6 నుంచి వేసవి శిబిరాలు

Fri,April 26, 2019 12:24 AM

- బల్దియా ఆధ్వర్యంలో.. 730 కేంద్రాల ద్వారా 45 క్రీడాంశాల్లో శిక్షణ
- ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలు మే ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నగర వ్యాప్తంగా 730 కేంద్రాల ద్వారా 45 క్రీడాంశాల్లో తర్ఫీదునిస్తారు. ఆన్‌లైన్‌లో http://www. ghmc. gov.in/sports వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. సుశిక్షితులైన కోచ్‌లతో నిర్వహించే శిక్షణా శిబిరాల్లో 6 నుంచి 16 ఏండ్ల లోపు బాలబాలికలకు ట్రైనింగ్ ఇస్తారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన వేసవి శిక్షణ శిబిరాలు(సమ్మర్ కోచింగ్ క్యాంపు) మే ఆరు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గ్రేటర్ వ్యాప్తంగా 730 కేంద్రాల ద్వారా 45క్రీడాంశాల్లో శిక్షణనివ్వనున్నారు. ఈ సందర్భంగా సుమారు ఒక లక్షమంది శిక్షణ తీసుకుంటారని అంచనా కాగా, ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు ఉంటాయని అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ నెల మొదట్లోనే శిబిరాలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళితో జాప్యం జరిగింది.

జీహెచ్‌ఎంసీ 1968నుంచి విద్యార్థులు, యువతకు ప్రతియేటా వేసవిలో శిక్షణ శిబిరాల ద్వారా వివిధ క్రీడల్లో శిక్షణ నందిస్తోంది. ఈ ఏడాది వేసవి శిక్షణను వివిధ ప్రాంతాల్లోని బల్దియా క్రీడామైదానాలు, క్రీడా కాంప్లెక్స్‌లలో సుమారు 45 క్రీడాంశాల్లో ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. జాతీయ, అంతర్జాతీయ, సీనియర్ కోచ్‌లతో నిర్వహించే శిక్షణ శిబిరాల్లో ఆరేండ్ల నుంచి 16 ఏండ్లలోపు బాలబాలికలకు ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. గత 51 ఏండ్లలో ఈ శిబిరాల ద్వారా ఇప్పటివరకు 34లక్షల మందికి పైగా బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణనిచ్చినట్లు, శిక్షణ తీసుకున్నవారిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నవారు ఎందరో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ నుంచి బ్యాడ్మింటన్‌లో ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణి పీవీ.సింధు వరకు ఎంతో మంది జీహెచ్‌ఎంసీ క్రీడామైదానాల ద్వారా ఎదిగిన వారేనని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ప్రస్తుతం 521 క్రీడామైదానాలు, 7స్విమ్మింగ్ పూల్స్, 17 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, 11రోలర్స్ స్కేటింగ్ రింగులు, 5 టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. పలు ఆట మైదానాల్లో ప్రతినెలా ఒక్కో క్రీడపై ప్రత్యేక టోర్నమెంట్ నిర్వహిస్తారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఎంపికచేసి వారిని ప్రత్యేక టీమ్‌గా తయారుచేస్తారు. వారిని స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీలకు పంపుతారు. ప్రతియేటా ఏప్రిల్‌లోనే మొదలుకావాల్సిన ఈ శిబిరాలు ఈసారి ఆలస్యమయ్యాయి. నగరంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున వీటిని ఏర్పాటు చేయాలా ? వద్దా ? అనే సంశయంతో జాప్యంజరిగింది. చివరికి ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మే ఆరు నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.


వేసవి శిక్షణ శిబిరాల క్రీడాంశాలు
1. సాహస క్రీడ, 2.అథ్లెటిక్స్, 3.ఆర్చరీ, 4. బాల్ బ్యాడ్మింటన్, 5. బాస్కెట్ బాల్, 6. బేస్ బాల్, 7. బాక్సింగ్, 8. బాడిబిల్డింగ్, 9. షటిల్ బ్యాడ్మింటన్, 10. చెస్, 11. క్యారమ్, 12. క్రికెట్, 13. సైక్లింగ్, 14. ఫుట్ బాల్, 15. ఫెన్సింగ్, 16. జిమ్నాస్టిక్, 17.హ్యాండ్ బాల్, 18. హాకీ, 19. జుడో, 20. కరాటే, 21. కబడ్డీ, 22. ఖో ఖో, 23. కిక్ బాక్సింగ్, 24. మల్కంబ, 25. నెట్ బాల్, 26. రోలర్ స్కేటింగ్, 27.రైఫిల్ షూటింగ్, 28. సెపక్ తక్ర, 29. సాఫ్ట్ బాల్, 30. టేబుల్ టెన్నిస్, 31. తైక్వాండో, 32. టెన్నిస్, 33. టెన్నికాయిట్, 34. టగ్ ఆఫ్ వార్, 35. త్రో బాల్, 36. వాలీబాల్, 37. వెయిట్ లిఫ్టింగ్, 38. రెస్లింగ్ ఇండియా, 39. వెస్లింగ్ రోమన్, 40. వుషు, 41, యోగా, 42. క్రాఫ్ బాల్, 43. పవర్ లిఫ్టింగ్, 44. బీచ్ వాలీబాల్, 45. స్కై మార్షల్ ఆర్ట్స్.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో పాల్గొనాలనుకునే వారు ఆన్‌లైన్‌లో http:// www.ghmc.gov.in/sports ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. క్రికెట్, టెన్నిస్, స్కేటింగ్, షటిల్ బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందేవారు ఆధార్‌కార్డు, మొబైల్ నంబర్‌తోపాటు రూ. 50ఫీజు చెల్లించాలి. అలాగే, ఇతర క్రీడాంశాలకు రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది.

360

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles