పిల్లలకు వింత అనుభూతినిచ్చేలా డైనో వరల్డ్ పార్కు

Thu,May 23, 2019 12:10 AM

అబ్దుల్లాపూర్‌మెట్ : పిల్లలకు వింత అనుభూతిని కలిగించే తరహాలో డైనో వరల్డ్ పార్కు అద్భుతంగా ఉందని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన డైనోసార్ థీమ్ పార్కును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. యానిమెట్రానిక్స్ నేపథ్యంలో పార్కులో తీర్చిదిద్దిన డైనోసార్స్‌ను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 35 రకాల రాక్షస బల్లులతో ఏర్పాటు చేసిన ఇలాంటి పార్కు దేశంలో ఎక్కడాలేదని, అలాంటి పార్కును గ్రేటర్ అతిసమీపంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు, పిల్లలకు ఎంతో అనుభూతిని కలిగించేందుకు ఈ పార్కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డైనోసార్ థీమ్ పార్కులో సహజసిద్ధమైన వాతావరణంలో పలు రకాల ప్రత్యేకతలను కల్పించడంతో సందర్శకులను ఆకర్షిస్తాయన్నారు. డైనోసార్ జంతు సంపదను మన కండ్లముందు ఉన్నట్లే తీర్చిదిద్దారన్నారు.

రాష్ట్రంలో పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. మహబూబ్‌నగర్‌లో 350 ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ కూడా ఇలాంటి పార్కు ఏర్పాటు చేస్తే 3, 4ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామన్నారు. టూరిజం శాఖకు అనుసంధానం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. నగరానికి చెందిన ప్రశాంత్ మొటాడు, అభినవ్ పాలముర్తి, సుశాంత్‌గౌర్నే, మార్కెటింగ్ ఇన్‌చార్జి చైతన్యలు డైనోసార్స్‌ను చైనాలో ప్రత్యేకంగా తయారు చేయించి గత ఏడాదిపాటు కృషి చేసి పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ డైనోసార్ల చరిత్రను తెలుసుకునేందుకు ఇలాంటి పార్కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పర్యాటకులు గంటపాటు సమయాన్ని కేటాయించేలా ఈకో పార్కును కూడా ఏర్పాటు చేయాలన్నారు. తన నియోజకవర్గంలో గొప్ప పార్కును ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో క్రీడా చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సినీ డైరెక్టర్ శశికిరణ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లకా్ష్మరెడ్డి, ఎంపీపీ బబ్బూరి మంజులగౌడ్, సర్పంచ్ కవాడి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీ ఫ్లోర్‌లీడర్ నోముల కృష్ణగౌడ్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్, నాయకులు బబ్బూరి దేవేందర్‌గౌడ్, పూజారి చక్రవర్తిగౌడ్, జగదీశ్, గౌరీశంకర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పర్యాటకులు తదితరులు పాల్గొన్నారు.

132

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles