24 గంటలూ అందుబాటులో ఉంటా


Sat,March 23, 2019 03:11 AM

- చేవెళ్ల టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంజిత్‌రెడ్డి నామినేషన్


రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : చేవెళ్ల ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా. ప్రజా సేవ చేయడానికే వచ్చా. నన్ను ఆశీర్వదిస్తే పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల గొంతుకనవుతా.. అని చేవెళ్ల లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య తదితరులతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటానని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పారు. అనంతరం ఆయన రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

చేవెళ్ల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ, నిస్వార్థంగా సేవలందిస్తానని చేవెళ్ల లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, మహేశ్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి గట్టు రాంచందర్‌రావులతో కలిసి రంజిత్‌రెడ్డి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ... చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, యంగ్ డైనమిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావుకు కృతజ్ఞతలు తెలిపారు. నాకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి,చేవెళ్ల పార్లమెంట్ ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. 111జీఓ విషయంపై సీఎం కేసీఆర్,టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని తెలిపారు. తప్పకుండా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని 84 గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. జీఓ ఎత్తివేయడం ఆలస్యమైతే ఫండ్ కేటాయించి ఆదుకుంటామన్నారు. చేవెళ్ల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని వాగ్దానం చేశారు. నాకు వేరు వ్యాపకం లేదని, ప్రజాసేవచేయడానికే వచ్చానని పేర్కొన్నారు. ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపిస్తే చేవెళ్ల, తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుక అవుతానని వివరించారు. కేంద్రాన్ని యాచించే బదులు..శాసిద్దామని తెలిపారు. ఎర్రకోట మీద జెండా ఎగురవేయడంలో మన భాగస్వామ్యం ఉంటే నిధులు వాటంతట అవే వస్తాయన్నారు. చేవెళ్లలో పోటీ చేసేది కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మీద..ఆయన ఇంటిపేరులో కొండ ఉంటే నాకు కొండంత టీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉందన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు పట్నం అవినాష్‌రెడ్డి, వనం లక్ష్మికాంత్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి,ఉమాశంకర్‌రెడ్డి, నర్సింగ్‌రావు తదితరులున్నారు.

కేంద్రంలో సీఎం కేసీఆర్ చక్రం తిప్పడం తథ్యం : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
హైదర్‌నగర్ : సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఫలితాలను అందించాయో, అంతకు రెట్టింపు ఫలితాలు పార్లమెంటు ఎన్నికల్లోనూ రాబోతున్నాయని, అందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల మద్దతుతో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని అనతి కాలంలోనే కేంద్రంలో సీఎం కేసీఆర్ చక్రం తిప్పుతారని తెలిపారు. దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించడం తథ్యమన్నారు. చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని అధిక మెజార్టీతో గెలిపించుకుని సీఎం కేసీఆర్‌కు కానుకగా అందిస్తామని ఎమ్మెల్యే గాంధీ పునరుద్ఘాటించారు.

4 నుంచి 5లక్షల మెజార్టీతో గెలిపిస్తాం : మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో రంజిత్‌రెడ్డి ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటారు,రంజిత్‌రెడ్డిని గెలిపించే బాధ్యత నాది, మా ఎమ్మెల్యేలది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 6 మంది ఎమ్మెల్యేలకు మంచి మెజార్టీ వచ్చింది. అదే స్థాయిలో రంజిత్‌రెడ్డిని 4 నుంచి 5లక్షల మెజార్టీతో గెలిపించి తీరుతాం. జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను గెలుస్తాం.

కాంగ్రెస్ ఊసేలేదు.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ఊసేలేదు. పట్టుదలతో పనిచేసి, మంచి మెజార్టీతో రంజిత్‌రెడ్డిని గెలిపిస్తాం. ప్రజలందరూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓటేయ్యాలి. బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి.

కొండా నమ్మక ద్రోహం చేశారు : చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజకీయ భిక్షపెట్టిన పార్టీకి నమ్మక ద్రోహం చేశారు. రంజిత్‌రెడ్డి రంగారెడ్డి జిల్లాకు సుపరిచితుడు. శాయశక్తులా పనిచేసి, రంజిత్‌రెడ్డిని గెలిపిస్తాం. మచ్చలేని నాయకుడు, పారిశ్రామిక వేత్త రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కష్టపడుతాం.

సగానికి పైగా ఖాళీ అయిన కాంగ్రెస్ : పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
సగానికి పైగా కాంగ్రెస్ ఖాళీ అయ్యింది. చేవెళ్ల పార్లమెంట్‌లో భారీ మెజారిటీ లక్ష్యంగా పనిచేస్తాం. 16 ఎంపీ స్థానాలు గెలుపొందితే కేంద్రంలో కీలక పాత్రపోషిస్తాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సాధిస్తాం. 10 లక్షల ఎకరాలకు తాగు,సాగు నీరందించేందుకు సీఎ కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 50 శాతం మందికి పైగా నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

653

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles