హైవేలో వంద కిలోమీటర్లకు ఒక ట్రామా

Mon,June 17, 2019 03:41 AM

ఖైరతాబాద్: హైవేల్లో ప్రతి వంద కిలోమీటర్లకు ఒక ట్రామా కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యశాల రుమటాలజీ విభాగం ఆధ్వర్యంలో వాక్ ఫర్ రోడ్ సేఫ్టీ నినాదంతో ఆదివారం నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వద్ద 2కే వాక్ నిర్వహించారు. ఈ వాక్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌తో పాటు నిమ్స్ మాజీ డైరెక్టర్ పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు, జీఎంఆర్ సంస్థ సీఈవో ఎస్‌జీకే కిశోర్ బాబు, కిమ్స్ రుమటాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్‌చంద్రమౌళితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రోడ్డు భద్రత కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, కానీ వ్యక్తిగత అవగాహన చాలా ముఖ్యమన్నారు. కేవలం వాక్‌లు చేస్తే సరిపోదని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని అనుకుంటే సాధ్యమవుతుందన్నారు. మానవుడి భవిష్యత్, అతనికి జీవితం పదిలంగా ఉండాలంటే తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే అతని కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అన్ని భద్రతా ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించినా.. అతి వేగం, స్వియ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. త్వరలోనే ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పెట్రో వాహనాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. ఎలాంటి ప్రమాదం జరిగినా అత్యవసర చికిత్స అందించడం ద్వారా మనిషి ప్రాణాలను రక్షించవచ్చన్నారు. ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి కారులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండేలా నిబంధనలను తీసుకొచ్చి అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ జోన్ జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్, సైక్రియాటిస్ట్‌లు డాక్టర్ పూర్ణిమ, ఎ.నాగరాజు, విద్యార్థులు, యువతీ, యువకులు పాల్గొన్నారు.

151

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles