చీటికి మాటికి రోడ్లు తవ్వరు


Tue,October 22, 2019 05:58 AM

-సమన్వయ లోపాలకు చెల్లు
-సమగ్రమైన పద్ధతుల్లోనే ఇక రహదారుల నిర్వహణ
-వేర్వేరు పనులకు వేర్వేరు టెండర్ల పద్ధతికి స్వస్తి
-రోడ్లతోపాటు ఫుట్‌పాత్ నిర్మాణాలు, గ్రీనరీ వరకు అన్ని పనులూ ఒకే సంస్థకు అప్పగింత
-ఐదేండ్ల వరకు నిర్వహణ బాధ్యతలు
-సమీక్ష జరిపిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
-అత్యున్నత ప్రమాణాలతో రోడ్లే లక్ష్యంగా వినూత్న పద్ధతికి శ్రీకారం


(హైదరాబాద్, నమస్తే తెలంగాణ)దీర్ఘకాలం నుంచి నగర రోడ్ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వినూత్నమైన కసరత్తు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ కాంప్రిహెన్సీవ్ రోడ్ మెయింటనెన్స్ (సీఆర్‌ఎం) పేరిట ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి నడుం బిగించింది. దీని కింద, ప్రస్తుతం నగరంలోని ప్రధాన రోడ్ల నిర్వహణ సమగ్రమైన రీతిలో చేపట్టనున్నది. ప్రస్తుతం రోడ్ల నిర్వహణతో పాటు ఫుట్‌పాత్ నిర్మాణాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నది. అయితే రోడ్లతో పాటు ఫుట్‌పాత్ నిర్వహణ, రోడ్ క్లీనింగ్, గ్రీనరీ నిర్వహణ వంటి అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకుని వీటన్నింటినీ ఏకకాలంలో నిర్వహించేలా సరికొత్త నిబంధనల్ని రూపొందిస్తున్నది. సుమారు ఐదు సంవత్సరాల పాటు అత్యుత్తమ ప్రమాణాలతో వీటి నిర్వహణను చేసేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తుంది.

ఇంకా, ఇవి ఏం చేస్తాయంటే..
రోడ్డు గుంతలతో పాటు అవసరమైనప్పుడు కొత్త రోడ్లు వేయడం ఆయా సంస్థలే చేయాల్సి ఉంటుంది.
-రోడ్డు నడిమధ్యలో (మీడియన్లు) గ్రీనరి, రోడ్ల క్లీనింగ్, ఫుట్‌పాత్ నిర్మాణం, నిర్వహణ పూర్తి బాధ్యత వర్కింగ్ ఏజెన్సీలదే.
-ఈ ఐదేండ్ల పాటు ట్రాన్స్‌కో, జలమండలి, ప్రైవేటు సంస్థల మాస్టర్ ప్లాన్ విస్తరణ వంటి అవసరాలకు రోడ్లు తవ్వేందుకు వర్కింగ్ ఏజెన్సీలే సహకరిస్తాయి. అయితే, ఆయా సంస్థలు తమ భవిష్యత్తు ప్రణాళికలను కనీసం ఆరు నెలల ముందే తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నూతనంగా వేసిన రోడ్లను, పుట్‌పాత్‌లను వెంటనే తవ్వే అవసరం ఉండదు. దీంతో పాటు ఎప్పుడైనా రోడ్లను తవ్వితే వాటిని వెంటనే పూడ్చి, తిరిగి పూర్వపు స్థితికి తేవడంలోను ప్రస్తుతం వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, ఆలస్యం ఉండదు.
-ఐదు సంవత్సరాల పాటు అదే సంస్థపైన నిర్వహణ బాధ్యత ఉంటుంది కాబట్టి, పనుల్లో దీర్ఘకాలం మన్నేలా ప్రమాణాలుంటాయి.

మంత్రి కేటీఆర్ సమీక్ష..
హైదరాబాద్‌లోని రహదారుల నిర్వహణను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించేందుకు సమగ్ర రోడ్డు నిర్వహణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. దీని కింద సుమారు 709 కిలోమీటర్ల రోడ్లను ఏడు యూనిట్లుగా విభజించి, దీర్ఘకాలిక టెండర్లను జీహెచ్‌ఎంసీ పిలవనున్నది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ సిబ్బంది, జోనల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జోన్లలోని ప్రధాన రోడ్లను గుర్తించి, సీఆర్‌ఎం కార్యక్రమంతో వాటిని నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్ల నిర్వహణతో పాటు ఇతర అంశాల్లోను ఉన్నత ప్రమాణాల్ని నిర్దేశించినట్లు, ఆయా వర్కింగ్ ఏజెన్సీలు చేసే పనుల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ఇంజినీరింగ్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలంగా ప్రధాన రోడ్ల నిర్వహణకు ఎదురవుతున్న సవాళ్లు తొలగిపోతాయన్న ఆశాభావం వారు వ్యక్తం చేశారు. సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జోనల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ సిబ్బంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

286

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles