36 గంటలు..622 చెట్లు

Fri,April 26, 2019 12:16 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఈనెల 22న వచ్చిన ఈదురుగాలులకు నగరం అతలాకుతలమైంది. సుమారు 70కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 622చెట్లు నేలకూలగా, గాలివాన సృష్టించిన విధ్వంసం నుంచి నగరాన్ని బల్దియాకు చెందిన విపత్తుల నిర్వహణ విభాగం 36గంటల్లో సామాన్య స్థితికి చేర్చింది. ముఖ్యంగా ఈ విభాగం డైరెక్టర్ విశ్వజీత్ కంపాటి తమ సహాయక బృందాలకు ప్రణాళికాబద్ధంగా విధులను అప్పగించి నడిపించారు.

గాలివానవల్ల నగరంలో చెట్లు కూలడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా, వీటిపై జీహెచ్‌ఎంసీకి 130కిపైగా ఫిర్యాదులు అందాయి. 36గంటల్లో అన్ని ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు పరిస్థితిని సామాన్య స్థితికి చేర్చారు. బల్దియా విపత్తుల నిర్వహణ విభాగంలో 220మంది సిబ్బందితో ఎనిమిది బృందాలను నెలకొల్పారు. ఈ బృందాలు 24కీలక ప్రాంతాల్లో మూడు షిఫ్టులుగా పనిచేశారు. ఈదురుగాలులకు రామంతపూర్‌లోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోని భారీ రావిచెట్టు కూలిపోగా సహాయక బృందాలు గుడికి నష్టం వాటిల్లకుండా చెట్టును తొలిగించడం విశేషం. దీనిపై స్థానికులనుంచి బల్దియా విపత్తుల నిర్వహణ విభాగానికి ప్రశంసలు లభించాయి. అలాగే, అడిక్‌మెట్‌లోని రామాలయంలో దాదాపు 40ఏండ్లనాటి చెట్టు కూలిపోగా, దాన్నికూడా స్థానికులకు అసౌకర్యం కలుగకుండా తొలిగించారు. అలాగే, లక్డీకాపూల్‌లోని క్యాన్సర్ దవాఖాన వద్ద భారీ వృక్షం కూలి రహదారిపై రాకపోకలు స్తంభించగా, బృందాలు వెంటనే స్పందించి వృక్షాన్ని తొలిగించాయి.

201

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles