సమగ్రంగా..విశ్వనగరంగా..


Sat,February 23, 2019 12:15 AM

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా సమగ్ర కార్యప్రణాళికను సిద్ధంచేస్తున్నది. రోడ్లు, ైఫ్లెఓవర్ల నిర్మాణం, మురుగునీరు, వరదనీటి పారుదల, సంక్షేమం తదితర పథకాలు పెద్దఎత్తున చేపట్టాలని నిర్ణయించింది. పార్లమెంటు ఎన్నికల అనంతరం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లో వీటికి భారీగా నిధులు కేటాయించే అవకాశముంది. రానున్న మూడేండ్లలో సుమారు రూ. 50వేల కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పెరుగడంవల్ల వలసలు ఎక్కువవుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరానికి వస్తున్న వలసలు చెప్పనక్కర్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నగరాలు, పట్టణాల సమగ్రాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇందులో హైదరాబాద్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ఇదే విషయాన్ని శుక్రవారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఇదిలావుండగా, నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిస్కరిస్తూ రహదారులను సిగ్నల్ ఫ్రీ రహదారులుగా మార్చేందుకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ.23వేలకోట్ల అంచనాతో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికీ దాదాపు రూ. 3 వేల కోట్ల విలువైన పనులు పూర్తికాగా, మరో మూడు వేల కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. దశలవారీగా మిగిలిన పనులను కూడా చేపట్టాల్సివుంది. అలాగే, ముంపు సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు వరదనీటి పారుదల వ్యవస్థను అభివృద్ధిచేయాలనే ప్రతిపాదన ఉంది. దీనికోసం సుమారు రూ.10వేల కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు.

300 కిలోమీటర్ల మేర వైట్ టాపింగ్ రోడ్లు
రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తీర్చిదిద్దాలని, గుంతలు లేకుండా చేసేందుకు ప్రధాన రహదారులను పూర్తిగా వైట్ టాపింగ్ రోడ్లుగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉంది. ఇందులో భాగంగా సుమారు 300కిలోమీటర్ల పొడవున ప్రధాన రోడ్లను అభివృద్ధిచేయాలని, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన ఉంది. దీనికోసం ఒక్కో కిలోమీటరుకు సుమారు మూడు కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనాలు ఉన్నాయి.

185 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు
నగరంలోని 185 చెరువుల సమగ్రాభివృద్ధికి సైతం ప్రణాళికలు ఉన్నాయి. ప్రస్తుతానికి సుమారు రూ. 250 కోట్లతో 19చెరువులను అభివృద్ధిచేస్తున్నారు. మిగిలినవాటిని కూడా ఇదే తరహాలో అభివృద్ధి, సుందరీకరణ పనులతో తీర్చిదిద్దాలని, అంతేకాకుండా మురుగునీటిని శుద్ధిచేసి చెరువులను ప్రక్షాళన చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీనికోసం మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు సైతం ఒక్కో చెరువుకు కనీసం రూ. 10కోట్ల చొప్పున ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు.

మూసీకి ఇరువైపులా కారిడార్లు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. మూసీకి ఇరువైపులా కారిడార్ల నిర్మాణం, పచ్చదనం అభివృద్ధి, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంది. సుమారు రూ.5వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా.

లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లు
సంక్షేమంలో పేదల గృహనిర్మాణానికి ఇప్పటికే రూ.8 వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో 30 వేల గృహాల పనులు తుదిదశకు చేరుకున్నాయి. మిగిలినవాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మోడల్ మార్కెట్లు, ఫంక్షన్‌హాళ్లు తదితర అనేక ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే మూడేండ్లలో రూ.50వేల కోట్లునగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఇదివరకే పలుమార్లు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అంతేకాకుండా నగర సమగ్రాభివృద్ధికిగాను వచ్చే మూడేండ్లలో సుమారు రూ.50 వేల కోట్లు ఖర్చుచేస్తామని సీఎం గతంలోనే ప్రకటించారు. నగరాభివృద్ధిపై ఇప్పటికే ఆ రంగానికి చెందిన నిపుణులతో ముఖ్యమంత్రి పలుదఫాలు చర్చించారు. ఆయా అభివృద్ధి కార్యక్రమాలపై అధికార యంత్రాంగం, కన్సల్టెంట్ల నివేదికలు ఇదివరకే సమర్పించాయి. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సివున్నప్పటికీ ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో ఇందులో నిధుల కేటాయింపునకు అవకాశం లేదని, పూర్తిస్థాయి బడ్జెట్‌లో నగర సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించే ఆస్కారం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

జిల్లాలో ఇస్తున్న పింఛన్ల వివరాలు..

జిల్లాలో మొత్తం పింఛన్లు 2,00,708
అందిస్తున్న మొత్తం 21,53,34,500
పెంపుతో 43,38, 80, 328
భారం 21,85,45,828
పింఛన్ల వారీగా వివరాలు..
పింఛన్లు సంఖ్య
వృద్ధాప్య 58,834
వికలాంగ 29,253
వితంతు 96,124
చేనేత 06
గీతకార్మికులు 02
హెచ్‌ఐవీ పేషంట్లు 8,120
బోధకాలు బాధితులు 3
బీడీ వర్కర్లు 49
ఒంటరి మహిళలు 8287
మొత్తం 2,00,708


ఆరోగ్యబాద్‌గా.. హైదరాబాద్

ప్రతి 10వేల మందికి ఒక బస్తీదవాఖాన
నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరాన్ని ఆరోగ్యబాద్‌గా మార్చే క్రమంలో బస్తీ స్థాయిలోనే రోగాలకు చెక్ పెట్టేందుకు వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు ముమ్మరం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ వైద్య, ఆరోగ్య విభాగంపై ఆ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. నగర వాసులకు మెరుగైన చికిత్స అందించే లక్ష్యంతో వైద్యసేవలను మరింత విస్తరిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రతి 10వేల మందికి ఒక బస్తీ దవాఖానను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకే ఈ బస్తీ దవాఖానలు, కంటివెలుగు, ఈఎన్‌టీ, దంత వైద్యాన్ని ప్రజల ఇండ్ల ముంగిటకు తీసుకువస్తున్నట్లు వివరించారు.

నగరంలో ఇప్పటికే 40బస్తీ దవాఖానలు సేవలందిస్తున్నట్లు సీఎం తెలిపారు. బస్తీ దవాఖానల్లో ప్రాథమిక వైద్యంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ తదితర అంశాలను సీఎం తన ప్రసంగంలో ప్రస్తావించారు. వైద్య, ఆరోగ్యశాఖ గ్రేటర్‌లో మొత్తం 220 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 106, రంగారెడ్డి జిల్లా పరిధిలో 60, మేడ్చల్ జిల్లా పరిధిలో 54 చొప్పున బస్తీదవాఖానలను ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు ముమ్మరం చేసింది. దశల వారీగా ఇప్పటికే వైద్య, పరిపాలన సిబ్బందికి సంబంధించిన నియామకాలు సైతం జరుగుతున్నాయి. బస్తీ దవాఖానలు అందుబాటులోకి వస్తే నిరుపేదలకు వైద్యసేవలు మరింత దగ్గరవుతాయి. బస్తీ స్థాయిలోనే వైద్యసేవలు అందితే గ్రేటర్ హైదరాబాద్ పూర్తి ఆరోగ్యబాద్‌గా మారనుంది.


మురిపించిన బడ్జెట్

-సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట
మేడ్చల్ జిల్లా నమస్తే తెలంగాణ ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సంబంధించి రుణమాఫీ కింద రూ.1లక్షల లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రకటించడంతో పాటు ప్రస్తుతం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. దీంతో జిల్లాలో సుమారు 12,417 మంది రైతులకు మేలు జరుగనున్నది. అలాగే రైతుబంధు కింద సుమారు 30వేల మంది రైతులకు ప్రతి ఏడాది ఎకరాకు రూ.10వేల చొప్పున అందనున్నాయి.

పెరుగనున్న పింఛన్‌దారులు
జిల్లాలో ప్రస్తుతం 1,10,440 మంది పింఛన్లు తీసుకుంటున్నారు. ఇందులోప్రస్తుతం వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, బోదకాలు బాధితులకు, బీడీ, నేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న రూ.1000 నుంచి వచ్చే ఏప్రిల్ నుంచి రూ.2016, వికలాంగులకు ప్రస్తుతం ఉన్న రూ.1500 ఇస్తుండగా, వచ్చే ఏప్రిల్ నుంచి రూ.3016 ఇవ్వనున్నట్లు సీఎం తెలుపడంతో పాటు బడ్జెట్‌లో నిధులు కేటాయించడం పట్ల పింఛన్‌దారులు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే పింఛన్‌దారుల అర్హత వయసును 65 ఏండ్ల నుంచి ఏకంగా 57 ఏండ్లకు కుదించడంతో జిల్లాలో వృద్ధాప్య పింఛన్‌దారుల సంఖ్య రెట్టింపు కానుంది.
* వీటితో పాటు నిరుద్యోగ భృతి రూ.3116 ఇస్తుండగా సుమారు 30వేల మంది లబ్ధిపొందనున్నారు.
* ప్రతి గ్రామానికి అభివృద్ధికి చిరునామాగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం బడ్జెట్‌లో ఒక్కో గ్రామానికి రూ.8లక్షల నిధులు కేటాయించారు. దీంతో మేడ్చల్ జిల్లాలో 61 గ్రామాలకు లబ్ధి జరుగనుంది.
* స్వంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి నిధులు కేటాయించడంతో జిల్లాలో లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
* అలాగే జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలకు 5 గురుకుల పాఠశాలలు కొత్తగా మంజూరు చేయనున్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పాధాన్యత

బడ్జెట్‌లో రైతులు, పేదలకు పెద్దపీట
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఇటీవల ఎన్నికల హామీలో భాగంగా రైతుబంధు సాయం పెంపు, పింఛన్ల పెంపు, వృద్ధుల పింఛన్లకు వయస్సు సడలింపు, రైతుబీమా, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ తదితర పథకాలన్నింటికీ సీఎం కేసీఆర్ శుక్రవారం శాసనసభలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో ఆయా వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
* 10లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు లభించాయి.
* ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్లు, కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం ఇక వేగిరం కానుంది.
* డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో భాగంగా సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గ్రామీణ జిల్లాలకు ఇప్పటికే 677 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరై ఉండగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1లక్ష ఇండ్లు మంజూరై ఉన్నాయి.
* అంతర్జాతీయ ప్రమాణాలతో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణం చేపట్టనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు అవతల 340 కిలో మీటర్ల పొడవైనా ఈ రోడ్డును అన్ని ప్రమాణాలతో నిర్మించనున్నారు. అయితే రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణం సింహభాగం జిల్లా మీదుగా వెళ్తుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పుంజుకోనుంది. దాదాపుగా జిల్లాలో 150 కిలోమీటర్లకు పైగా ఉండనున్నది.

* లక్ష రూపాయలలోపు రైతు రుణమాపీ చెల్లిస్తామని బడ్జెట్ ప్రసంగంలో సీఏం కేసీఆర్ రైతులకు తిప్పి కబురు అందించారు. దీంతో జిల్లాలో 1లక్ష మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతు బీమా లబ్ధిదారులు 1.32వేల మంది ఉండగా వీరికి గాను రూ.30 కోట్లు ప్రిమియం చెల్లించారు. జిల్లాలో 362 మంది రైతులు చనిపోవడంతో 339 మంది రైతు కుటుంబాలకు రూ.16కోట్ల 95లక్షల బీమా చెల్లించారు.
* రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.5వేలు చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.10వేలు అందించనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో 2.48 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది.
* ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులకు పెంచిన పింఛన్ ప్రకారం ఇవ్వనున్నారు. అంతేకాకుండా వృద్ధుల వయస్సును సడలించారు. అయితే 57 ఏండ్లు పైబడిన వయస్సున్న వారు జిల్లాలో 1,94,000 మంది ఉండగా ఇందులో దాదాపు 80 శాతం అర్హత సాధిస్తారని అధికారులు వెల్లడించారు. కొత్త, పాత కలిపి అన్ని రకాల పింఛన్ లబ్ధిదారులు 2,16,000 మందికి చేరుకోనుంది.
* నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తుండగా జిల్లాలో దాదాపుగా 20 నుంచి 30వేల మంది నిరుద్యోగులకు లబ్ధిచేకూరనున్నది.
* జిల్లాలో ప్రస్తుతం 8 గురుకులాలు ఉండగా, మరో 8 గురుకులాలు రానున్నాయి.

1225

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles