నీటిబొట్టు.. ఒడిసి పట్టు

Mon,February 11, 2019 02:06 AM

- ఉష్ణోగ్రతలు తగ్గించేటట్టు..
- వరదల నుంచి నగరానికి విముక్తి కోసం ఇంజినీరింగ్ విద్యార్థుల ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టు
- రిసెప్టివ్ పేవర్స్ పేరుతో రూపకల్పన
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ మహానగరం కాంక్రీట్ జంగిలా మారిపోయింది. పెరుగుతున్న జనాభాతో పాటు ఆధునీకరణ పేరుతో నగరంలో ఎటుచూసినా కాంక్రీట్ తప్ప నేలతల్లి కన్పించడం లేదు. ఫలితంగా చిన్నపాటి వర్షాలు వచ్చినా నగరంలో వరదలు వెల్లువెత్తుతాయి. ఇక వర్షాకాలంలోనైతే ఈ పరిస్థితి దారుణంగా ఉంటుంది. వర్షా కాలంలో మహానగరంలో వరదల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను జీహెచ్‌ఎంసీ యంత్రాంగం యాక్షన్ టీమ్‌లతో తొలిగించినా.. అక్కడక్కడ మానవ తప్పిదాల కారణంగా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతలపై పోరు చేస్తున్నా.. నగరవాసులు ఆశించినమేర స్పందించడంలేదు. ఈ నేపథ్యంలో నగర శివారులోని ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన విద్యార్థులు ఇలాంటి దుర్భర పరిస్థితులను నగరం నుంచి తరిమేందుకు కంకణం కట్టుకున్నారు. గతేడాది సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ముగ్గురు విద్యార్థులు ఒక అధ్యాపకుడి సహకారంతో వినూత్న ప్రాజెక్టును రూపొందించారు. రిసెప్టివ్ పేవర్స్ పేరుతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి.. ఆచరణలోకి తీసుకొచ్చారు. ఏడాది పాటు కాలేజీలో ప్రయోగాత్మకంగా శ్రమించిన విద్యార్థుల ఫలితానికి తుదిరూపుతో పెటెంట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పర్యావరణ హితం కావడంతో పాటు రాత్రివేళల్లో నగరంలోని ఉష్ణోగత్రలను తగ్గిస్తుండడం గమనార్హం.
నగర శివారులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు తోట రాజు, రవి, దివాకర్‌లు హెచ్‌వోడీ క్రిష్ణారావు సహకారంతో రిసెప్టివ్ పేవర్స్ ప్రాజెక్టును రూపొందించారు. నగరంలో వరద తీవ్రతను తగ్గించడంతోపాటు భూగర్భ నీటి మట్టాలను పెంపొందించాలనే లక్ష్యంతో ఏడాదిపాటు ఈ ప్రాజెక్టుకు కృషి చేశారు. అందులో భాగంగానే కాలేజీలో 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1.40లక్షల ఖర్చుతో రిసెప్టివ్ పేవర్స్‌ను నిర్మించారు. దానిపై వరద నీరు వచ్చేలా ఏర్పాటు చేసి.. అది ఏ మేరకు విజయవంతమైందో పరిశీలించారు. పేవర్స్ వరద నీటిని లోపలికి గుంజుకోవడంతోపాటు భూగర్భ నీటి మట్టాలు ఆ చోట పెరుగుతున్నట్లు శాస్త్రీయంగా గుర్తించారు. ఈ విధానం అమల్లోకి వస్తే.. నగరంలో గ్రామాల్లో ఉండే వాతావరణ పరిస్థితులు ఉంటాయని ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన బృందం చెబుతున్నది.
పార్కింగ్ స్థలమే.. ఇంకుడు గుంతగా..
నగరంలో ఇండ్ల స్థలాల్లో ఇంకుడుగుంతలను నిర్మించుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే.. ఇంకుడుగుంతను నిర్మిస్తే స్థలం వృథా అవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అయితే ఇంటి స్థలంలో భవనం నిర్మాణం స్థలం పోనూ.. మిగిలిన ఖాళీ స్థలంలో పార్కింగ్, నడకకు వినియోగించే స్థలంలోనే సాధారణ టైల్స్‌కు బదులు ఈ తరహా ప్రాజెక్టును చేపడితే.. ఎక్కడా స్థలం వృథా అవ్వదు. ఈ ప్రాజెక్టును చేపట్టిన స్థలంలో సాధారణ నేలపైన ఎలాంటి పనులు చేస్తామో.. అలాంటివే చేపట్టొచ్చు. కాకపోతే.. ఈ ప్రాజెక్టుపై భారీ వాహనాలను నడిపే వీలుండదు. కార్లు, ద్విచక్రవాహనాలు, లైట్ వెహికల్ వాహనాలు నడుపొచ్చు. ఇది కాకుండా వర్షకాలం సమయంలో చినుకులు పడినా.. రోడ్లు చిత్తడిగా మారతాయి.
రిసెప్టివ్ పేవర్స్ తయారీ ఇలా..
ఈ ప్రాజెక్టును చేపట్టాలనుకుంటున్న ప్రాంతంలో ముం దుగా వరద తీవ్రతను అంచనా వేయాలి. ఈ అంచనా లెక్కలు స్థానిక అధికారుల వద్ద అందుబాటులో ఉంటా యి. ఆ లెక్క ప్రకారం.. మొదటగా రెండు ఫీట్ల లోతులో గుంతను తవ్వాలి. అందులో 40 ఎంఎం కంకరను ఫీటు మేర పరచాలి. మరో అరఫీటు 20 ఎంఎం కంకరను వేయాలి. కంకర మీద గోనేసంచులు గానీ, జియో టెక్స్‌టైల్స్ లేయర్‌ను గానీ వేయాలి. గోనే సంచుల మీద మూడు ఇంచుల మేర ఇసుకను పోయాలి. ఈ ఇసుక మీద పేవర్స్(టైల్స్)ను పార్కింగ్ స్థలాలు, పార్కుల్లో వాకింగ్ చేసే స్థలాల్లో వేసే టైల్స్‌ను సెట్ చేయాలి. ఇందులో ఎక్కడా సిమెంట్‌ను వినియోగించరు. ఇలా పరిచిన టైల్స్ మీద చుక్క నీరు పడినా.. అవి లోనికి వెళతాయి. ఫలితంగా వరదలు పోటెత్తకపోవడంతోపాటు భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. అయితే ఈ పేవర్స్ ఒక చదరపు అడుగుకు మూడు పడతాయి. ఒక్కో టైల్‌కు రూ.480కి లభిస్తాయి. దీన్ని ఒక్కసారి నిర్మిస్తే.. ఏండ్లపాటు మన్నికగా ఉంటుంది.

775

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles