సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ: మనల్ని పట్టిపీడిస్తున్న కాలుష్య నివారణకు ఒక్కో ముందడుగు పడుతున్నది. దీంట్లో భాగంగా జిల్లా కో పర్యావరణ ప్రణాళిక రెడీ కాబోతున్నది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ ప్రణాళికను రూపకల్పన చేయనున్నారు. ఈ ప్రణాళికను ఆయా జిల్లాల వెబ్సైట్లో పొందుపరుచాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో ప్రణాళిక రూపకల్పనపై అధికారులు దృష్టిపెట్టారు. వివరాల్లోకి వెళితే.. గ్రేట ర్ సహా శివారుల్లో నమోదవుతున్న కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వరకటితో పొల్చితే వాతావరణ కాలుష్యం అధికమవుతుండటం, ప్రత్యేకించి నగరాలు, శివారు ప్రాంతాల్లో అధికమవుతున్నది. కొత్త కాలుష్య కారకాలు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రత్యేకించి అంబియంట్ ఎయిర్ క్వాలిటీలో భాగంగా 2011 -15 వరకు గల కాలుష్య తీవ్రతను పరిశీలించి హైదరాబాద్, నల్గొండ, పటాన్ చెరులను మూడు నాన్ అటెయిన్మెంట్ నగరాలుగా పేర్కొంది. ఈ మూడు నగరాల్లో ప్రమాణాలకు మించి కాలుష్యం నమోదవుతున్నట్లుగా తేల్చింది. పలుశాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లి కాలుష్యాన్ని నియంత్రించాలని సూచించింది. ఈ మేరకు జిల్లాకో పర్యావరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో ప్రణాళికల రూపొందించి, ఎన్జీటీకి అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.