అభివృద్ధిలో ‘సీఎస్‌ఆర్‌' భాగస్వామ్యం


Wed,November 13, 2019 01:58 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో రోడ్లు, ఫ్లైఓవర్లకు చేస్తున్న ఖర్చు కాకుండా పచ్చదనం, పరిశుభ్రత, నగర సుందరీకరణ తదితర కార్యక్రమాల కోసం రూ. 15000కోట్లు అవసరమవుతాయని అంచనా. రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతర అభివృద్ధి పథకాలకు ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఏటా వేలాది కోట్లు ఖర్చుచేస్తున్నాయి. అయినా ఎంతో వెలితి. దీన్ని పూడ్చుకునేందుకు జీహెచ్‌ఎంసీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ(సీఎస్‌ఆర్‌)ను ప్రోత్సహిస్త్తుంది. ముందుకొచ్చే దాతలకోసం రెడ్‌ కార్పెట్‌ పరుస్తుంది. దీంతో పెద్ద ఎత్తున సంస్థలే కాకుండా ప్రముఖ వ్యక్తులు వివిధ కార్యక్రమాలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. గడచిన ఏడాదికాలంలో సీఎస్‌ఆర్‌ కింద జీహెచ్‌ఎంసీకి రూ. 80 కోట్లు రావడమే ఇందుకు నిదర్శనం.


కంపెనీస్‌ యాక్ట్‌ ప్రకారం సంస్థ లాభాల్లో కనీసం రెండు శాతం సీఎస్‌ఆర్‌ కింద ఖర్చుచేయాల్సి ఉంటుంది. దీంతో జీహెచ్‌ఎంసీ సీఎస్‌ఆర్‌ కింద పెట్టుబడులను ఆకర్షించేందుకు ఓ సీఎస్‌ఆర్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. సీఎస్‌ఆర్‌ ప్రక్రియను సులభతరం చేసేందుకు సింగిల్‌ విండో ఆన్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటుచేసి ఓ అదనపు కమిషనర్‌ను కూడా ప్రత్యేకంగా నియమించారు. గడచిన ఏడాది కాలంలో రూ. 80కోట్ల పెట్టుబడులు సీఎస్‌ఆర్‌ ద్వారా సేకరించారు. ముఖ్యంగా సుందరీకరణ, పారిశుధ్య పను ల కోసం పెట్టుబడులు వచ్చాయి. మరికొందరు సెంట్రల్‌ మీడియన్ల అభివృద్ధి, పచ్చదనం ఏర్పాటు తదితరవాటికోసం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వీటికోసం పెట్టుబడులు పెట్టొచ్చు..
పెంపుడు జంతువుల కోసం పెట్‌ క్రిమేషన్‌, పెట్‌ అంబులెన్స్‌, వీధి కుక్కల సంక్షేమానికి చర్యలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, చెరువుని దత్తత తీసుకోవడం, పార్కుని దత్తత తీసుకోవడం, కొత్త పార్కు అభివృద్ధికి సాయం, టాయిలెట్‌ డొనేట్‌ చేయడం, నగర సుందరీకరణలో భాగంగా శిల్పాలు, పెయింటింగ్స్‌, ఆర్ట్‌ పీసెస్‌ తదితరవాటి వితరణ, వ్యర్థాల నిర్వహణలో భాగంగా డస్ట్‌బిన్స్‌, చెత్త వాహనాలు, ఎలక్ట్రానిక్‌ వాహనాలు, బయో మెథనేషన్‌ ప్లాంట్స్‌, ఎస్‌టీపీల ఏర్పాటు, నైట్‌ షెల్టర్‌ స్పాన్సర్‌, అన్నపూర్ణ మీల్స్‌ సెంటర్‌ స్పాన్సర్‌, ఆట మైదానం, స్టేడియం, ఆట వస్తువులు తదితరవాటి స్పాన్సర్‌, జంతువుల సంక్షేమానికి పెట్‌ క్రిమిటోరియమ్‌, పెట్‌ క్రిటికల్‌ కేర్‌ వెహికిల్‌ తదితర వాటి స్పాన్సర్‌, మహిళలు, యువతకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు చర్యలు.

పెట్టుబడికి బల్దియా జవాబుదారీ
సీఎస్‌ఆర్‌ కింద జీహెచ్‌ఎంసీకి నిధులు ఇస్తే వాటిని కమిషనర్‌ ఆధ్వర్యంలో ఖర్చుచేసి ఆ వివరాలు ఎప్పటికప్పుడు స్పాన్సర్‌ చేసినవారికి అందిస్తారు. లేనిపక్షంలో జీహెచ్‌ఎంసీతో ఒప్పందం చేసుకొని చేయాలనుకున్న పనిని చేపట్టవచ్చు. లేక జీహెచ్‌ఎంసీ చేపట్టే ప్రాజక్టును మనమే సొంతంగా చేపట్టవచ్చు.

313

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles