ప్రతి అణువు వీక్షిస్తూ.. సెకన్లలో వాలిపోయేలా

Wed,September 11, 2019 12:45 AM

-రాచకొండ పరిధిలో గణేశ్‌ నిమజ్జనానికి టెక్నాలజీ బందోబస్తు
-46 జంక్షన్‌లలో అత్యాధునిక కెమెరాలు
-ఏడు చెరువుల వద్ద 205, 3 మౌంటెడ్‌ కెమెరాలు
-వారం ముందు నుంచే సీసీ కెమెరాలతో పహారా
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గణేశ్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, ఆనందాయక వాతావరణంలో నిర్వహించేందుకు రాచకొండ పోలీసు కమిషనరేట్‌ అధికారులు పకడ్బందీ, పటిష్టమైన బందో బస్తును ఏర్పాటు చేశారు. చీమ చిటుకుమన్నా పోలీసులకు సెకన్లలో సమాచారం అందేలా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించడంలో రాచకొండ ఐటీ సెల్‌ విభాగం కీలకంగా పనిచేస్తుంది. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో నిమజ్జనానికి దారి తీసే 46 జంక్షన్‌లు, ఇతర మార్గాలు, చెరువుల వద్ద ప్రతి దృశ్యాన్ని వీక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సిబ్బంది బందోబస్తు కాకుండా టెక్నాలజీతో కూడిన బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఏడు చెరువులు.. 46 జంక్షన్‌లు
రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో దాదాపు 10 వేల వినాయక విగ్రహాలు ఈ నెల 12న నిమజ్జనం కానున్నాయి. నిమజ్జనాలు సఫిల్‌గూడ, కాప్రా, బోయిన్‌పల్లి, చర్లపల్లి, రాంపల్లి, ఏదులాబాద్‌, ఇనామ్‌ గూడ, సరూర్‌నగర్‌, జల్‌పల్లి ప్రాంతాల్లో జరుగనున్నాయి. అయితే నిమజ్జన ఊరేగింపులను మొత్తం వీక్షించేందుకు హైదరాబాద్‌ సేఫ్టీ ప్రాజెక్ట్‌లో భాగంగా 46 జంక్షన్లలో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు 46 జంక్షన్‌లలో చోటు చేసుకునే ప్రతి దృశ్యాన్ని పోలీసులు వీక్షించేలా కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు. దీంతో అక్కడి ప్రతి దృశ్యాన్ని నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అదేవిధంగా ఏడు చెరువుల వద్ద దాదాపు 205 కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా చెరువు పరిసరాలతో పాటు కిలో మీటర్‌ దూరంలో గుంపులోని ప్రతి అణువును వీక్షించే విధంగా కెమెరాలను ఏర్పాటు చేశారు. 205 కెమెరాలను రాచకొండ పోలీసు కంట్రోల రూమ్‌కు అనుసంధానం చేశారు. అదే విధంగా ఈ కెమెరాలతో ఏ మార్గంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విషయాలను పోలీసు కమిషనర్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులకు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి నెట్‌వర్క్‌ను సిద్ధం చేశారు. ఈ విధంగా సిబ్బంది బందోబస్తు కాకుండా టెక్నాలజీతో నిమజ్జన చెరువులు, మార్గాలను రాచకొండ పోలీసులు దిగ్భందం చేశారు. 3 మౌంటెడ్‌ కెమెరాల ద్వారా జనం రద్దీలో తింపుతూ అనుమానితులను గుర్తించేందుకు కూడా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు.

ప్రతి దృశ్యం స్పష్టంగా..
గణేశ్‌ నిమజ్జనానికి ఎలాంటి అంతరాయం, ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. సీసీ కెమెరాలు, ఎల్‌అండ్‌టీ కెమెరాల ద్వారా ప్రతి మార్గంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు విశ్లేషించుకునే మ్యాపింగ్‌ను చేశాం. ట్రాఫిక్‌ రద్దీ లేకుండా చూసేందుకు, రహదారులను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాం. ఐటీ సెల్‌ విభాగం గత వారం రోజుల నుంచి 50 మంది సిబ్బందితో ఇప్పటికే నిమజ్జనం జరిగే చెరువులతో పాటు 46 జంక్షన్లలో జరుగుతున్న వ్యవహరాలను గమనిస్తున్నాం.
-శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రాచకొండ ఐటీ సెల్‌

216

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles