జ్ఞాన తెలంగాణ నిర్మిద్దాం

Sun,February 17, 2019 01:07 AM

తెలుగుయూనివర్సిటీ: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు తమ పరిశోధనాభిలాషను మరింత స్ఫూర్తివంతంగా మలుచుకుంటూ జ్ఞాన తెలంగాణ నిర్మాణం వైపు అడుగులు వేయాలని విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. జిజ్ఞాస రాష్ట్ర స్థాయి పరిశోధన ప్రాజెక్టుల విజేతలకు నగదు పురస్కారాల ప్రదానోత్సవం నాంపల్లిలోని తెలుగువర్సిటీ ఆడిటోరియంలో శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ నవీన్‌మిట్టల్ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించేలా పరిశోధన సంస్థల సంచాలకులు, ఆచార్యులు కృషి చేయలని కోరారు. పరిశోధన శక్తిని మరింత విస్తృతం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోపడేలా కృషి జరుగాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. డిగ్రీ స్థాయిలోనే పరిశోధనలపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచితే భవిష్యత్‌లో వారు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని తెలుగువర్సిటీ రిజిస్ట్రార్ అలేఖ్య పుంజాల అన్నారు. విజేతలను మార్గదర్శకంగా తీసుకొని మరికొందరు స్ఫూర్తి పొందాలని ఆమె కోరారు. ఐఐసిటీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులను కేవలం సిద్ధాంతపరమైన, పుస్తక పరిజ్ఞానానికి మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలపై అడుగులు వేసేలా ప్రోత్సహించాలని అధ్యాపకులకు సూచించారు. న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన అనురాధారెడ్డి మాట్లాడుతూ మూడేండ్లుగా ప్రభుత్వం గొప్పగా జిజ్ఞాస కార్యక్రమం చేపట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక పరిశోధనాసక్తిని వెలికితీస్తూ వారిలో ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలను మెరుగుపరుస్తూ ముందుకెళ్లడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పరిశోధనా ప్రాజెక్టుల విజేతలకు ఎనిమిది లక్షల రూపాయల నగదు బహుమతులను, సర్టిఫికెట్లను నవీన్‌మిట్టల్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ పి. బాలభాస్కర్, జిజ్ఞాస కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ నాన్సీ సెరెనా తదితరులు పాల్గొన్నారు.

339

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles