మహిళా నేత.. సమాజ హిత

Mon,January 21, 2019 01:15 AM

- ముగిసిన జాగృతి సదస్సు
- ఏర్పాట్లపై విదేశీ ప్రతినిధుల కితాబు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో ఆదివా రం మహిళా నాయకత్వంపై జరిగిన చర్చ ఆకట్టుకున్న ది. పలు రంగాల్లో రాణిస్తున్న ప్రముఖుల ప్రసంగాలు స్ఫూర్తినింపాయి. 135 దేశాల నుంచి 550 మందికి పైగా యువ ప్రతినిధులు హాజరైన సదస్సు ఆద్యంతం అలరించింది. కార్యక్రమ నిర్వహణ, ఏర్పాట్లపై పలు దేశాల ప్రతినిధులు తెలంగాణ జాగృతిని అభినందించారు. హెచ్‌ఐసీసీలో మూడు రోజులుగా జరుగుతున్న సదస్సు విజయవంతంగా ముగిసింది.

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు విజయవంతంగా ముగిసింది. మహిళా నాయకత్వంపై ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో జరిగిన చర్చ ఆకట్టుకున్నది. 135 దేశాల నుంచి 550 మందికి పైగా ప్రతినిధులు హాజరైన సదస్సు ఆద్యంతం అలరించింది. యువత సమస్యలు, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధిపై సాగిన వక్తల ప్రసంగాలు ఆలోచింపజేశాయి. సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై పలు దేశాల ప్రతినిధులు తెలంగాణ జాగృతిని అభినందించారు. పలు రంగాల్లో రాణిస్తున్న, కీలక హోదాల్లో ఉన్న మహిళా ప్రముఖులు హాజరవ్వడం స్ఫూర్తినిచ్చింది. స్కిల్ బిల్డింగ్ ఫర్ సైస్టెనబిలిటీ, ఇన్నొవేటివ్ వర్క్‌షాప్ ఆసక్తిగా సాగింది.

మమకారం పెంచింది..

విదేశాలకు రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి వలంటీర్లు రిసీవ్ చేసుకున్న విధానం.. ఇచ్చిన గౌరవం.. తెలంగాణ ప్రజల మీద మమకారాన్ని పెంచింది. నగరంలో పలు ప్రాంతాలను సందర్శించాను. హైదరాబాద్ ప్రాచీన సంపదను కాపాడుకునేందుకు చూపిస్తున్న చొరవ అబ్బురపరుస్తున్నది. జోర్డాన్‌తో పోల్చితే.. హైదరాబాద్ వాతావరణం బాగుంది. నగరవాసులు ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరించడం బాగుంది. సదస్సులో తెలంగాణ వంటకాలను బాగా ఆస్వాదించా. ప్రత్యేకించి హైదరాబాద్ బిర్యానీ చాలా స్పైసీగా ఉంది.
- సురా అలుజో, జోర్డాన్

ఎంపీ కవిత.. మహిళా నేతలకు ఆదర్శంనిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత.. మహిళా నేతలకు ఆదర్శం. ఇంత చిన్న వయసులో ఎంతోమందిని మోటివేట్ చేయగల సత్తా ఆమె సొంతం. ప్రపంచ వ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె ప్రసంగించిన తీరు ఆలోచింపజేసింది. ఆమె నుంచి మేమెంతో నేర్చుకోవాల్సి ఉంది. 2025 నాటికి హైదరాబాద్.. ప్రపంచ నగరాల్లోనే నంబర్‌వన్‌గా నిలుస్తది. సదస్సుకు వచ్చిన ప్రతినిధులందరితో నా ఆలోచనలు పంచుకున్నా. ఈ సదస్సు నుంచి ఎంతో నేర్చుకున్నా.
- భాషిని సమర, శ్రీలంక

ఇలాంటి వేదికలు అరుదు

యువత సమస్యలపై అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి వేదికలు కల్పించడం చాలా అరుదు. గతంలో నేను కొన్ని సదస్సులకు హాజరయ్యాను. కానీ స్థానిక ప్రాంతాలకు చెందిన వారితోనే సదస్సులు నిర్వహించేవారు. కానీ తెలంగాణ జాగృతి యువత సమస్యలను చర్చిందేందుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించడం అభినందనీయం. ప్రపంచ దేశాల్లో యువత ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలపై ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చించారు. సమస్యల మూలాలను గుర్తించి.. ఎలా పరిష్కరించుకోవాలనే దానిపై చర్చించాము.
-లీతీవీఐ, వియత్నాం

ప్రోత్సాహం భేష్

ఇండియాకు రావడం ఇదే తొలిసారి. ఇక్కడి యువత మాకు ఎంతో సహకరించింది. మక్కా మసీదు చాలా అద్భుతంగా ఉంది. అయితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు చాలా సమయం పడుతున్నది. ఇండోనేషియాలో బాగా వేడిగా ఉంటుంది, కానీ హైదరాబాద్‌లో మాత్రం వాతావరణం చల్లగా ఉన్నది. తెలంగాణ వంటకాలు స్పైసీగా ఉండటంతో వాటిని ఆస్వాదించాం. తెలంగాణ జాగృతి ప్రపంచ స్థాయి దేశాల్లోని యువత సమస్యలపై చర్చించేందుకు ఇలాంటి వేదిక కల్పించడం బాగుంది.
-ఇన్‌టన్ కొమెరయ్య, ఇండోనేషియా

ఎంతో నేర్చుకున్నాం

అంతర్జాతీయ యువనాయకత్వ సదస్సు ప్రపంచ దేశాల్లోని యువతకు సుస్థిర అభివృద్ధిపై దిశానిర్దేశం చేసింది. మూడు రోజుల పాటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు ఎన్నో విషయాలను నేర్పింది. గాంధీజీ మార్గం, ఆశయాలు, మహాత్ముడిగా మారిన విధానం యువతకు ఆదర్శం. ప్రధానంగా ఎంపీ కవిత ప్రసంగిస్తూ.. ప్రస్తుతం మనం ఏం చేస్తే, భవిష్యత్తులో అదే మనకు తిరిగొస్తుందని చెప్పడం అందరినీ ఆలోచింపజేసింది. తెలంగాణ యువతకు త్వరలోనే ఆమె సారథి అవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
- మహ్మద్ పైజాన్, సౌదీ అరేబియా

సమస్యలపై అవగాహన

అంతర్జాతీయ యువనాయకత్వ సదస్సులో లింగ సమానత్వంపై చర్చించడం నిజంగా హర్షణీయం. సదస్సుకు వచ్చిన ప్రపంచ దేశాల ప్రతినిధులతో అనుభూతి కొత్తగా ఉంది. చాలా దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు వారి దేశాల్లోని లింగ సమానత్వంపై చర్చించారు. ప్రధానంగా మహిళల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ట్రూకప్ సంస్థ తరఫున పోరాడుతున్నాం. ఢిల్లీతో పోల్చితే.. హైదరాబాద్‌లో మహిళలకు కల్పిస్తున్న రక్షణ అభినందనీయం. షీ టీమ్స్ పేరుతో మహిళలకు అండగా నిలుస్తోన్న తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకు ఆదర్శం.
- అలక్షి, న్యూఢిల్లీ

వేగంగా అభివృద్ధి..

హైదరాబాద్ ఇటీవల వేగంగా అభివృద్ధి చెందుతున్నది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఇప్పటికే నగరం ఎవ్వరికీ అందని స్థాయిలో ఉన్నది. ఢిల్లీతో పోల్చితే.. హైదరాబాద్ వాతావరణం చాలా బాగుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో ప్రధానంగా గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అనే అంశంపై పలువురు వక్తలు మాట్లాడిన తీరు ఆకట్టుకున్నది. సుస్థిర అభివృద్ధిపై ఇప్పటివరకు మాములుగా ఒక అంచనా ఉండేది. కానీ ఈ సదస్సు ఫలితంగా సుస్థిర అభివృద్ధికి ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది.
- ఖుష్బూ, న్యూఢిల్లీ

గొప్ప అనుభూతి

తెలంగాణ జాగృతి నిర్వహించిన అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు తెలంగాణ కీర్తిని పెంచింది. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాక భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పింది. స్వయంగా మాకు ఇంత పెద్ద సదస్సుల్లో పాల్గొనడం గొప్ప అనుభూతి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం గురించి ప్రపంచ దేశాలకు ఉన్న అభిప్రాయం వేరు. ఈ సదస్సు నిర్వహణతో మంచి సదాభిప్రాయం ఏర్పడింది. అంతర్జాతీయ సదస్సులను సైతం తెలంగాణ రాష్ట్రం అగ్రదేశాలకు తీసిపోకుండా నిర్వహిస్తుందన్న నమ్మకం పెరిగింది. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ జాగృతికి రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారు.
- సుమంత్, వరంగల్, వలంటీర్

772

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles