బల్దియాలో ఐటీ సేవలు విస్తృతం


Tue,December 3, 2019 02:25 AM

-మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక యాప్‌లు
-వారణాసి అధికారుల సమావేశంలోమేయర్‌ బొంతు రామ్మోహన్‌
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో ప్రజలకు మెరుగైన పౌర సేవలను అందించేందుకు ప్రత్యేక ఐటీ యాప్‌లను వినియోగిస్తున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అండ్‌ సర్వీస్‌ డెలివరీ అనే అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి కార్పొరేషన్‌కు చెందిన 23 మంది సీనియర్‌ అధికారుల బృందం ఐదు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా అమలు చేస్తున్న కార్యక్రమాలపై సోమవారం నగరానికి చేరుకున్నది. మొదటగా జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, ఐటీ విభాగం అదనపు కమిషనర్‌ సిక్తా పట్నాయక్‌, ఆస్కి డైరెక్టర్‌ శ్రీనివాస చారిలతో అధికారుల బృందం సమావేశమైంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఈ -ఆఫీస్‌, ఆస్తుల మ్యాపింగ్‌, వీధిలైట్ల నిర్వహణ, గ్రీవెన్స్‌, మొబైల్‌ యాప్‌, వాహనాల రద్దీ, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు లక్ష సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, అన్ని శాఖల సమన్వయం, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, రవాణా తదితర అంశాలపై మేయర్‌, అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.


మొబైల్‌ యాప్‌తో 24 కోట్ల పన్ను వసూలు
దేశంలోనే మొదటి సారి ఈ-ఆఫీస్‌ విధానం ద్వారా కాగితరహిత పాలనను వందశాతం అమలులోకి తెచ్చినట్లు మేయర్‌ తెలిపారు. 6.29 లక్షల ఫైళ్లలోని రూ. 4.22 కోట్ల పేజీలను డిజిటలైజ్‌ చేసినట్టు పేర్కొన్నారు. తద్వారా పరిపాలనలో ఉద్యోగులకు ఈ -పరిజ్ఞానాన్ని పెంచినట్లు తెలిపారు. ఉద్యోగుల డేటాబేస్‌ను రూపొందించి బయోమెట్రిక్‌ ద్వారా హాజరును నమోదు చేస్తున్నట్లు చెప్పారు. మై జీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌ ద్వారా 4.75 లక్షల గ్రీవెన్స్‌ను పరిష్కరించినట్లు అధికారులు వివరించారు. 2.82 లక్షల జనన, మరణ, ఇతర ధ్రువీకరణ పత్రాలను జారీ చేసినట్లు తెలిపారు. మొబైల్‌ యాప్‌ ద్వారా 24 కోట్ల పన్నులను వసూలు చేసినట్లు తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తులను జీఐఎస్‌ మ్యాపింగ్‌ చేసి, జియో ట్యాగ్‌ చేసినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారా స్ట్రీట్‌ లైట్ల నిర్వహణను మానిటరింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు వివిధ పనులకై నగరానికి వచ్చే వారి సౌలభ్యం కోసం రూ.5కే భోజనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. జవహర్‌ నగర్‌ డంప్‌యార్ట్‌ క్యాపింగ్‌ పనులను వివరించారు.

ప్రధాన రోడ్ల నిర్వహణ ప్రైవేట్‌కు..
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 900 ప్రధాన రహదారులలో 709 కిలోమీటర్ల నిర్వహణను పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ కింద ఐదు సంవత్సరాల కాలానికి అప్పగించడానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. ప్రతి నెలా మొదటి శనివారం ప్రధానమైన 15 శాఖలకు సంబంధించిన సమస్యలను చర్చించి పరిష్కరించడానికి కన్వర్జెన్స్‌ మీటింగ్‌ను పోలీస్‌, ట్రాన్స్‌పోర్టు, విద్యుత్‌, జలమండలి, ఆర్‌ అండ్‌ బీ జాతీయ రహదారులు ఇతర విభాగాల అధికారులతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్‌ నగరంలోని హెరిటేజ్‌ నిర్మాణాలను పరిరక్షించడానికి ప్రత్యేక శద్ధ్ర తీసుకుంటున్నట్లు తెలిపారు. చార్మినార్‌ పెడస్టేరియన్‌ ప్రాజెక్టు, మోజం జాహీ మార్కెట్‌ పునరుద్ధరణ పనులు రూ. 5కే భోజన పథకాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో వారణాసి కార్పొరేషన్‌, జలమండలి, గంగా కాలుష్య నివారణ విభాగం, జైకా అధికారులు, భూపాల్‌ నగర కమిషనర్‌ విజయ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజనీర్‌ జియాఉద్దీన్‌, అడిషనల్‌ సీసీపీ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

327

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles