సెల్ టవర్ పెట్ట్టుకోండంటూ..బురిడీ

Fri,April 26, 2019 12:19 AM

- నెలకు 20 వేలు ఆదాయమంటూ.. అమాయకులను మభ్యపెడుతున్న సైబర్ నేరగాళ్లు
- లక్షలు డిపాజిట్ చేస్తున్న బాధితులు
- మాటలు నమ్మి మోసపోకండి: రాచకొండ సైబర్ క్రైం పోలీసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మీ ఇల్లు వంద గజాల్లో ఉందా...? కొంచెం ఎత్తు మీద ఉందా...? అయితే మీరు అదృష్టవంతులే...మీకు అడ్వాన్సు కింద లక్షలు..నెలకు 10 నుంచి 20 వేల ఆదాయం ఖాయం.అంటూ ఫోన్లు చేస్తూ.. మరో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఆశ చూపి.. డిపాజిట్లు చేయించుకొని మధ్య తరగతి కుటుంబాలను బోల్తా కొట్టిస్తున్నారు.

ఎలాంటి అనుమానాలు రాకుండా..
సైబర్ నేరగాళ్లు సులభంగా ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు సరికొత్తగా ఈ సెల్ టవర్లు నెపంతో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారిని టార్గెట్ చేస్తున్నారు. వారైతేనే ఆశతో అడిగిన డబ్బును డిపాజిట్ చేస్తారని వారి నమ్మకం. ఇందుకోసమే గ్రూపులు, గ్రూపులుగా ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తూ వంద గజాలు ఉంటే చాలు.. సెల్ టవర్ మీ ఇంటి మీదకు వచ్చి మీకు డబ్బులను కురిపిస్తుంది అని మురిపిస్తున్నారు. దీంతో చాలా మంది ఈ మాటలకు బోల్తా పడి లక్షలాది రూపాయలను డిపాజిట్ చేస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల పెరుగడంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మూడు ఫిర్యాదుల్లో బాధితులు దాదాపు ఐదు లక్షలకు పైగా నగదును పోగట్టుకున్నారు. ప్రతి ఫిర్యాదులో సెల్‌టవర్ వస్తే మాకు నెలకు ఆదాయం ఉంటుందనే ఆశతోనే లక్షలు డిపాజిట్ చేశామని చెప్పడంతో వారి అమాయకత్వం వెలుగులోకి వచ్చింది.

వారు మాట్లాడేది ఇలా...
ఈ మధ్య చాలా మందికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా మీ ఇండ్లు వంద గజాల్లో ఉండి ఎత్తు మీద ఉంటే చాలు. మీకు అడ్వాన్సుగా రూ.10 లక్షలు...నెలకు ఆదాయం రూ.10 నుంచి 20 వేల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ సెల్ టవర్లు బడా సంస్థలకు సంబంధించినవంటూ.. అవి ఎయిర్‌టెల్, రిలయన్స్, జియో, ఐడియా సంస్థల పేర్లు చెప్పుకుంటూ పోతున్నారు. ఆ తర్వాత మీకు ఆసక్తి ఉంటే.. మా వాట్సాప్ నంబర్‌కు మీ ఇంటి పత్రాలు, ఆధార్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలు పంపండంటూ కోరుతున్నారు. వీటిని పరిశీలించుకొని మీకు సెల్ టవర్ ఏర్పాటును నిర్ధారిస్తామని చెబుతున్నారు. రెండ్రోజుల తర్వాత మీ పత్రాలన్నీ సరిగా ఉన్నాయి.. మీ ఇంటి మీద సెల్ టవర్ పెడుతాం. అడ్వాన్సు కింద రూ.10 లక్షలు ఇస్తాం. నెలకు రూ.10 వేల ఇస్తాం. అయితే ముందస్తుగా మీరు మాకు ట్యాక్స్, ఇతర ప్రక్రియలను చట్టపరంగా చేసేందుకు కొంత నగదు డిపాజిట్ చేయాలి. ఇందుకు ముందు రెండు లక్షలు మా ఖాతాలో వేయండని పురమాయిస్తారు. ఈ డబ్బును మీరు మేము ఇచ్చే అడ్వాన్సును తిరిగి చెల్లించే సమయంలో కట్ చేసుకోండని నమ్మకం కలిగిస్తారు. ఒకసారి వీరి మాటలకు వీని నగదు డిపాజిట్ చేయగానే ఆ మరుసటి రోజు నుంచి మొబైల్ ఫోన్లు బంద్ అవుతాయి. ఇలా ఇప్ప టి వరకు పోలీసులకు అందిన ఫిర్యాదుల్లో ఒకరు రూ. 1.30, మరొకరు రూ. 2.30, ఇంకొకరు రూ. 1. 40 లక్షలను చెల్లించుకొని లబోదిబోమంటు
న్నారు.

ఫోన్ మాటలకు బోల్తా పడకండి
సెల్‌టవర్లు ఏర్పాటు చేసే కార్పొరేట్ సంస్థలు భౌగోళికంగా వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటాయి. ఇందుకోసం వారికి సాంకేతికపరమైన బృందం ఉంటుంది. అనుకూలత ఆధాకంగా కంపెనీ ప్రతినిధులు నేరుగా మిమ్మల్ని వ్యక్తిగతంగా సంప్రదిస్తారు. దాని కోసం అనుమతుల ప్రక్రియ ఇతర అంశాలను వివరిస్తారు. అంతేతప్ప.. మొత్తం వ్యవహరాన్ని ఫోన్‌లో మాట్లాడి నగదును డిపాజిట్ చేయమని చెప్పరు. మీరు మీతో మాట్లాడిన వ్యక్తిని చూడకుండా మీరు నగదును ఎందుకు డిపాజిట్ చేయాలో ఒకసారి ఆలోచించుకోండి. హైదరాబాద్‌లోని ఆ సంస్థల కార్యాలయాలకు వెళ్లండి. చట్టబద్ధంగా అన్ని పత్రాలను పరిశీలించుకోండి. కనిపించకుండా మాట్లాడే సైబర్ నేరగాళ్ల మాటలకు భారీ ఆదాయాలు, ఖరీదైన బహుమతులు ఎప్పటికీ రావని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి.
-రాచకొండ సైబర్ క్రైం పోలీసులు

244

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles