అక్టోబర్‌ నాటికి.. దుర్గం వారధి

Sun,June 16, 2019 02:13 AM

-మూడు లేన్ల రహదారితో పాటు వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌లు
-10 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ లైటింగ్‌ సిస్టం
-తీగల బ్రిడ్జి పనులను పరిశీలించిన అధికారులు
సిటీబ్యూరో, కొండాపూర్‌:దుర్గం చెరువు తీగల వంతెన నిర్మాణ పనులు ఈ ఏడాది అక్టోబర్‌ చివరికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌ తెలిపారు. పనులు ఎటువంటి ప్రమాదాలకు తావులేకుండా అత్యంత సురక్షితంగా, నాణ్యంగా, వేగంగా కొనసాగుతున్నాయన్నారు. దుర్గం చెరువు తీగల వంతెన పనులను శనివారం ప్రభుత్వ మున్సిపల్‌ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ దానకిశోర్‌ మీడియాతో మాట్లాడుతూ, మూడులేన్ల వాహనాల రహదారితోపాటు ఇరువైపులా వాకింగ్‌ ట్రాక్‌, సైక్లింగ్‌ ట్రాక్‌ను కూడా ప్రత్యేకంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సుమారు రూ. 10కోట్ల వ్యయంతో అత్యంత ఆకర్షణీయమైన ఇంటిగ్రేటెడ్‌ లైటింగ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్ట్రీట్‌లైట్లు, ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైటింగ్‌ మొత్తం బ్రిడ్జి పిల్లర్లలోనే అమర్చనున్నట్లు చెప్పారు. అలాగే, బ్రిడ్జికి ఇరువైపులా స్టీల్‌ రేలింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ మధ్య దూరం గణనీయంగా తగ్గుతుందని, అలాగే జూబ్లీహిల్స్‌నుంచి మైండ్‌స్పేస్‌, గచ్చిబౌలిలకు వెళ్లేవారికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. రూ. 180 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్‌ పనులు పూర్తయితే నగరానికి సరికొత్త ఆకర్షణ ఉండడంతో పాటు పర్యాటకరంగంలో మరో ఐకానిక్‌ రూపొందుతుందని అధికారులు తెలిపారు. దుర్గం చెరువు పనులు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు మిలియన్ల పనిగంటలు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కేబుల్‌ బ్రిడ్జిని సందర్శించిన వారిలో జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టుల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీధర్‌, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం డైరెక్టర్‌ వెంకట నర్సింహారెడ్డి, శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ హరిచందన ఇతర అధికారులు ఉన్నారు.

గుట్కా రవాణా...
పోలీసుల తనిఖీల్లో గుట్టురట్టు.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్‌
సుమారు రూ.15 లక్షల విలువ చేసే గుట్కా స్వాధీనం
శామీర్‌పేట : నిషేధించిన గుట్కా ప్యాకెట్లను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శామీర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.15 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథ నం ప్రకారం ... నల్గొండకు చెందిన ఇ.యాదగిరి, మాదాపూర్‌ చంద్రనాయక్‌ తండా కు చెందిన అశోక్‌కుమార్‌, చాంద్రాయణగుట్ట బాబానగర్‌కు చెందిన మహ్మద్‌ సోహెబ్‌లు గుట్కా ప్యాకెట్ల దందా చేస్తున్నారు. కాగా.. శనివారం శామీర్‌పేట ఓటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో వచ్చిన మూడు కార్లు(టీఎస్‌05ఈవీ5005, ఏపీ10ఏక్యూ1566, ఏపీ28సీజీ9570)ను తనిఖీ చేయగా గుట్కాప్యాకెట్లు లభించాయి. వెంటనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నల్గొండ, కరీంనగర్‌, బీదర్‌ ప్రాంతాల్లో గుట్కా వ్యాపారస్తులకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. నిందితుల నుంచి 5 ఫోన్లు, మూడు కార్లు, సుమారు 15 లక్షల విలువ చేసే 30బ్యాగుల మీరాజ్‌ కైనీ, 20 బ్యాగుల విమల్‌ గు ట్కా, 80 ప్యాకెట్ల ఆర్‌ఎండీ-120, తంబాకును స్వాధీనం చేసుకున్నారు.

328

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles