చెందిన నాయకులు కవిత సమక్షంలో సోమవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అలాగే 15 సంఘాలకు చెందిన సభ్యులు, ఎంపీ అభ్యర్థి కవితకు ఎన్నికల ఖర్చుల కోసం విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో పాటు, హజరైన కార్యకర్తలను ఉద్దేశించి ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడారు. ఎన్నికలు ఏవైనా, ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచే జైత్రయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించామని, అన్నట్లుగానే జగిత్యాల నుంచే జైత్రయాత్ర మొదలు పెట్టామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఆదరించి, 88 సీట్లను కట్టబెట్టారన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు, గ్రామ పంచాయితీ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే 80 శాతం స్థానాలను కైవసం చేసుకున్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్ పార్టీ ఘనవిజయాన్ని సాధిస్తుందన్నారు.

నిజమాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించకముందే పలు సంఘాల నాయకులు, విరాళాలు ఇచ్చి, ఓట్లు వేస్తామని తీర్మాణించి మద్దతు పలుకుతున్నారని, వారికి ధన్యవాదాలన్నారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, ఓటుతో పాటు నోటు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు, రానున్న మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయాలన్నారు. జగిత్యాల మున్సిపాలిటీపై గులాబి జెండా ఎగిరినప్పుడే మన విజయం సంపూర్ణం అవుతుందన్నారు. గతంలో జగిత్యాలలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉండి, అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డు తగిలారన్నారు. మున్సిపల్ అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు మంజూరు చేయిస్తే, నిధులను వెచ్చించకుండా, తీర్మానాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారనీ, ఇంకా పెడుతూనే ఉన్నారన్నారు. దేశంలో నేడు తెలంగాణ గురించే చర్చ జరుగుతుందన్నారు. డైబ్బ సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధిని, ఐదేళ్లలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ సాధించిందన్నారు.

సంక్షేమాభివృద్ధి పథకాలను సమానంగా అమలు చేసిన ఘనత మనకు దక్కుతుందన్నారు. కల్యాణ లక్ష్మి నుంచి మొదలు పెట్టి, పరిశ్రమల వరకు అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అన్ని పథకాలను చూసి దేశంలోని అన్ని రాష్ర్టాలు అబ్బురపడుతున్నాయన్నారు. పుష్పం సుగంధ పరిమళం అన్ని ప్రాంతాలకు విస్తరించినట్లుగానే, టీఆర్‌ఎస్ పరిపాలన సుగంధ పరిమళాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయన్నారు. రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని, కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం చేసే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఒకరకంగా దేశంలోని రైతాంగానికంతటికి మేలు జరిగే పథకానికి సీఎం కేసీఆర్ దారి చూపారన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. జాతీయ స్థాయి పార్టీలుగా చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల సంక్షేమం కోసం ఏం చేయలేవన్నారు. సంపూర్ణ విజయాన్ని సాధిస్తే, కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషిస్తుందని, జాతీయ స్థాయిలో తెలంగాణ ఎజెండా అమలు అవుతుందన్నారు. జాతీయ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచి ఏం సాధిస్తుందని కొందరు అర్థం, పర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

పార్లమెంట్‌లో తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గళం ఎత్తడానికి జంకిన పరిస్థితుల్లో, టీఆర్‌ఎస్ ఎంపీలు, ఉద్యమించి, హైకోర్టును సాధించిన విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. హైకోర్టుతో పాటు అనేక అంశాలపై టీఆర్‌ఎస్ ఎంపీలు, పార్లమెంట్‌లో పట్టుబట్టి సాధించారన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు, గల్లీలో ప్రజలకు సేవకులుగా ఉంటే, డిల్లీలో సైనికులుగా పనిచేస్తారన్నారు. నేడు టీఆర్‌ఎస్ ఎంపీలు అంటే అన్ని ప్రాంతాల్లోను, పార్టీల్లోను గౌరవం ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయాని సంపూర్ణం చేయాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జిల్లా పరిషత్ అధ్యక్షరాలు తుల ఉమ, టీఆర్‌ఎస్ నాయకులు ముప్పాల రాంచందర్‌రావు, జిఆర్ దేశాయి, పడాల తిరుపతి, బోగ వెంకటేశ్వర్లు, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, దావ సురేష్, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక....
జగిత్యాల మాజీ జడ్పీ సభ్యుడు ముస్కు ఎల్లారెడ్డి, వివిధ మండలాలకు చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు, పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు 6వ వార్డు కౌన్సిలర్ వొల్లం లక్ష్మి, మల్లేశం, 12వ వార్డు కౌన్సిలర్ అడువాల లక్ష్మణ్, 18వ వార్డు కౌన్సిలర్ కైరి భూమాగౌడ్, 28వ వార్డు కౌన్సిలర్ షకీల్, 34వ వార్డు కౌన్సిలర్ నవ్వోతు రవీందర్, 36వ వార్డు కౌన్సిలర్ మున్నా భాయిలు గులాబీ గూటికి చేరారు. అలాగే సింగిల్ విండో చైర్మన్ నారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డి, సర్పంచ్‌లు సురకంటి స్వప్న, రాజేశ్వర్‌రెడ్డి, జమున, స్నేహ, చిన్నమల్లేశ్, రాజలక్ష్మి, జయపాల్‌రెడ్డి, సాగరిక, తిరుపతి, కొండ శ్రీనివాస్, జయ, లకా్ష్మరెడ్డి, పీఏ గంగాధర్ తదితరులు చేరారు.

ఎంపీ అభ్యర్థి కవితకు భారీగా విరాళాలు ఇచ్చిన కుల, రైతు సంఘాలు....
జగిత్యాల నియోజకవర్గంకు చెందిన పలు కుల, రైతు సంఘాలు టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం భారీగా విరాళాలను అందజేశారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని..పద్మశాలి సేవా సంఘం-రూ.1,00,116, సీనియర్ సిటీజన్స్ ఫోరం-1,01,116, ఒడ్డెర సంఘం- రూ.50,000, మున్నూరు కాపు సంఘం -25,000, నాయిబ్రాహ్మణ సేవా సంఘం-25,000, రజక సంఘం-25,000, స్వర్ణకార సంఘం-25,000, రైతు సంఘం లక్ష్మిపూర్-10,116, తిప్పన్నపేట మహిళ సంఘం-10,116, పెరుక సంఘం 10,116, ఆటో యూనియన్ 10,000, వాటర్ ప్లాంట్ అసోసియేషన్ 5,116, ఎంఏ మోసిన్ 10,000, బొడ్డు బుచ్చన్న 51,116, వైశ్య సంఘం 11,116లు అందజేశారు.

ఆల్ సీనియర్ సిటిజన్ల విరాళం రూ. ఒక లక్షావేయినూట పదహార్లు
జగిత్యాల టౌన్ ః నిజామాబాద్ లోక్ సభ ఎంపీగా రెండోసారి పోటీచేయనున్న కల్వకుంట్ల కవిత ఎన్నికల ఖర్చుల కోసం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా పక్షాన రూ. 1,01,116 విరాళాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అందజేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ కవితకు చెక్కు రూపకంగా హరి అశోక్‌కుమార్ అందజేస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల గుండెల్లో చెరుగని ముద్రవేసుకున్న ఎంపీ కవితకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నాలుగింతల మెజార్టీతో గెలుపొందాలని సీనియర్ సిటిజన్ల జిల్లా, డివిజన్ మండల జగిత్యాల పట్టణ శాఖ ప్రతినిధులు ఎంపీ కవితను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, సీనియర్ సిటిజన్ల జిల్లా గౌరవ సలహాదారు మాజీ మున్సిపల్ చైర్మన్ జి.ఆర్.దేశాయి, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విశ్వనాథం, టీపెన్షనర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్, నాయకులు గొర్రె విద్యాసాగర్, యం.డి.యాకూబ్, మానాల కిషన్, అలిశెట్టి ఈశ్వరయ్య, నారాయణ, కప్పల చంద్రమౌళి, వెలుముల ప్రకాష్‌రావు, వి.పురుషోత్తంరావు, క్యాస లక్ష్మినారాయణరెడ్డి, కోటగిరి మహేందర్, దేవేందర్‌రావు, కరుణ, నర్సయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

దేశంలో తెలంగాణ తరహా పాలన....
పార్లమెంట్ ఎన్నికల తదుపరి జాతీయ స్థాయిలో తెలంగాణ మోడల్ పాలన ప్రారంభం కాబోతుందని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ప్రతి రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణ రాష్ర్టాన్ని మార్గదర్శిగా భావిస్తున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో తెలంగాణ మోడల్ పరిపాలన ప్రారంభం కానుందని తెలిపారు. 70సంవత్సరాల స్వతంత్ర భారత దేశ పాలనలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు సాధించిందేమీ లేదన్నారు. ఇప్పటికి దేశంలో అనేక సమస్యలున్నాయనీ, ఒకప్పుడు నాలుగు గంటల కరెంట్, 24గంటల మంచినీళ్లు, ప్రతి ప్రాంతానికిరోడ్డు అమెరికాలో ఉండేవని చెప్పుకునేవారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఐదేళ్లలోనే 24గంటల కరెంట్, మంచినీళ్లు, ప్రతి ప్రాంతానికి తారురోడ్డు సాధించగలిగామన్నారు. ఐదేళ్ల కాలంలో తెలంగాణ సాదించిన విజయాలన్ని జాతీయస్థాయిలో సాధించాలంటే కేసీఆర్ లాంటి పట్టుదల, అంకితభావం ఉన్న నాయకుడి అవసరం ఉందన్నారు. జాతీయస్థాయిలో బీజేపీ ప్రభుత్వ ఐదేళ్లలో సాధించిందేమీ లేదన్నారు. ఐదేళ్ల కాలంలో ఒకసారి నోట్లను రద్దు చేశారని, ఒకసారి టాక్స్ మార్చారని తెలిపారు.

వందల సార్లు మాట తప్పారనీ, చివరికి దేవుడికి సైతం బీజేపీ నాయకులు టోపీ పెట్టారని పేర్కొన్నారు. ఎన్నికలు రాగానే బీజేపీకి శ్రీరామ ఆలయం గుర్తుకు వస్తుందని, బీజేపీ నాయకుల వ్యవహారం ఆ శ్రీరామ చంద్రుడికి సైతం బాధ కలిగిస్తుందన్నారు. రాముడు 14సంవత్సరాలు మాత్రమే వనవాసం చేశాడని, బీజేపీ మాటలతో దశాబ్దాలుగా రాముడు వనవాసం చేస్తూనే ఉన్నాడన్నారు. మాటిమాటికీ బీజేపీ దేశభక్తి గుర్తించి ప్రస్తావిస్తుందని, బీజేపీ కంటే సీఎం కేసీఆర్‌కే ఎక్కువ దేశభక్తి ఉందన్నారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కోసం రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసింది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. ఈ ఒక్క సంఘటన చాలు సీఎం కేసీఆర్ దేశభక్తికి నిదర్శనమన్నారు. రాష్ట్రం అభివృద్ది పథంలో ఉంటే జాతీయస్థాయిలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకరికొకరు తిట్టుకుంటూ కాలం వెల్లదీస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి, పెన్షన్ పెంపు చేస్తామని ప్రకటించారని, ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిరుద్యోగ భృతికి రూ.2800 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారనీ, బీడీ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ కట్ అప్‌డేట్‌ను సైతం తీసివేస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 1 లేదా మే 1వ తేదీ నుంచి నిరుద్యోగ భృతి, పెంచిన పెన్షన్లు అమల్లోకి వస్తాయన్నారు.

జాతీయస్థాయిలో కేసీఆర్ అవసరం ఉందని, తెలంగాణ మోడల్ పరిపాలన జాతీయస్థాయిలో ప్రారంభం కావాలని తెలిపారు. తెలంగాణలో రైతుబంధు అమలు చేసేముందు భూ రికార్డుల ప్రక్షాళన చేసి అర్హులందరికి రైతుబంధు సాయం అందించడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో రైతు సహాయాన్ని అందిస్తున్న సందర్భంలో ఎన్ని రాష్ర్టాల్లో భూ రికార్డుల ప్రక్షాళన చేశారన్న విషయాన్ని ప్రకటించాలన్నారు. 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి తీవ్ర నష్టం చేసిందన్నారు. ఇందిరా గాంధీ హయాంలో గరీబీ హఠావో నినాదమిచ్చారనీ, ఇప్పుడు ఆమె మనుమడు గరీబీలకు సాయం చేస్తామంటున్నాడంటే 50ఏళ్లయినా గరీబీ హఠావో నినాదం విజయవంతం కాలేదనే కదా అని ప్రశ్నించారు. పేద ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్దితో పని చేస్తుంది కేవలం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. సంక్షేమం కోసం రూ.40వేల కోట్లకు పైగా నిధులను కేటాయించి ఏ ఆంక్షలు ఎత్తివేసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రానున్న ఎన్నికల్లో 16సీట్లను టీఆర్‌ఎస్ కైవసం చేసుకొని జాతీయ స్థాయిలో కీలకపాత్రను పోషించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరియా నుంచి ఉపాధి కోసం ప్రజలు భారతదేశానికి వలస వచ్చే పరిస్థితి భవిష్యత్తులో రావాలని ఆకాంక్షించారు.

85
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles