ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు


Sun,February 24, 2019 12:09 AM

కాచిగూడ: మోదీ ప్రభుత్వం రైల్వేల ఆధునీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని మోదీ హయంలో ఇప్పటి వరకు రైల్వే చార్జీలను పెంచలేదని ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం కాచిగూడ-నడికుడి(77674) వరకు వెళ్లడానికి డెమో రైలును కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 9.48 నిమిషాలకు ప్లాట్‌ఫాం-1 నుంచి ఎంపీ బండారు దత్తాత్రేయ, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, రైల్వే బోర్డు సభ్యుడు వెంకటరమణి జెండాఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ బండారు దత్తాత్రేయ హాజరై మాట్లాడుతూ పేద ప్రజలకు తక్కువ చార్జీలతో డెమో రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆయన వెల్లడించారు. రైల్వేలు దేశానికి పెద్ద సంపదని, ఇందుకు మోదీ ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను అందించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.రైల్వే ఫేస్-2 పూర్తయితే యాదాద్రి, శంషాబాద్ తదితర ప్రాంతాల ప్రయాణికులకు ఎంతగానో మేలు జరుగుందని, ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం మరో రూ.100 కోట్ల రూపాయలను కేటాయించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కాచిగూడ-నడికుడి డెమో రైలు కోసం రూ.1.32లక్షల రూపాయలతో సీతాఫల్‌మండి, విద్యానగర్ రైల్వేస్టేషన్లల్లో రైలు ఆగడానికి ప్లాట్‌ఫాంను విస్తారించడం శుభచూచికమన్నారు.


అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ ప్రయాణికుల మెప్పు పొందడానికి రైల్వే సంస్థ మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.తెలంగాణ ప్రభుత్వం రైల్వే ఫేస్-2 అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. చారిత్రక సంపదకు అంబర్‌పేట నియోజకవర్గంలోని కాచిగూడ రైల్వేస్టేషన్ నిలయంగా మారడం శుభచూచికమని, కాచిగూడ రైల్వేస్టేషన్ నేడు రాష్ట్రంలోనే ఎ-1 రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందడం తెలంగాణ ప్రాంతానికే గర్వకారణమన్నారు. అనంతరం డీఆర్‌ఎం అరుణ్ కుమార్‌జైన్ మాట్లాడుతూ కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల కోసం డిజిటల్ లైటింగ్ సిస్టమ్, మాసాజ్ చైర్స్, ప్లాట్‌ఫాం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత, ఎక్స్‌లేటర్లు తదితర సౌకర్యాలను సమకూర్చినట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా రైల్వే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉన్న మరిన్ని సేవలను చేరువలోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ డెమో రైలుకు 9 బోగిలను ఏర్పాటు చేసి, ప్రతి రోజూ కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 9.20 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 నిమిషాలకు నడికుడికి చేరుకుంటుందని, తిరిగి నడికుడి నుంచి సాయంత్రం 6.15 నిమిషాలకు బయలుదేరి కాచిగూడకు రాత్రి 10.15 నిమిషాలకు చేరుకుంటుందన్నారు. కొత్తగా ప్రారంభించే కాచిగూడ-నడికుడి డెమో రైలు అన్ని రైల్వేస్టేషన్‌ల్లో ఆగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సభ్యులు ఎడెల్లి ఆజయ్‌కుమార్, కృష్ణగౌడ్, దిడ్డి రాంబాబు, కన్నె రమేశ్‌యాదవ్, కాటం నర్సింహయాదవ్, విజితారెడ్డి, నాగేందర్‌బాబ్జి, భిక్షపతి, ఆర్‌కె.బాబు, కాలేరు రామకృష్ణ, బీష్మ, పాట్కూరి శ్రీనివాస్, కాలేరు రాజు, రైల్వే అధికారులు ఏడీఆర్‌ఎంలు సాయిప్రసాద్, శ్రీనివాస్‌రాజు, సీనియర్ డీసీఎం విక్రమాధిత్యా, సీనియర్ డీవోఎం రాజ్‌కుమార్, హైదరాబాద్ పీఆర్‌ఐ శైలెందర్ కుమార్, కాచిగూడ డైరెక్టర్ పుష్పరాజ్ పాల్గొన్నారు.

373

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles