సర్కారు కార్యాలయాల్లో ఆధార్


Sun,February 24, 2019 12:07 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆధార్ కార్డు పొందడాన్ని సులభతరం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లోనే నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నది. ఇలా జిల్లాలో 68 కేంద్రాలను నెలకొల్పనున్నారు. తహసీల్దార్ కార్యాలయాలు, హాస్టళ్లు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కార్యాలయాల గుర్తింపు ప్రకియను ప్రారంభించారు. నాలుగు మండలాల్లో గుర్తింపు ప్రక్రియ ఓ కొలిక్కి రాగా, త్వరలోనే మిగతా మండలాల్లోనూ పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇవి శాశ్వతంగా ఆయా కార్యాలయాల్లోనే ఉంటూ సేవలందించనున్నాయి.


మీ సేవల్లో లభించవిక..
ఆధార్ అమల్లోకి వచ్చినా. ఇంకా చాలా మందికి కార్డులు లేవు. ఇక మరికొంత మందికి ఆధార్ నంబర్ ఉన్నప్పటికీ అందులోని వివరాల్లో తప్పుల వల్ల అనేక సందర్భాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొత్తగా నమోదుతో పాటు, తప్పులను సవరించుకునేందుకు గతంలో మీసేవా, ఆన్‌లైన్ సెంటర్‌ల్లో ప్రత్యేక సేవలు కొనసాగాయి. ప్రస్తుతానికి వీటిని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కమిషనర్ ఈఎస్‌డీ ఆదేశాల మేరకు మీ సేవా కేంద్రాల్లోని ఆధార్ నమోదు కేంద్రాలను రద్దు చేసి, ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

సులభంగా అన్ని సేవలు..
ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో ఆధార్‌కు సంబంధించిన సేవలన్నీ అందుబాటులో ఉంచారు. అడ్రస్ ఫ్రూఫ్, ఐడీ ఫ్రూఫ్ తీసుకొని వస్తే ఎంచక్కా ఆధార్ కార్డ్ ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవచ్చు. ఏ వ్యక్తి అయినా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉన్న బ్యాంక్ బ్రాంచిని సంప్రదించి ఆధార్ నమోదు చేసుకోవచ్చు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవడం, పేర్లు, చిరునామా, పుట్టిన తేదీ, ఫొటోల్లో మార్పులు చేర్పులు చేసుకోవడం, ప్రతి ఆధార్ నంబర్‌కు ఫోన్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్‌ను అనుసంధానం చేసుకోవడం, వయస్సు పైబడి, లేక వివిధ కారణాల వల్ల ఆధార్‌లోని వేలి ముద్రలు, ఐరిష్ సరిగా పనిచేయని వారికి అదే విధంగా 12 ఏండ్లు నిండిన చిన్నారులకు వేలు ముద్రలు, బయోమెట్రిక్, ఐరిష్ అప్‌డేట్ చేయడం తదితర అన్ని రకాల సేవలను ఒకేచోట అందించబోతున్నారు.


అడ్డగోలు దోపిడీకి చెక్...
గతంలో ఆధార్ నమోదు, మార్పులు చేర్పుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలను, మీ సేవా, ఏపీ ఆన్‌లైన్‌ల్లో అవకాశం కల్పించింది. అయితే ఆయా కేంద్రాల్లోని సిబ్బంది సేవల పేరుతో అందినకాడికి దండుకున్నారు. ఆధార్‌లోని వివిధ సర్వీస్‌ల కోసం వివిధ రకాలుగా రుసుములు వసూలు చేసి పబ్బం గడుపుకున్నారు. కాగా, తాజాగా ఏర్పాటయ్యే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లతో అడ్డగోలు దోపిడీకి చెక్ పడనుంది. కొత్తగా ఆధార్ నమోదు చేసుకునే వారికి నామమాత్రపు ధరలతో సేవలందిస్తున్నారు. ఇతర మార్పులు చేర్పులు చేసుకునే వారి నుంచి కేవలం రూ.30(జీఎస్‌టీతో కలిపి) వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

445

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles