తుది శ్వాస విడిచిన.. గోల్కొండ సింహం


Sun,February 24, 2019 12:17 AM

-పాతబస్తీ ప్రజలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం
-జనసంఘ్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభం
-రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బద్దం బాల్‌రెడ్డి
చాంద్రాయణగుట్ట, బంజారాహిల్స్/అబిడ్స్, నమస్తే తెలంగాణ : పాతనగర ప్రజలకు సుపరిచితుడు, గోల్కొండ సింహంగా పేరు తెచ్చుకున్న కార్వాన్ మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం బంజారాహిల్స్ కేర్ దవాఖానలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాల్‌రెడ్డి మృతి చెందారనే వార్త పాతబస్తీ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. బాల్‌రెడ్డి కొన్ని నెలలుగా అల్సర్, లివర్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని ఏజీ దవాఖానలో మొదట చేరారు. ఆ తరువాత బంజారాహిల్స్‌లోని కేర్ దవాఖానలో చేరారు. లివర్ సంబంధిత వ్యాధి ఆయన ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపింది. వారం రోజుల క్రితమే కేర్ వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ తరువాత బాల్‌రెడ్డి ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ రెండు మూడు రోజులుగా పరిస్థితి విషమించింది. అల్సర్ సమ స్య జఠిలంగా మారింది. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 6 గంటల తరువాత బాల్‌రెడ్డి మృతి చెందినట్లు కేర్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. బాల్‌రెడ్డికి భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


ఏ ఉత్సవమైనా ముందుండేది ఆయనే..
విద్యార్థి దశలో చుట్టుపక్కల చిన్నారులకు ట్యూషన్ చెప్పేవాడు. యుక్త వయస్సు వచ్చేసరికి సివిల్ కాంట్రాక్టర్‌గా పని చేశాడు. ఆ తరువాత జనసంఘ్‌లో చేరాడు. 1983లో మొదటిసారిగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు. ఆ తరువాత విత్‌డ్రా చేసుకున్నారు. పార్టీ ఆదేశాల మేరకు కార్వాన్ నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఆయనను అభిమానులు ముద్దుగా గోల్కొండ సింహాం అని పిలుచుకునేవారు. 1991, 1998లో హైదరాబాద్ పార్లమెంట్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. హిందూవాదిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి. పాతబస్తీలో హిందువుల పండుగలకు ఆయన ముందుండి నడిపించేవారు. ముఖ్యంగా గణేశ్ ఉత్సవాల్లో ఆయన కీలక పాత్ర పోషించే వారు. ముందుండి సామూహిక గణేశ్ ఊరేగింపును నడిపించేవారు. జనసంఘ్ మొదలు బీజేపీ వరకు ఆయన ప్రస్థానంలో ఎన్నో కీలక మలుపులు ఉన్నాయి. పార్టీలో ప్రతి సీనియర్ నాయకులతో ఆయనకు సత్ సంబంధాలు ఉన్నాయి. పాతనగర ప్రజలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం ఏ కష్టమొచ్చినా వెంటనే పరిష్కరించే వారు. ముఖ్యంగా పాతబస్తీలో తరుచూ జరిగే మతకలహాల్లో హిందువులకు అండగా నిలిచేవారు. 1978లో జరిగిన మతకలహాల్లో ఆయన చేతక్ వాహనంపై వస్తుండగా ఒక్కసారిగా దుండగులు దాడి చేశారు. ఆ దాడి నుంచి బాల్‌రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. బండిని దుండగులు కాల్చివేశారు.

అలియాబాద్‌లో 55 ఏండ్ల జీవితం
పాతబస్తీ అలియాబాద్ ప్రాంతంలో నివసించే గోపాల్‌రెడ్డి, చంద్రమ్మ దంపతులకు 1945 మార్చి 7వ తేదీన బద్దం బాల్‌రెడ్డి జన్మించాడు. గోపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు.. పెద్ద కుమారుడు భీమ్‌రెడ్డి కాగా, రెండో కుమారుడు బద్దం బాల్‌రెడ్డి. బాల్‌రెడ్డి బాల్యం పాతబస్తీలోనే కొనసాగింది. అలియాబాద్ హైస్కూల్‌లో విద్యాభాస్యం సాగింది. ఇంటర్మీడియెట్ చదువు ఫలక్‌నుమా జూనియర్ కళాశాల (భరత్‌కోట)లో, జంబాగ్‌లోని వి.వి.కళాశాలలో ఆయన డిగ్రీ చదువులను పూర్తి చేశారు. రాజకీయాలకు ఆకర్షితులైన ఆయన చిన్న వయస్సులోనే 1962లో జనసంఘ్‌లో చేరాడు. ఆ తరువాత ఆయన తుదిశ్వాస విడిచే వరకు బీజేపీలోనే ప్రస్థానం కొనసాగింది. పాతబస్తీ అలియాబాద్‌లోనే ఆయన 55 ఏండ్లు నివసించారు. 2000 సంవత్సరంలో పాతబస్తీ నుంచి బంజారాహిల్స్‌కు ఆయన మకాం మార్చారు.

శోకసంద్రంలో అభిమానులు..
బద్దం బాల్‌రెడ్డి మరణవార్త వినగానే పాతబస్తీలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు బంజారాహిల్స్‌కు చేరుకున్నారు. బాల్‌రెడ్డితో వారికి ఉన్న పరిచయాలను గుర్తు చేసుకున్నారు. బాల్‌రెడ్డి మృతి పార్టీకి, పాతనగరానికి తీరని లోటని బీజేపీ సీనియర్ నాయకుడు పాశం సురేందర్, అదర్ల మహేశ్, జగ్జీవన్‌రెడ్డి, ఊరడి సత్యనారాయణ, డాక్టర్ పండరి, పొన్న సుదర్శన్, పొన్న శ్రీనివాస్, వెంకటరమణ, ఆలే లలిత నరేంద్ర, ఆలే జితేంద్ర, చర్మని రూప్‌రాజ్, పెండెం లక్ష్మణ్, ఇ.సాయిలు, వై.నరేశ్, కె.శంకర్, తాడెం శ్రీనివాస్‌రావు, శివకుమార్‌గుప్తలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు బాల్‌రెడ్డి కుటుంబానికి తమ ప్రగాడ సానూభూతిని తెలియజేశారు. బాల్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

బాల్‌రెడ్డి మృతితో ఫిలింనగర్ బస్తీలో విషాదం

-13 బస్తీల ఏర్పాటులో కీలకపాత్ర
-కూల్చివేతలు అడ్డుకుని జైల్లో దీక్ష చేయడంతో పట్టాల జారీ
కార్వాన్ మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మృతితో జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ 18 బస్తీల్లో విషాదం నెలకొన్నది. ఫిలింనగర్ బస్తీల్లో పేదలు వేసుకున్న గుడిసెలను గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక సార్లు కూల్చేసిన సమయంలో వారికి అండగా నిలబడ్డ వారిలో బద్దం బాల్‌రెడ్డి ఒకరు. సుమారు 50ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వం స్థలంలో 1989 నుంచి బస్తీలు ఏర్పాటయ్యాయి. ఈ బస్తీల్లో పేదలు కూల్చకుండా అడ్డుకుని అడుగడుగునా అండగా నిలబడ్డ బాల్‌రెడ్డి సుమారు 13 బస్తీలు ఏర్పాటు కావడంలో కీలకపాత్ర వ్యవహరించారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 1994లో ఫిలింనగర్ బస్తీల్లో గుడిసెలు కూల్చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్న బాల్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పేదలకు పట్టాలు ఇవ్వాల్సిందే అంటూ మూడు రోజులపాటు జైల్లోనే నిరాహారదీక్ష చేయడంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ జోక్యం చేసుకుని బేషరతుగా విడుదల చేశారు. బాల్‌రెడ్డి కోరిక మేరకు 5 వేల మందికి పట్టాలు ఇచ్చారు. దేశం కోసం పాటు పడ్డ మహనీయుల పేర్లను ఫిలింనగర్ బస్తీలకు పెట్టిన ఘనత బాల్‌రెడ్డికే దక్కింది. ఫిలింనగర్ బస్తీలు తన నియోజకవర్గం పరిధిలోని రాకున్నా పేదల గుడిసెలను కూల్చడానికి అధికారులు వచ్చినప్పుడల్లా అక్కడకు వచ్చి అండగా నిలబడేవారని ఫిలింనగర్ 18 బస్తీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మామిడి నర్సింగరావు తెలిపారు. బస్తీలకు అండగా నిలబడ్డ బాల్‌రెడ్డికి కృతజ్ఞతగా ఫిలింనగర్‌లోని ఓ బస్తీకి 1995లోనే బద్దం బాల్‌రెడ్డినగర్ అని పేరు పెట్టుకున్నారంటే ఆయనపై పేదలకు ఉన్న అభిమానం తెలుస్తున్నది. పార్టీలకతీతంగా పేదలకు అండగా నిలబడ్డ బాల్‌రెడ్డి మృతిపై అన్ని పార్టీల నేతలు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

924

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles