ఫ్రెండ్లీ పోలీసింగ్.. దేశానికే ఆదర్శం

Mon,February 11, 2019 02:07 AM

పోలీస్ కమిషనర్ అంజనీకుమార్
తెలుగుయూనివర్సిటీ: సమాజంలో శాంతిభధ్రతల పరిరక్షణలో నిరంతరం ఒత్తిడితో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి కుటుంబ సభ్యుల ఆదరణ వారిలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ అన్నారు. సైబర్ క్రైం కార్యాలయం ఆవరణలో పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పిల్లలతో కలిసి సందడి చేశారు. విద్యలో ఉత్తమ ప్రతిభ చూపిన సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌కు శాంతి భద్రతల విషయంలో నాలుగున్నరేండ్లలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఎంతో మంచి పేరు వచ్చిందన్నారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దీనికి కారణం పోలీసుల త్యాగాలు, వారి కుటుంబ సభ్యుల తోడ్పాటుతోనే సాధ్యమైందన్నారు. హైదరాబాద్ పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నారని వారి కృషిని ఆయన కొనియాడారు. అడిషనల్ సీపీ షిఖాగోయెల్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో పోలీసులు ఒక చోట కలవడం వల్ల వారి మధ్య బంధాలు మరింత పెరిగే అవకాశముందన్నారు. ప్రజలు సురక్షితంగా, భద్రంగా ఉన్నారంటే పోలీసులు కృషితో పాటు వారి కుటుంసభ్యుల ప్రోత్సాహం వల్లేనన్నారు. పోలీసులు వాడుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కార్యాలయంలో వారు చేసే విధుల స్థితిగతులను కుటుంబసభ్యులు స్వయంగా వచ్చి చూడడం వల్ల వారి శ్రమ వెనుక గల కృషిని తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. పిల్లల కోసం సమయం కేటాయించని స్థితిలో ఉన్న వారికి ఇది ఒక మంచి వేదికగా నిలిచిందని డీసీపీ అవినాష్ మహంతి అన్నారు.

542

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles