విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని శ్రమించాలి

Wed,March 20, 2019 12:18 AM

ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 19 : విద్యార్థులు ఆ దశలోనే లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకనుగుణంగా శ్రమించాలని తెలంగాణ కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. సరైన శ్రమ ద్వారానే లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. అప్పుడే వారు తమ జీవితంలో రాణిస్తారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవీన్ మిట్టల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో రాణించాలంటే తమలో ఉన్న లోపాలను అధిగమిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూజీసీ - సెరో సంయుక్త కార్యదర్శి డాక్టర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ బాలికలు విద్యారంగంలో ముందుండాలని సూచించారు. ఏఎంఎస్ అధ్యక్షురాలు ఎన్. ఉషారెడ్డి, కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజేశ్వరి మాట్లాడుతూ కళాశాల ప్రగతిని వివరించారు. కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. త్వరలో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కళాశాల వార్షిక నివేదికను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాజ్యలక్ష్మి, అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

158

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles