బాధ్యులకు భారీ జరిమానాలు..

Thu,June 20, 2019 12:27 AM

-స్వచ్ఛతకు భంగం కలిగిస్తున్న వారిపై బల్దియా ప్రధాన దృష్టి
-25 రోజుల్లో రూ.26 లక్షలు వసూలు
-ఒకరికి లక్ష జరిమానాసిటీబ్యూరో:స్వచ్ఛతపై బల్దియా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఇందులో భాగంగా నిబంధనలను ఉల్లంఘించేవారిపట్ల ఉక్కుపాదం మోపుతున్నది. గడచిన 25రోజుల్లో దాదాపు రూ. 26 లక్షలు జరిమానాల రూపంలో వసూలు చేయడమే ఇందుకు నిదర్శనం. కాగా, మొదటిసారి స్వచ్ఛ కార్యక్రమాల ఉల్లంఘనలకు సంబంధించి ఒక్కరికే లక్ష జరిమానా విధించడం విశేషం. స్వచ్ఛతకు భంగం కలిగిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ.. ఇందుకు బాధ్యులైనవారికి భారీగా జరిమానాలు విధించేందుకు గతనెల 24 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై వేయడం, రోడ్లపై చెత్త వేయడం, చెత్తను తగులబెట్టడం, నాలాలో వ్యర్థాలు వేయడం, బహిరంగ మలమూత్ర విసర్జన తదితర ఉల్లంఘనలకు బాధ్యులైన వారికి రూ. 100 నుంచి ఒక లక్ష రూపాయల వరకు జరిమానాలు విధిస్తున్నారు. తడిచెత్త, పొడిచెత్తను విడివిడిగా వేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిలో చైతన్యం తెచ్చేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు చేపడుతున్న స్వచ్ఛ కార్యక్రమాలవల్ల ఆశించిన ఫలితాలు రావడంలేదు. సాఫ్ హైదరాబాద్, షాన్‌దార్ హైదరాబాద్ పేరుతో స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతూ,ఇందులో భాగంగా నిబంధనలను ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. గత మేనెల 24వ తేదీ నుంచి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు మొత్తం 1600 మంది నుంచి దాదాపు రూ. 26 లక్షల జరిమానాలు వసూలు చేశారు.

వెస్ట్‌జోన్‌లో అధిక జరిమానాలు...
మొత్తం గ్రేటర్‌లో రూ. 26 లక్షలు జరిమానాలు వసూలుచేయగా, అందులో రూ. 10లక్షలు వసూలుచేసి వెస్ట్‌జోన్ మొదటిస్థానంలో నిలిచింది. చందానగర్‌లో అత్యధికంగా 169 మంది నుంచి రూ. 7.07 లక్షలు వసూలు చేయగా, శేరిలింగంపల్లిలో 60 మంది నుంచి రూ. 3.38 లక్షలు వసూలు చేశారు. అంతేకాదు, ఇదేజోన్ పరిధిలోని అయ్యప్పసొసైటీలో బుధవారం వ్యర్థాలను నాలాల్లో వేయడం, సిల్ట్‌చాంబర్‌ను నిర్మించకపోవడం, మురుగునీరు రోడ్డుపై వదలడం, నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా వేయడం తదితర కారణాలకు ఇన్నర్ చెఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే క్యాటరింగ్ రెస్టారెంట్‌కు రూ. లక్ష జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ సర్కిల్‌లో 125 మంది నుంచి రూ. 1.56 లక్షలు, ఖైరతాబాద్ సర్కిల్‌లో 122 మంది నుంచి రూ. 1.76 లక్షలు వసూలు చేశారు. ఇకముందు కూడా నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. జరిమానాలు ఆదాయం పెంచుకునేందుకు కాదని, నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని జాగృతం చేసేందుకేనని వారు వివరించారు.

145

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles