ప్లాస్టిక్ పరిశ్రమలపై పీసీబీ కొరడా

Thu,May 23, 2019 12:10 AM

సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : నివాస ప్రాంతాల్లో గల కాలుష్య కారక ప్లాస్టిక్ పరిశ్రమలపై పీసీబీ అధికారులు కొరడా ఝలిపించారు. లైసెన్స్‌లు పొందకుండా, పర్యావరణ చట్టాలను పాటించకుండా ఇష్టారీతిన నడుపుతున్న వాటిపై ఉక్కుపాదం మోపారు. నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టుగా ఉన్న వాటిపై చర్యలకు ఉపక్రమించారు. ఇలా నగరంలో గల 23 ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలను మూసివేశారు. సుమారుగా ఒకే సారి ఇంత మొత్తంలో పరిశ్రమలను మూసివేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పర్యావరణ చట్టాల ప్రకారం లైసెన్స్‌లు పొందాలని, నివాస ప్రాంతాల్లో ఉన్న యూనిట్లను తక్షణమే తరలించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మూసీనదిని అనుకుని ఉన్న బహద్దూర్‌పుర, కాటేదాన్, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. వాస్తవికంగా ఇవి పీసీబీ నుంచి అథరైజేషన్(లైసెన్స్) పొందిన తర్వాతే నడుపాలి. కాని గత 15 ఏండ్ల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. పైగా ప్లాస్టిక్ కవర్ల తయారీ సమయంలో కాలుష్యం వెలువడుతున్నది. దీనిపై స్థానికంగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్పందించిన అధికారులు ఆయా పరిశ్రమలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదే అంశంపై పరిశ్రమల యజమానులు హైకోర్టుకు వెళ్లినట్లుగా సమాచారం.
హానికరం..
-ప్లాస్టిక్ రాకాసిగా మారి పర్యావరణానికి అత్యంత చేటుచేస్తున్నది. వీటి నుంచి ప్రమాదకర థాలెట్స్, బిస్‌ఫినాల్‌లు వెలువడుతాయి.
-ప్లాస్టిక్‌ను ఇష్టారీతిన కాల్చితే డయాగ్జిన్లు, ఫ్యూరాన్లు వెలువడే అవకాశముంది.
-ప్లాస్టిక్ ఉత్పత్తి సమయంలో కార్బన్‌మోనాక్సైడ్, క్లోరిన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, డయాగ్జిన్లు, ఫ్యూరాన్లు, అమినిస్, నైట్రేడ్స్, ైస్లెరేన్, బెంజీన్, బూటాడిన్‌లు వెలువుడుతున్నాయి.
-హెచ్‌డీపీఈ, ఎల్‌డీపీఈ పైపుల తయారీ సమయంలో సీసం, కాడ్మియం, పిగ్మెంట్స్‌లు వాతావరణంలో కలుస్తున్నాయి.

259

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles