రౌండ్‌కు అరగంట..వీడనున్న ఉత్కంఠ

Thu,May 23, 2019 12:15 AM

-ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
-సాయంత్రం 5 తర్వాతే తుది ఫలితం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ; దాదాపు నెలన్నరగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు నేడు తెరపడనున్నది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లోక్‌సభ స్థానాల పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. రౌండ్‌కు 14 ఈవీఎంల చొప్పున లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌కు అరగంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని రెండు లోక్‌సభ స్థానాలు, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మేడ్చల్‌లోని మల్కాజిగిరి ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి, అనంతరం ఈవీఎంల ఓట్లు కౌంట్ చేస్తారు. సాయంత్రం 5 గంటల తర్వాతే తుది ఫలితం వెల్లడయ్యే అవకాశమున్నది.

ఉత్కంఠకు తెరపడనున్నది. నేడు ఎంపీ అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానున్నది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపడుతారు. మొదటి అరగంట వరకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగనుండగా, మొదటి రౌండ్ ఫలితం ఉదయం తొమ్మిదిన్నర గంటల తరువాత వెలువడనున్నది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ స్థానాలకుగాను ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. బుధవారం ర్యాండమైజేషన్ ద్వారా ఆయా నియోజకవర్గాలకు సిబ్బందిని ఎంపికచేయగా, నియోజకవర్గాల వారీగా ఎవరు ఏ టేబుల్‌పై ఓట్లు లెక్కించాలో గురువారం ఉదయం ఓట్ల లెక్కింపునకు ముందు ర్యాండమైజేషన్ ద్వారా నిర్ణయిస్తారు.

అంతకుముందు ఉదయం ఆరు గంటలకు అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ కేంద్రాల తాళాలను తెరిచి ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఈవీఎంల లెక్కింపు పూర్తయిన అనంతరం ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఐదు చొప్పున లాటరీ పద్ధతిలో వీవీ ప్యాట్‌లను ఎంపిక చేసి వాటి ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఎంతలేదన్నా వీటికి మరో అర్థగంట సమయం పట్టే అవకాశమున్నది. మొత్తం ఒక్కో అసెంబ్లీ స్థానానికి 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్‌లో 14 ఈవీఎంల చొప్పున లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌కు అరగంట చొప్పున సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఐదు వీవీ ప్యాట్‌ల ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తదితర వాటికి మరో గంటన్నర సమయం పడుతుంది. దీన్నిబట్టి తుది ఫలితం వెల్లడి ఎంతలేదన్నా సాయంత్రం ఐదు గంటల తరువాతే వెలువడుతుందని చెప్పవచ్చు. ఒకవేళ ఏదైనా కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు రీకౌంటింగ్ కోరితే ఆ స్థానానికి సంబంధించిన ఫలితం వెల్లడిలో జాప్యం జరుగుతుంది.

ఫలితాల వెల్లడి ఇక్కడి నుంచే..
సికింద్రాబాద్ నియోజవర్గం ఫలితం ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ రాంరెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి వెలువడనుండగా, హైదరాబాద్ నియోజకవర్గం ఫలితం నిజాం కాలేజీ నుంచి వెల్లడించనున్నారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు ఇక్కడే ఉండి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడంతో పాటు ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తారు. అందుకే వీరు అక్కడి నుంచి ఫలితాన్ని వెల్లడిస్తారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని మలక్‌పేట స్థానం లెక్కింపు అంబర్‌పేట స్టేడియంలో చేపట్టనుండగా, గోషామహల్ స్థానం లెక్కింపు కోఠి ఉమెన్స్ కాలేజీ, బహదూర్‌పురా, కార్వాన్ స్థానాల లెక్కింపు మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో, చార్మినార్ లెక్కింపు కమలానెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీ, చాంద్రాయణగుట్ట లెక్కింపు నిజాం కాలేజీ లైబ్రరీ హాల్, యాకుత్‌పురా లెక్కింపు వనిత మహిళా కాలేజీలో నిర్వహిస్తారు. అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని ముషీరాబాద్, నాంపల్లి స్థానాల ఓట్ల లెక్కింపు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనుండగా, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ స్థానాల లెక్కింపు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో చేపడుతారు. సికింద్రాబాద్ లెక్కింపు ఉస్మానియా దూరవిద్యాకేంద్రం, సనత్‌నగర్ ఓయూ ఎంబీఏ కాలేజీ, అంబర్‌పేట లెక్కింపు రెడ్డి ఉమెన్స్ కాలేజీలో నిర్వహిస్తారు. కాగా, మాసాబ్‌ట్యాంక్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని బుధవారం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ దానకిశోర్ పరిశీలించారు. అంతకుముందు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల పరిశీలకుల సమక్షంలో సిబ్బంది ర్యాండమైజేషన్‌ను నిర్వహించారు. ముఫకంజా కాలేజీలో నిర్వహించిన సిబ్బంది శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు.

పర్యవేక్షించిన కలెక్టర్
శంషాబాద్‌లోని పాలమాకుల ఇంజినీరింగ్ కళాశాల్లో చేవెళ్ల ఎంపీ స్థానానికి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్, ఆర్డీవో చంద్రకళ, పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒక అసెంబ్లీకి 14 టేబుళ్ల ద్వారా ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు.

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై శిక్షణ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుందని, ఇందులో ఎలాంటి పొరపాట్లు లేకుండా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ల ఇన్‌చార్జి కేఎస్‌బీ కుమారీ సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విధానంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మొదట 13- సీ ఫారం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, డూప్లికేట్ ఓటా, లేక అసలు ఓటా అని నిర్ధారించాలని, తర్వాత డూప్లికేట్ కాదని నిరూపించుకున్న తర్వాత 13- ఏను తెరువాలని, అంతా సవ్యంగా ఉంటే పోస్టల్ బ్యాలెట్ పేపర్ అయిన 13 - బీ కవర్‌ను తెరిచి ఎవరికీ ఓటు పడిందో వెల్లడించాలని సిబ్బందికి సూచించారు. హైదరాబాద్ పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును నిజాం కాలేజీ లైబ్రరీ భవనం మొదటి అంతస్తులో లెక్కించనున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని పోస్టల్స్ ఓట్లను ఒకే చోట లెక్కిస్తారు. సికింద్రాబాద్ పార్లమెంట్‌కు పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపును ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ భవనంలోని మొదటి అంతస్తులో లెక్కిస్తారు.

313

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles