పొల్యూషన్‌కు..సొల్యూషన్

Thu,June 20, 2019 12:26 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమల భరతం పట్టేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) బ్రహ్మాస్ర్తాన్ని ప్రయోగించనున్నది. ఉల్లంఘనలకు పాల్పడుతూ కాలుష్య కుమ్మరించిన వారిపై కఠినంగా వ్యవహరించనున్నది. ఇక నుంచి ఎవరైనా కాలుష్యాన్ని వెదజల్లితే వారిపై పర్యావరణ పరిహారం (ఎన్విరాన్‌మెంటల్ కాంపెన్‌సేషన్)ను విధించి ముక్కుపిండి వసూలు చేయబోతున్నది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ వద్ద దాఖలైన కేసు నంబర్ ఓఏ నంబర్ 593/2017ను రిట్‌పిటిషన్‌ను విచారించి కాలుష్య కారకులపై పర్యావరణ పరిహారాన్ని విధించాలని తీర్పును వెలువరించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) కి ఈ అధికారాలను కట్టబెట్టింది. ఇందుకోసం సీపీసీబీ కమిటీని నియమించి ఏ ఉల్లంఘనలకు ఎంత పరిహారం విధించాలో నివేదికను రూపొందించి, రాష్ర్టాలకు బోర్డులకు పంపించింది. ఈ ఆదేశాలందుకున్న తెలంగాణ బోర్డు అధికారులు కాలుష్య కారక పరిశ్రమల నుంచి పరిహారాన్ని వసూలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. పొల్యూటర్స్ టు పే సూత్రాన్ని అనుసరించి కాలుష్యానికి కారకులైన వారి నుంచే పరిహారాన్ని వసూలు చేయనున్నారు. వాయు, జల కాలుష్యం, ప్లాస్టిక్, పారిశ్రామిక వ్యర్థజలాలు, ఘన వ్యర్థాల ద్వారా కాలుష్యం వెదజల్లితే ఏ మాత్రం రెండో ఆలోచన లేకుండా పరిహారాన్ని వసూలు చేస్తారు. ఉల్లంఘనలకు పాల్పడ్డ రోజు నుంచి ఎన్ని రోజులకు పాల్పడితే అన్ని రోజులకు పరిహారాన్ని వసూలు చేస్తారు.

ప్రజారోగ్యంతో చెలగాటం..
హైదరాబాద్ చుట్టు పక్కల గల పారిశ్రామికవాడల్లో వందలాది పరిశ్రమలున్నాయి. జీడిమెట్ల, బాలానగర్, కూకట్‌పల్లి, ఐడీఏ బొల్లారం, పటాన్‌చెరు, పాశమైలారం, మేడ్చల్, సనత్‌నగర్, కాటేదాన్, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, మహేశ్వరం తదితర పారిశ్రామివాడల్ల్లో గల పరిశ్రమలు జల, వాయు, శబ్ద, కాలుష్యాలకు కారణమవుతున్నాయి. విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలంతా కాలుష్య కాటుకు బలవుతున్నారు. కాలుష్య వాయువులను పీల్చుకొని, కలుషిత జలాలను తాగి ప్రజలు వ్యాధుల భారినపడుతున్నారు. పర్యావరణ చట్టాల ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడుతున్న పరిశ్రమలపై ఇటీవలి కాలంలో పీసీబీ కఠినంగానే వ్యవహరిస్తున్నది. రోలింగ్ టాస్క్‌ఫోర్స్.. నైట్‌పెట్రోలింగ్ విభాగాలు దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నాయి. దొరికిన వారికి మూసివేతలు, కౌన్సెలింగ్‌లు.. బ్యాంక్ గ్యారెంటీలతో హడలెత్తిస్తున్నారు. ఇటీవల 254 పరిశ్రమలను మూసివేయడమే, కాకుండా మరో 396 పరిశ్రమలకు డైరెక్షన్లు జారీచేసి, లోపాలు సరిదిద్దుకొనే అవకాశమిచ్చారు. అయితే ఈ హెచ్చరికలతో ఫలితం లేకుండా పోతున్నది. పరిశ్రమలను మూసివేయించినా.. తెల్లవారే.. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి స్టేలు తెచ్చుకుంటున్నారు. తిరిగి పారబోతలను అలవాటు చేసుకుంటున్నారు. ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. తాజాగా విధించే పర్యావరణ పరిహారంతోనైనా పరిశ్రమలు దారికొస్తాయని పీసీబీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా చేస్తే చెల్లించుకోవాల్సిందే..
- నిబంధనలను ఉల్లంఘించి వ్యర్థ జలాలను పారబోస్తే, భూ, జల, వాయు కాలుష్యాలకు కారణమైతే.
- పర్యావరణ చట్టాలను పాటించకుండా, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండకుండా, ప్రమాణాలను పాటించకపోతే.
- ఆన్‌లైన్ నిఘా కోసం ఓసీఈఎంఎస్ పరికరాలను అమర్చుకోకపోతే.n లీకేజీలు, పొరపాట్ల వల్ల పర్యావరణానికి హానితలపెడితే.
- కావాలని ప్రమాదకర రసాయన వ్యర్థజలాలను కుమ్మరిస్తే
- శుద్ధిచేయని, కొంతమేర శుద్ధిచేసిన వ్యర్థజలాలను, రసాయన జలాలను పారబోస్తే
ఢిల్లీలో భారీగా..
కాలుష్యంతో కకావికలమవుతున్న ఢిల్లీలో విధించే పరిహారం భారీగా ఉండనున్నది. కాలుష్యాన్ని అదుపు చేసేందుకు, ఉల్లంఘనుల అటకట్టించేందుకు పరిహారాన్ని అధిక మొత్తంగా విధిస్తున్నారు. పరిశ్రమల నుంచి వాయు ఉద్ఘారాలు పెరిగితే అత్యధికంగా రూ. కోటి వరకు పర్యావరణ పరిహారం కింద వసూలు చేస్తున్నారు. 20 వేల చదరపు అడుగులు మించిన నిర్మాణాలు చేస్తున్నప్పుడు కాలుష్యం వెదజల్లితే కోటి రూపాయలను, చెత్తను డంప్ చేస్తే రూ. 25 లక్షలు, రోడ్లపై దుమ్ముధూళి పోగయితే రూ. 25 లక్షలను పరిహారంగా వసూలు చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది.

130

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles