20న జీహెచ్‌ఎంసీ బాండ్ల జారీ!

Wed,August 14, 2019 12:37 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మున్సిపల్ బాండ్లను జారీచేయడం ద్వారా రూ.305కోట్లు సమీకరించేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. మార్కెట్ అనుకూలంగా ఉంటే, అంటే తక్కువ వడ్డీ ధరకు నిధులు లభించే అవకాశముంటే ఈనెల 20న బాండ్లు జారీచేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి ఇదివరకే బల్దియా స్థాయీసంఘం ఆమోదం తెలుపగా, కేంద్ర ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించే స్థానిక సంస్థలకు సహాయంగా గరిష్టంగా రూ.26కోట్ల వరకు నిధులు ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది.

మూడో విడుతలో రూ.305 కోట్లు సమీకరణే లక్ష్యంగా..
స్థానిక సంస్థలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా నిధులు సమకూర్చుకోవాలన్న సంకల్పంతో జీహెచ్‌ఎంసీ వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ) కోసం బాండ్ల జారీ ద్వారా రూ.1000కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల్లో రూ.395కోట్లు సేకరించగా, తాజాగా రూ.305కోట్లు సేకరించాలని నిశ్చయించారు. మూడవ విడుత నిధుల సమీకరణకు గత జూన్ మాసంలోనే స్థాయీసంఘం ఆమోదం తెలిపింది. దీంతో గత జూలైలోనే బాండ్లు జారీచేయాలని నిశ్చయించినప్పటికీ స్టాక్‌మార్కెట్ ఒడుదుడుకులను ఎదుర్కొనడంవల్ల పెట్టుబడిదారులు ముందుకొచ్చే అవకాశంలేదని భావించి వెనక్కితగ్గారు. తాజాగా మార్కెట్ మెరుగవడంతోపాటు బల్దియాకు సైతం నిధుల కొరత ఏర్పడడంతో సాధ్యమైనంత తొందరలోనే నిధులు సేకరించే లక్ష్యంతో ఈనెల 20వ తేదీని ఖరారుచేశారు.

ఇప్పటివరకు రూ.395 కోట్లు సేకరణ
వాస్తవానికి ఎస్‌ఆర్‌డీపీ కోసం రూ. 2500కోట్ల నిధులు సమీకరించాలని నిర్ణయించగా, అందులో రూ.1000 కోట్లు మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా, మిగిలిన రూ.1500కోట్లు వివిధ ఆర్థిక సంస్థలనుంచి రుణం రూపంలో సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలోనే బొంబాయి స్టాక్ మార్కెట్‌లో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా గత ఏడాది ఫిబ్రవరిలో రూ.200 కోట్లు, అలాగే ఆగస్టులో రూ.195కోట్లు కలిపి మొత్తం ఇప్పటివరకు రూ.395 కోట్లు సేకరించారు. మొదటి విడతలో 8.9శాతం వడ్డీరేటుపై రూ.200 కోట్లు సేకరించగా, రెండో విడత 9.38వడ్డీ రేటుపై మరో రూ.195 కోట్లు సమీకరించడం విశేషం.

దేశంలోనే మొదటి స్థానంలో జీహెచ్‌ఎంసీ
దేశంలోనే ఇంత భారీమొత్తంలో బాండ్ల ద్వారా నిధులు సేకరించిన మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ ఖ్యాతిని సొంతం చేసుకుంది. గడిచిన పదేండ్లలో రెండుసార్లు బాండ్లు జారీచేసిన కార్పొరేషన్ కూడా ఒక్క జీహెచ్‌ఎంసీయే కావడం విశేషం. పూణే, ఇండోర్‌లు మాత్రమే గత పదేండ్లలో బాండ్లను జారీచేయగా, జీహెచ్‌ఎంసీ ఇప్పటికి రెండుసార్లు బాండ్లను జారీచేసి మూడోసారి జారీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. బాండ్ల ద్వారా నిధులు సేకరించుకున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా గత ఏడాది లక్నోలో జరిగిన ఓ సమావేశంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి జీహెచ్‌ఎంసీకి రూ.26కోట్ల చెక్కును అందజేసిన విషయం విధితమే.

187

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles