కేశవాపూర్ కోసం భూసేకరణ వేగవంతం

Mon,February 11, 2019 02:07 AM

-ఈ నెలాఖరులో రూ. 4396.16 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన
-ఇన్‌టేక్, పైప్‌లైన్ విస్తరణ పనులకు లైన్ క్లియర్
-రిజర్వాయర్ నిర్మాణానికి ఆలస్యమైనా నీటి తరలింపునకు ఏర్పాట్లు
సిటీబ్యూరో: గ్రేటర్ ప్రజలకు శాశ్వత దాహార్తిని తీర్చే ప్రాజెక్టుగా ప్రభుత్వం రూ. 4396.16 కోట్లతో నిర్మించనున్న కేశవాపూర్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసేందుకు జలమండలి యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. నగరానికి డెడికేటెడ్ రిజర్వాయర్లు ఉండాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు కేశవాపూర్ దగ్గర పది టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ నెలాఖరులో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, శరవేగంగా పూర్తి చేయాలన్న రెండు రోజుల కిందట సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే భూ సేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పనులను చేపట్టేందుకు జలమండలి అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. భారీ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, నిర్మాణ పనులకు సమయం పట్టే అవకాశాలున్న తరుణంలో ఇన్‌టేక్, భారీ పైప్‌లైన్ విస్తరణ పనులపై తొలుత దృష్టి సారించింది. ప్రధాన రిజర్వాయర్ మినహా ఏడాదిలోగా ప్రాజెక్టులోకి కీలకమైన పనులన్నింటినీ పూర్తి చేసి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఉన్న గోదావరి-కృష్ణా రింగ్ మెయిన్ పైప్‌లైన్‌కు ఈ ప్రాజెక్టును అనుసంధానం చేయనున్నారు. ఏ రిజర్వాయర్‌లోనైనా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్టు దోహదపడనున్నది.
గోదావరి జలాలను తరలించి..
ఏకంగా పది టీఎంసీల గోదావరి జలాలను నిల్వ చేసేందుకు కేశవాపురం దగ్గర ఈ భారీ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను తరలించి, నిల్వ చేయనున్నారు. రూ. 4396.16 కోట్ల పనులను మెగా ఏజెన్సీకి కేటాయించగా, పనులు చేపట్టేందుకు సదరు ఏజెన్సీ సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే తొలుత వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, రిజర్వాయర్ ఇన్‌టేక్ పనులను చేపట్టనున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నారాయణపూర్ మీదుగా దాదాపు ఎనిమిది గ్రామాలు దాటి బొమ్మరాసిపేట వరకు ఇన్‌టేక్ పనులను చేపడుతారు. పంచాయతీ శాఖ రోడ్‌కు ఇరువైపులా దాదాపు 18 కిలోమీటర్ల మేర జరిగే ఈ పనులకు 16 కిలోమీటర్లు మేర ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులకు అనుకూలంగా ఉంది. రెండున్నర కిలోమీటర్ల మేర పొలాలు ఎక్కువగా ఉందని గుర్తించారు. కాలువ (గ్రావిటీ) ఆధారంగానే నీటిని సరఫరా చేసేందుకు వీలుగా 3,600 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్ స్టీల్ పైప్‌లైన్లను రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసల్లో ఏర్పాటు చేయనున్నారు. అక్కడికి సమీపంలోని బొమ్మరాస్‌పేట నీటి శుద్ధి కేంద్రంలో 172 మిలియన్ గ్యాలన్ల (10టీఎంసీల) రావాటర్‌ను శుద్ధి చేయనున్నారు. బొమ్మరాస్‌పేట డబ్ల్యూటీపీ (నీటి శుద్ధ్ది కేంద్రం) నిర్మాణానికి దాదాపు 95 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఇందులో దేవాదాయ శాఖకు సంబంధించిన 65 ఎకరాలకు సంబంధించి జలమండలి అధికారులు స్వయంగా ఇటీవల రూ. 24కోట్లు కేటాయించి సంబంధిత మొత్తం భూములను స్వాధీనం చేసుకొని పనులకు మార్గం సుగమమం చేశారు. మిగిలిన 30 ఎకరాల మేర ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. పంప్‌హౌస్‌లు, పంపింగ్ స్టేషన్లు, భారీ రిజర్వాయర్ నిర్మాణ పనులకు భూ సేకరణ ఆధారంగా పనులు చేపడుతారు.

900

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles