పారిశుధ్య తనిఖీలు

Wed,September 11, 2019 12:49 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను మరింత మెరుగుపర్చేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్న మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు మంగళవారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ సహా అధికారులు, కార్పొరేటర్లు నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను పరిశీలించడంతోపాటు డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఇండ్లను తనిఖీచేసి దోమల ఉత్పత్తి కేంద్రాలు, నీటినిల్వ ఉండే గుంతల్లో మందు పిచికారీ చేయడం, పాత్రల్లో నిల్వనీటి తొలగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌ స్వయంగా తన నివాసంలోని పూల మొక్కల కుండీలు, ఇతర ప్రాం తాల్లో నీరు నిల్వలేకుండా ఉండేలా తనిఖీ నిర్వహించారు. మేయర్‌ రామ్మోహన్‌ ఉద యం ఏడు గంటలకే లాలాపేట్‌లోని వినోబానగర్‌కు చేరుకొని స్థానికులతో మాట్లాడుతూ తమతమ ఇండ్లలోని నీటి నిల్వలను వెంటనే తొలగించుకోవాలని సూచించారు. అనంతరం తార్నాక హెచ్‌ఎండీఏ కార్యాలయం బయట ఉన్న బస్‌ షెల్టర్‌ను పరిశీలించి అక్కడ బస్సులు సులభంగా వెళ్లడానికి వీలుగా ప్రత్యేకంగా బస్‌బేను ఏర్పాటుచేయాలని జోనల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం మాణికేశ్వర్‌నగర్‌లో పర్యటించి స్థానికులకు సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించారు. అంతేకాదు స్వయంగా ఇండ్లలో నీరు నిల్వవున్న తొట్టెలను ఖాళీచేయడం, సంపులు, పాత ట్యాంకులను పరిశీలించి నీటిని తొలగించారు. నీటి నిల్వల్లో ఉన్న లార్వాను ఎంటమాలజీ విభాగం ద్వారా తీసి వారికి చూపించడం, దానిద్వారా తలెత్తే అనర్థాలను వారికి వివరించడం విశేషం. డెంగీ వ్యాధి నిల్వనీటిలో ఉండే దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని, ప్రతి ఒక్కరూ నిల్వనీటిని తొలగించుకోవాలని సూచించారు. జ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కావని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్లను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు నీటి తొట్లు, పూల కుండీల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని మేయర్‌ విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ ఆర్సీ పురం కార్పొరేటర్‌ అంజయ్యతో కలిసి రామచంద్రాపురం, ఎస్‌ఎన్‌ కాలనీ, బీహెచ్‌ఈఎల్‌, గోపన్‌పల్లి తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నీటి నిల్వ ప్రాంతాలను స్వయంగా పరిశీలించి వాటి ని తొలగించాల్సిందిగా స్థానికులను కోరారు. కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ ట్యాంక్‌బండ్‌, ఇందిరపార్క్‌ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను, స్థానిక గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను పరిశీలించారు. ఆరోగ్య విభాగం అదనపు కమిషనర్‌ సందీప్‌ జా బన్సీలాల్‌పేట్‌లోని బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ అందిస్తున్న వైద్య సేవలు, వైద్య పరీక్షల గురించి రోగులతో అడిగి తెలుసుకున్నారు. జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, కార్పొరేటర్లు కూడా తమతమ జోన్లు, సర్కిళ్లు, డివిజన్లలో తనిఖీలు నిర్వహించారు.

194

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles