సద్దుల సంబురం


Mon,October 7, 2019 05:03 AM

-ఎల్బీ స్టేడియం నుంచి వైభవంగా సాగిన బతుకమ్మ ఊరేగింపు
-జన జాతరగా ట్యాంక్‌బండ్‌ పరిసరాలు
-ఒక్కేసి పువ్వేసి అంటూ.. ట్యాంక్‌బండ్‌ చుట్టూరా ఆడపడుచుల ఆటాపాట


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ
సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ట్యాంక్‌బండ్‌ వేదికైంది. ఆదివారం సాయంత్రం తీరొక్క పూలతో పేర్చిన సద్దుల బతుకమ్మలతో సంప్రదాయ దుస్తులు దరించిన మహిళలు పెద్ద ఎత్తున ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. రామరామ రామ ఉయ్యాలో.. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.., ఒక్కేసి పువ్వేసి చందమామ.. తదితర బతుకమ్మ ఆటపాటలతో సాగరతీరం సందడిగా మారింది. అంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మ శకటాలను ఎల్బీస్టేడియం వద్ద సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ ప్రారంభించారు. సాంస్కృతిక కళారూపాలతో, పెద్దఎత్తున డప్పుల దరువులు, కళాకారుల నృత్యాలతో ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు ఊరేగింపు కళాత్మకంగా సాంస్కృతిక రంజితమై సాగింది. సాగర తీరంలో మలేషియా నుంచి తెప్పించిన పటాకుల వెలుగులు ఆకట్టుకున్నాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 26 జానపద కళారూపాలకు చెందిన 1500 మంది కళాకారులు ఆటపాటలతో అలరించారు. రాత్రి పొద్దుపోయేవరకు బతుకమ్మ ఆడిన మహిళలు హుస్సేన్‌సాగర్‌ వద్ద ఏర్పాటు చేసిన కొలనులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఉత్సవాల్లో పాల్గొన్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకే బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరుగున పడుతున్న మన సంస్కృతి సంప్రదాయాలను పునరుద్ధరించడం కోసం కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ జాగృతి’ని ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, పురావస్తు శాఖ డైరెక్టర్‌, సాట్స్‌ చైర్మన్‌ దినకర్‌ బాబు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, టీజీవో అధ్యక్షురాలు, జోనల్‌ కమిషనర్‌ వి.మమత, తదితరులు పాల్గొన్నారు.

కూకట్‌పల్లి రంగధాముని చెరువు కట్టపై..
కూకట్‌పల్లి రంగధాముని చెరువు కట్టపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీహెచ్‌.మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌, నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. కూకట్‌పల్లి గ్రామంలో 20 అడుగుల వరకు ఎత్తైన బతుకమ్మలతో హనుమాన్‌ ఆలయం మైదానం వద్ద బతుకమ్మ ఆడారు. అనంతరం గ్రామ పుర వీధులలో ఊరేగింపు నిర్వహించి రంగధాముని చెరువులో నిమజ్జనం చేశారు. వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో బతుకమ్మలకు పోటీలు నిర్వహించి, బహుమతులు ప్రదానం చేశారు.

206

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles