పేదల ప్రాణదాత..మిలాప్


Tue,March 12, 2019 12:14 AM

ఖైరతాబాద్ :ఆరేండ్ల పేద బాలుడికి కాలేయ మార్పిడి చేస్తేనే బతుకుతాడని డాక్టర్లు తేల్చి చెప్పారు. అందుకు రూ.16 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆ తండ్రికి ఎటూ పాలుపోలేదు. స్నేహితులు, బంధువుల వద్ద చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరగా ఓ స్నేహితుడి సలహాతో ఆన్‌లైన్‌లో (క్రౌడ్ ఫండింగ్) దాతల కోసం ప్రయత్నించాడు. ఓ వెబ్‌సైట్ అతడిలో కొత్త ఆశలు నింపింది. సహకారం అందింది. ఓ పెద్దాసుపత్రిలోనే అన్ని ఖర్చులతో శస్త్ర చికిత్స జరిగింది. కుమారుడిని ఆరోగ్యంగా ఇంటికి తీసుకువచ్చాడు. అలాంటి అభాగ్యులకు దాతలను పరిచయం చేస్తూ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నది మిలాప్ సంస్థ.
ప్రాణాంతక వ్యాధులతో ఎందరో బాధితుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడం అతడు జీర్ణించుకోలేకపోయాడు. అలాంటి వారిని ఆదుకోవాలన్న సంకల్పంతో 2010లో కోయంబత్తూరుకు చెందిన అనోజ్ విశ్వనాథన్, అతడి స్నేహితుడు మయూక్ చౌదరితో కలిసి మిలాప్ వెబ్‌సైట్‌ను స్థాపించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నాడు నాటిన ఈ మొక్క నేడు మహావృక్షమై ఎందరో ప్రాణాలను రక్షిస్తున్నది.


సోషల్ మీడియాను సమగ్రంగా వినియోగించుకొని వైద్య సాయం అవసరమున్న బాధితులకు వేదికగా ఓ ప్రత్యేక వెబ్‌సైట్ http://milaap.org/ fundraisers/new ను రూపొందించారు. ఆ వెబ్‌సైట్ ద్వారా బాధితులు, దాతలకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ వారి వారి జబ్బులకు నేరుగా ఆర్థిక సాయం అందించే వీలు కల్పిస్తున్నారు. అత్యవసర చికిత్స, క్యాన్సర్, అవయవాల మార్పిడి తదితర అవసరాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు చెందిన దాతలను ఏకతాటిపైకి తీసుకురావటంలో సఫలీకృతులయ్యారు. ఉదాహరణకు ఒక్క దాత రూ.5 రూపాయలు విరాళంగా ఇస్తే, అదే ఐదు రూపాయలను ఐదు లక్షల మంది ద్వారా సేకరిస్తే రూ.25 లక్షలు సమకూరుతాయి. ఇలాంటి ప్రయత్నమే మిలాప్ సంస్థ చేపడుతోంది. ఇప్పటి వరకు దాతల ద్వారా బాధితులకు రూ.500 కోట్లకు పైగా సాయం అందించేందుకు మిలాప్ దోహదపడిందంటే అతిశయోక్తి కాదేమో.

డిజిటల్ వేదిక...మిలాప్
అవసరమున్న బాధితులకు దాతల ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించే డిజిటల్ వేదికగా మిలాప్ వెబ్‌సైట్ నిలుస్తున్నది. దాతల కోసం ఎదురుచూసే వారికి డబ్బులు చేర్చడంలో పూర్తి పారదర్శకత పాటిస్తారు. ఒక బాధితునికి దాతల డబ్బులు రావాలంటే ఆ రోగి ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి, వైద్యం కోసం అంచనా వ్యయం తదితర అంశాలను సంబంధిత వైద్య నిపుణులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. మెడికల్ రిపోర్టుతో పాటు ఆ రోగానికి అయ్యే వైద్య ఖర్చులు, బాధితుడి బ్యాంకు ఖాతా వివరాలను మిలాప్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అన్ని రకాలుగా ఆమోదయోగ్యంగా ఉంటే దాతల సాయం నేరుగా బాధితుడి ఖాతాలో జమ అవుతుంది. బాధితుడు నిరక్షరాస్యుడైతే ఆ డబ్బులు నేరుగా దవాఖానకు చేరుతాయి. వెబ్‌సైట్ నిర్వహణ కోసం మాత్రం ఐదు శాతం మాత్రమే ఫీజు రూపంలో దాతల నుంచి వచ్చే సాయంలో మినహాయిస్తారు. ఇటీవల పుల్వా మా ఉగ్ర ఘటనలో మరణించిన వారి కోసం కూడా ఫండ్ రైజింగ్ ద్వారా రూ.54.87 లక్షలు దాతల ద్వారా సమకూర్చడం విశేషం. అలాగే దాడులు, దౌర్జన్యాలకు గురైన మహిళలకు సైతం వారి ఆర్థిక పరిపుష్టి కోసం దాతల ద్వారా ఆపన్నహస్తం అందిస్తున్నారు.

600

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles