పారిశుధ్యంపై నానోతో నిఘా

Thu,January 24, 2019 01:00 AM

-ప్రయోగాత్మకంగా ఖైరతాబాద్ జోన్ ..
-ఫిబ్రవరి తొలి వారంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం
-ప్రైవేటీకరణ వదంతులు నమ్మొద్దు
-చెత్త సేకరణ నిర్వహణ పూర్తిగా బల్దియాదే
-అభివృద్ధి, పారిశుధ్యంపై త్వరలో విజన్ డాక్యుమెంట్
-ఓటర్ల జాబితాలో పేర్లకు ఫిబ్రవరి 4వరకు గడువు
-జీహెచ్ కమిషనర్ దానకిశోర్ వెల్లడి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇంటింటి చెత్త సేకరణ(ప్రైమరీ కలెక్షన్) పనులను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని జీహెచ్ కమిషనర్ ఎం.దానకిశోర్ ఖండించారు. ఇటువంటి వార్తలు కేవలం పుకార్లని, వాటిని నమ్మరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంటింటి చెత్త సేకరణ ఎప్పటికీ జీహెచ్ పరిధిలోనే ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. నగర సమగ్రాభివృద్ధితోపాటు పారిశుధ్య పనులను మరింత సమర్థవంతంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఓ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. దీనిపై మేధావులతో చర్చిస్తున్నట్లు, త్వరలోనే దీన్ని విడుదల చేస్తామన్నారు. జీహెచ్ ప్రధాన కార్యాలయంలో బుధవారం కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్న అసత్య ప్రచారంపై కార్మికులు కంగారుపడొద్దని, వారికి ఎటువంటి అన్యాయం జరుగదని హామీ ఇచ్చారు. పారిశుధ్య నిర్వహణలో నగరానికి ఉన్న మంచిపేరును కొనసాగించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంటింటి చెత్త సేకరణ పనులు ఎప్పటికీ ప్రైవేటుకు ఇవ్వడం జరుగదని స్పష్టం చేశారు.

ఈనెల 31తో స్వచ్ఛ సర్వేక్షణ్-2019 పూర్తవుతున్నప్పటికీ ఆ తరువాత కూడా పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు కొనసాగుతాయన్నారు.‘షాన్ హైదరాబాద్ సాఫ్ హైదరాబాద్’ పేరుతో ముందుకు సాగనున్నట్లు, ఇందులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు. స్వచ్ఛ కార్యక్రమాలను కేవలం స్వచ్ఛ సర్వేక్షణ్ వరకే పరిమితం చేయకుండా నిరంతరం కొనసాగించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామన్నారు. ముఖ్యంగా స్వచ్ఛసేన ఏర్పాటు, నానో మొబిలిటీ వాహనాల ఏర్పాటు, వ్యర్థజలాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, స్వచ్ఛ వార్డు అధికారులు, స్వచ్ఛ విజన్ యాప్ రూపకల్పన, నో కాంప్రమైజ్ జోన్, టెక్నాలజీ సహాయం తదితర కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టడంపై విజన్ డాక్యుమెంట్ ప్రకటించనున్నట్లు కమిషనర్ చెప్పారు.

ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోండి
ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు నమోదు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈనెల 24వ తేదీ వరకు సాయంత్రం 4 నుంచి 7గంటల వరకు జిల్లాలోని 84 వార్డు కార్యాలయాల్లో సిబ్బంది, దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి లేఖలు రాసినట్లు, బీఎల్ స్వయంగా వాటిని ఇంటింటికీ పంపిణీ చేస్తారన్నారు. అందులో ఓ కార్డు ఉంటుందని, తమ సూచనలు, సలహాలను వాటిల్లో రాసి పంపాలన్నారు. గతంలో భారీగా ఓట్లు గల్లంతైనట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జాబితా సవరణ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడిగించామన్నారు. అంతేకాకుండా, కాలేజీలు, మాల్స్ డ్రాప్ ఏర్పాటు చేసినట్లు, అక్కడ ఉండే దరఖాస్తు ఫారాలు పూరించి జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

ఈ ఏడాది మూడు కోట్ల మొక్కలు..
హరితహారంలో భాగంగా ఈ ఏడాది నగరంలో మూడు కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధారించినట్లు చెప్పారు. ఔటర్ రింగురోడ్డు వెంబడి ఖాళీ జాగాలతోపాటు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆస్తిపన్ను సకాలంలో చెల్లించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది రూ.1500 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ.897 కోట్లు మాత్రమే వసూలైనట్లు చెప్పారు. అయినా అభివృద్ధి పథకాలకు నిధుల కొరత లేదని, ఎస్ డబుల్ బెడ్ పథకాలు సజావుగా సాగుతున్నాయని కమిషనర్ దానకిశోర్ వివరించారు.

త్వరలో స్వచ్ఛ విజిల్ యాప్..
పారిశుధ్య పనుల పర్యవేక్షణ కోసం 150 వార్డుల స్వచ్ఛ అధికారులకు ట్యాబ్ ఇచ్చినట్లు కమిషనర్ చెప్పారు. రోజూ పారిశుధ్య పనులను ఫొటోలు తీసి వాటిని అప్ చేయాల్సి ఉంటుందన్నారు. వీటిద్వారా వచ్చే డేటా స్వచ్ఛతను పెంపొందించేందుకు చాలా వరకు దోహదపడుతుందన్నారు. దీంతోపాటు ప్రజల్లో స్వచ్ఛత పట్ల పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు ఎన్జీవోలు, మేథావి వర్గం సేవలను ఉపయోగించుకుంటామన్నారు. అలాగే, స్వచ్ఛ కార్యక్రమాల్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)తోపాటు ఇండోర్ నగరానికి చెందిన ఓ ఎన్జీవోను కూడా భాగస్వామిని చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలో స్వచ్ఛ విజిల్ యాప్ అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. దీంతో పారిశుధ్య సమస్యలకు సంబంధించి ప్రజలు ఫొటోలు, వీడియోల ద్వారా తమ ఫిర్యాదులను అందించవచ్చన్నారు. స్వచ్ఛతపై రాబోయే ఆరు నెలలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటు
న్నామన్నారు.

నానో కారుతో పర్యవేక్షణ
నానో కారుకు కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రోడ్లపై పారిశుధ్యాన్ని పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఒక్కో కారుకు ముందుభాగంలో మూడు సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కంప్యూటర్ అనుసంధానం చేస్తామని, ఇందులో రోడ్డుపై జరిగే దృశ్యాలన్నీ రికార్డవుతాయని పేర్కొన్నారు. చాలా మంది వాహనాల్లో వెళ్తూ చెత్తను రోడ్ల వెంబడి పారేయడం, వ్యర్థ జలాలను రోడ్లపైకి వదలడం వంటివి చేస్తుంటారని, అటువంటి వారిని గుర్తించి వారికి జరిమానాలు విధించేలా ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా, వీటిని జీహెచ్ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానం చేస్తామని, ఈ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యేదంతా కమాండ్ కంట్రోల్ రూమ్ వీక్షించవచ్చన్నారు. ప్రస్తుతానికి ఖైరతాబాద్ జోన్ కోసం ఒక నానో కారును ప్రయోగాత్మకంగా రంగంలోకి దింపుతున్నట్లు, భవిష్యత్ మొత్తం ఆరు జోన్లకు ఇటువంటి వాహనాలను సమకూర్చుతామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ వచ్చే ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభించనున్నట్లు కమిషనర్ తెలిపారు.

680

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles