భారీ వర్షం.. బల్దియా అప్రమత్తం


Thu,October 10, 2019 02:47 AM

-ప్యారడైజ్ వద్ద మోటార్‌తో వర్షపు నీటిని తోడుతున్న సిబ్బంది..
సిటీబ్యూరో: వారం రోజులుగా తడిసి ముద్దవుతున్న మహానగరంపై మంగళ, బుధవారాల్లో పిడుగుల వాన కురిసింది. పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో గ్రేటర్‌లోని పలు చోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో చాదర్‌ఘాట్‌లోని ఒక ఇల్లు పిడుగుపాటుకు పూర్తిగా దెబ్బతింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆదిభట్ల, బహుదూర్‌పూర్, ఫరూక్‌నగర్, మిఠ్యాల గ్రామం, ఆమన్‌గల్‌లోని శంకర్‌కొండ తండా తదితర ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది ఆవులు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాయి. మంగళవారం ఉదయం 8.30గంటల నుంచి బుధవారం ఉదయం 8.30గంటల వరకు గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసి, అత్యధికంగా ఉప్పల్‌లో 6.0సెం.మీలు, అల్కాపురి, నాగోల్‌ల్లో 4.6 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అత్యధికంగా ఖైరతాబాద్‌లో 4.1సెం.మీలు, ఉప్పల్‌లో 3.9సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రేటర్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వాన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.


ఖైరతాబాద్ మెట్రోస్టేషన్‌లోకి వరద నీరు వచ్చిచేరింది. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నెం.180-190 మధ్య ఉన్న హైవే వద్దగల ర్యాంప్ వద్ద వరద నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి విమానాశ్రయానికి వెళ్లాల్సిన పలువురు ప్రయాణికులు విమానాశ్రయం చేరుకోలేకపోయారు. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, అల్కాపురికాలనీ, రాజేంద్రనగర్, శంషాబాద్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, కాప్రా, నాచారం, మణికొండ, శేరీలింగంపల్లి, ఖైరాతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్, బాలానగర్, సనత్‌నగర్, నాంపల్లి, ఆసిఫ్‌నగర్, కార్వాన్, మలక్‌పేట, చాదర్‌ఘాట్‌లతో పాటు గ్రేటర్‌వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజులూ గ్రేటర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

483

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles