32 ప్రాంతాలు.. 20కోట్లు

Wed,September 11, 2019 12:52 AM

-నిమజ్జన ఏర్పాట్లపై మంత్రి , మేయర్‌ సమీక్ష
- ట్రై కమిషనరేట్ల పరిధిలో 50 వేల మంది పోలీసులు, అత్యాధునిక టెక్నాలజీతో బందోబస్తు
- ఉదయం 5 గంటలకు బాలాపూర్‌లో తొలిపూజ
-మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఖైరతాబాద్‌ విగ్రహం నిమజ్జనం
గణేశ్‌ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. నగరంలోని 32 ప్రాంతాల్లో జరిగే నిమజ్జన కార్యక్రమానికి రూ.20కోట్లతో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామని, ఖైరతాబాద్‌ వినాయకుడిని మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిమజ్జనం చేయనున్నట్లు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో సుమారు 55,000 గణేశ్‌ ప్రతిమలను ఏర్పాటు చేయగా, గడచిన నాలుగు రోజుల్లో 3600మినహా మిగిలినవన్నీ నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్‌ కాకుండా 26 చెరువులను సిద్ధం చేయడంతోపాటు 28 క్రేన్లను ఏర్పాటు చేశారు. రాచకొండ, బాలాపూర్‌ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన ర్యాలీ ట్యాంక్‌బండ్‌ వరకు 18 కిలోమీటర్ల మేర కొనసాగనున్నది. ఈ రూట్‌లోకి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 17 ప్రధాన ర్యాలీలు కలవనున్నాయి. ట్రై కమిషనరేట్ల పరిధిలో సుమారు యాభై వేలమందిలో పటిష్టమైన బందోబస్తు నిర్వహించనున్నారు. అలాగే టెక్నాలజీని ఉపయోగిస్తూ అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేసి అనుక్షణం ప్రత్యక్ష వీక్షణం చేయనున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 12 నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు బంద్‌ చేయనున్నారు.

ఖైరతాబాద్‌ /సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఖైరతాబాద్‌ వినాయకుడిని ఈ నెల 12న మధ్యాహ్నం ఒంటిగంటకల్లా నిమజ్జనం చేయనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఉదయం పదకొండు గంటలకు మండపం నుంచి తీసి మధ్యాహ్నం 12లోగా ఎన్టీఆర్‌ మార్గ్‌కి చేర్చుతామని చెప్పారు. ఈ భారీ విగ్రహం పూర్తిగా నీటిలో మునిగే విధంగా హుస్సేన్‌సాగర్‌లో 20అడుగులమేరకు పూడిక తొలగించినట్లు పేర్కొన్నారు. మంగళవారం మంత్రి తలసాని ఎన్టీఆర్‌ మార్గ్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో నిమజ్జన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో సుమారు 55000 గణేశ్‌ ప్రతిమలను ఏర్పాటుచేయగా, గడచిన నాలుగు రోజుల్లో 3600 మినహా మిగిలినవన్నీ నిమజ్జనం జరిగినట్లు పేర్కొన్నారు. మిగిలిన విగ్రహాలను చివరిరోజు 12న నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌ కాకుండా 26 కొలనులను సిద్ధంచేయడంతోపాటు 28 క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. మొహర్రం పండుగ సందర్భంగా కర్బలా మైదానంలో తగిన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని వివరించారు.

5500 మందితో బందోబస్తు..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గణేశ్‌ నిమజ్జనం కోసం సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ప్రత్యేక బందోబస్తు ప్రణాళికను రూపొందించారు. 5500 మందితో భద్రతను ఏర్పా టు చేస్తున్నారు. సైబరాబాద్‌ పరిధిలో ఉన్న మొత్తం 27 చెరువుల వద్ద సిబ్బందిని భద్రత కోసం మొహరించనున్నారు. మాదాపూర్‌, శంషాబాద్‌, బాలానగర్‌ జోన్లలో మొత్తం 10,188 గణేశ్‌ విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీని కోసం 27 చెరువుల వద్ద 36 స్టాటిక్‌, 54 మొబైల్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనం మార్గాల్లో విస్తృత తనిఖీలు చేపట్టడంతో పాటు అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనపడినప్పుడు సోదాలు జరుపనున్నట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. డ్రోన్‌ కెమెరాలకు అనుమతి లేదని సూచించారు.

550 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు :
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ విభాగం నగరంలోని అన్ని డిపోల నుంచి హుస్సేన్‌ సాగర్‌ నిమజ్జనానికి వచ్చే సందర్శకుల కోసం 550 బస్సులను సిద్ధం చేసింది. ఈ మేరకు గ్రేటర్‌ ఆర్టీసీ విభాగం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ అవకాశం 12, 13తేదీల్లో అందుబాటులో ఉంటుంది.

బాలాపూర్‌ శోభాయాత్ర .. ఉదయం పది తరువాతే
బాలాపూర్‌ వినాయకుడికి నిమజ్జనం ఉదయం ఐదు గంటలకు పూజలు ముగించుకొని ఆరు గంటలకు బాలాపూర్‌ పురవీధుల గుండా తొమ్మిది గంటలకు బొడ్రాయి దగ్గరకు చేరుకుంటుందని వినాయక ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నీరంజన్‌రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. తొమ్మిదిన్నరకు బాలాపూర్‌ వినాయకుని లడ్డూవేలం పాట మొదలు అవుతుందన్నారు. వేలంలో పాల్గొన్నాలనుకున్న వారు రూ.1000 డిపాజిట్‌ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు వంగేటి ప్రభాకర్‌రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి, శశిధర్‌రెడ్డి,రఘునందన చారి, ప్రభాకర్‌రెడ్డి, సత్యేనారాయణ, ఇంద్రారెడ్డి ఉన్నారు.

ఈనెల 12న జరిగే గణేశ్‌ నిమజ్జన కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. నగరంలోని 32 ప్రాంతాల్లో జరిగే నిమజ్జన కార్యక్రమానికి రూ.20 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన అధికారులతో జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

నిమజ్జన ఏర్పాట్లలో ముఖ్యమైనవి
-శోభాయాత్ర 391కిలోమీటర్లు జరుగనుండగా, ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పున 194 గణేశ్‌ యాక్షన్‌ టీమ్‌ల ఏర్పాటు.
-పారిశుధ్య కార్యక్రమాలకు 481 మంది సూపర్‌వైజర్లు, 719 మంది ఎస్‌ఎఫ్‌ఏలు, 9849 మంది పారిశుధ్య కార్మికుల నియామకం.
-ఒక్కో టీమ్‌లో ఒక శానిటరీ సూపర్‌వైజర్‌ లేక శానిటరీ జవాన్‌, ముగ్గురు ఎస్‌ఎఫ్‌ఏలు, 21 మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్టులుగా పనిచేస్తారు.
-నిమజ్జన ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్యశిబిరాలు, 92 మొబైల్‌ టాయిలెట్లు.
-జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 32ప్రాంతాల్లో 93 స్టాటిక్‌ క్రేన్‌లు, 134 మొబైల్‌ క్రేన్‌ల ఏర్పాటు.
-నిమజ్జనానికి శుభ్రమైన నీటితో 23 కొలనుల ఏర్పాటు.
-రూ.9.29 కోట్లతో రోడ్ల మరమ్మతులు, రీకార్పెటింగ్‌, గుంతలు పూడ్చివేత తదితర పనులు. మొత్తం 176పనులకు మంజూరీ.
-నిమజ్జనం జరిగే చెరువులవద్ద గజ ఈతగాళ్ల నియామకం.
-రూ.99.41లక్షల వ్యయంతో 36,674 తాత్కాలిక లైటింగ్‌ ఏర్పాటు.
-శోభాయాత్ర మార్గాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం.
-నిమజ్జనం పూర్తయిన వెంటనే విగ్రహాలను తొలగించడం.
-రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 12 కిలోమీటర్లమేర బారికేడింగ్‌, 75 జనరేటర్ల ఏర్పాటు.
-శోభాయాత్ర మార్గంలో 15 కేంద్రాల్లో వాటర్‌ప్రూఫ్‌ టెంట్‌ల ఏర్పాటు
-హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలగింపునకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 1000మంది నియామకం.
-వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో 115 శిబిరాల ద్వారా పంపిణీకి వాటర్‌ ప్యాకెట్లు
-శోభాయాత్ర మార్గాల్లో 36 ఫైర్‌ ఇంజన్ల ఏర్పాటు.
-సరూర్‌నగర్‌, కాప్రా, ప్రగతినగర్‌ తదితర చెరువుల వద్ద ప్రత్యేకంగా మూడు బోట్లు ఏర్పాటు.
-పర్యాటకశాఖ ద్వారా హుస్సేన్‌సాగర్‌లో ఏడు బోట్లు, నాలుగు స్పీడ్‌ బోట్లు ఏర్పాటు. పదిమంది గజ ఈతగాళ్ల నియామకం.
-విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 48విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు. సరూర్‌నగర్‌ చెరువు వద్ద మరో ఐదు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు.
-నగరంలోని ఇతర ప్రాంతాల్లో 101 అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు.

349

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles