తెలంగాణ మాణిక్యం ఆ ‘గిరి’పువూతుడు


Wed,December 4, 2019 02:54 AM

- తండాలో పుట్టి అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగి..
-దివ్యాంగుల బాస్కెట్ బాల్‌లో పతకాలు పండిస్తున్న ధరావత్ సురేశ్
ఖైరతాబాద్: ఒక ఎకరం పొలం....ఒక్క పూట భోజనం.... చమటను రక్తంగా చేసి పండించిన పంట చేతికొచ్చినా తీరని కష్టాలు....ఇల్లు గడువాలంటే కూలీ పనిచేయాల్సిందే.....ఓ నిరుపేద అన్నదాత కుటుంబంలో జన్మించిన ఆ ‘గిరి’పువూతుడు దాతల సాయంతో చదువుకొని నేడు అంతర్జాతీయ దివ్యాంగుల బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిగా ఎదిగి తన ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపించాడు ధరావత్ సురేశ్. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం రంగుండ్ల తండాకు చెందిన ధరావత్ బాలు, మల్లి దంపతులకు ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. చివరి సంతానమైన సురేశ్ ఊహ తెలిసినప్పటి నుంచే కష్టాల కడలిలో అతని జీవితం సాగింది. కష్టపడి ప్రభుత్వ బడిలో చదువుకొని ఐఐటీ చేసి ప్రస్తుతం బీడీఎల్ కంపెనీలో అంప్రెటీస్ చేస్తూ దివ్యాంగుల వసతి గృహంలో ఉంటూ 2020 జపాన్ దేశంలోని టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్ పోటీలకు సన్నద్ధమవుతున్న ఈ తెలంగాణ మాణిక్యానికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తే పతకాలు సాధించి పెడుతానని అంటున్నారు.


సర్కారు బడిలోనే ఓనమాలు
1995 మే 10వ తేదీన జన్మించిన ధరావత్ సురేశ్ ప్రాథమిక విద్య సర్కారు బడిలోనే సాగింది. ఆర్థిక కష్టాలు ఎన్ని ఎదురైనా చదువుల్లో మాత్రం వెనుకడుగు వేయలేదు. పుట్టకతోనే కాళ్లకు వైకల్యం ఇబ్బంది పెడుతున్నా ఆత్మస్థెర్యాన్ని కూడగట్టుకొని చదువుల్లోనూ ముందున్నారు. నల్గొండ జిల్లాలోని పెద్దావుర మండలంలోని సిద్ధార్థ విద్యానికేతన్‌లో 8నుంచి పదో తరగతి వరకు చదుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు, దాతల సహకారంతో చంపాపేట్‌లోని శ్రీచంద్ర కళాశాలలో ఇంటర్, మూసారాంబాగ్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్, టీటీసీలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేశారు. తొలుత దివ్యాంగుల క్రికెట్ పోటీల్లోనూ ప్రతిభ చాటారు.పలు జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఆడారు. తర్వాత బాస్కెట్ బాల్ క్రీడ ను ఎంచుకొని అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదుగుతున్నారు. సురేశ్‌లో ఉన్న పట్టుదల చూసి ప్రస్తుత తిరుమలగిరి మండల ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్ ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు.

జాతీయ స్థాయిలో తెలంగాణకు కీర్తి
2018లో సెప్టెంబర్ 20 నుంచి 23వ తేదీల్లో తమిళనాడులోని ఈరోడ్‌లో జరిగిన ఐదో జాతీయ వీల్ చైర్ బాస్కెట్ బాల్ పోటీ ల్లో తెలంగాణ తరఫున ఆడగా నాల్గో స్థానంలో నిలిచారు. 23 రాష్ట్రాలు పాల్గొన్న ఈ పోటీలో సురేశ్ ఏకంగా 27 గోల్స్ వేయ గా, వారి జట్టు నాల్గో స్థానంలో నిలిచింది. 2019లో జూన్ 24న పంజాబ్‌లోని మోహాలీ జరిగిన ఆరో జాతీయ స్థాయి పోటీల్లో సురేశ్ 30 గోల్స్ చేశారు. ఆ పోటీల్లో తెలంగాణ నాల్గో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం థాయిలాండ్‌లో భారత్ తరపున ఆడుతున్న జట్టు అక్కడ అర్హత సాధిస్తే ఒలింపిక్స్ క్రీడలకు క్వాలీఫై అవుతారు. త్వరలోనే దేశంలో జరిగే ఏడో జాతీయ స్థాయి దివ్యాంగుల బాస్కెట్ బాల్ పోటీల్లో అంతర్జాతీయ పోటీ ల్లో పాల్గొనే జట్టును ఎంపిక చేస్తారని తెలిపారు. తనకు ఇప్పటికే ఉన్న ప్రతిభ ఆధారంగా నేరుగా ఆ జట్టులో స్థానం లభిస్తుందని తెలిపారు.

357

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles