బినామీ ఉద్యోగుల ఏరివేతకు కసరత్తు


Sat,March 23, 2019 03:03 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉస్మానియా దవాఖానలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అవినీతి, అక్రమాలు లేని పారదర్శక వాతావరణం నెలకొల్పేందుకు వైద్యాధికారులు శ్రీకారం చుట్టారు. అటు సేవల పరంగా ఇటు పాలనా పరంగా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, రోగులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. ఇప్పటికే సిబ్బంది కచ్చితమైన సమయ పాలన కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్న అధికారులు సిబ్బందిలో జవాబుదారితనం పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి, అక్రమాలు లేకుండా సీసీ కెమెరాలు, భద్రతా పరమైన చర్యలు తీసుకున్నారు. తాజాగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న బినామీ ఉద్యోగులపై దృష్టిపెట్టారు. ఇటీవలే కొంత మంది బినామీ ఉద్యోగులను గుర్తించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. ఈ క్రమంలో బినామీలను ఏరివేసేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా కొంత మంది నాలుగో తరగతి ఉద్యోగులతో పాటు మరికొందరు ఇతర విభాగాలకు చెందిన ఆయా కేటగిరిల ఉద్యోగులు బినామీ పేర్లతో చెలామణి అవుతున్నారు. అంటే ఒకరి పేరుమీద మరొకరు ఉద్యోగం చేస్తున్నారు. మరికొంతమంది ఉద్యోగులు చేయాల్సిన విధులను పక్కనబెట్టి సంబంధం లేని చోట ఇతర వ్యాపకాలకోసం విధులు నిర్వర్తిస్తున్నారు. గత పాలకుల హయాంలో మొదలైన ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు దవాఖాన సూపరింటెండెంట్ చర్యలు ముమ్మరం చేశారు. అక్రమార్కులు, అవినీతిపరులపై కొరడాఝలిపిస్తున్నారు.


మా దృష్టికి వచ్చింది..
దవాఖానలో కొంత మంది బినామీ పేర్లమీద విధులు నిర్వర్తిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారిలో కొందరిని గుర్తించడం జరిగింది. బినామీ పేర్లమీద పనిచేసే వారు సుమారు 10నుంచి 15 మంది ఉంటారని అనుమానిస్తున్నాం. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్

369

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles