జాప్యం జరుగదు.. తస్కరణ కుదరదు


Fri,January 11, 2019 12:33 AM

- యూఎల్‌సీలో డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం
- దస్ర్తాల స్కానింగ్ షురూ
- ఆన్‌లైన్‌లో భద్రపరిచేందుకు చర్యలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పట్టణ గరిష్ఠ భూ పరిమితి (అర్బన్ ల్యాండ్ సీలింగ్) విభాగాన్ని పటిష్టం చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఫైళ్లు, దస్ర్తాలు, మిస్సింగ్‌లకు చెక్‌పెట్టేందుకు, జాప్యాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ యూఎల్‌సీ విభాగంలో డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టంను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో యూఎల్‌సీలోని దస్ర్తాల స్కానింగ్‌ను అధికారులు ప్రారంభించారు. ఈ విభాగంలోని ఫైళ్లన్నింటిని ఆన్‌లైన్‌లో భద్రపరిచి, చెక్కు చెదరకుండా ఉండేందుకు వీలుగా ఈ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు.


గత పాలకుల నిర్లక్ష్యంతో..
యూఎల్‌సీ విభాగంలో గతమంతా వివాదాల మయంగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాల్లో యూఎల్‌సీ భూములున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ భూములన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విభాగంలోని ఇంటి దొంగలు ఉన్న స్థలాలకు సంబంధించిన ఫైళ్లను ఇంటికి తీసుకెళ్లడం, కొర్రీలు పెట్టేందుకు ఫైళ్లల్లోని కీలక పత్రాలను తస్కరించారు. దీంతో జనం, క్రమబద్ధీకరణ, వివాదాల తలనొప్పులు ఉన్నవారు ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో మిగిలి ఉన్న భూములనైనా పరిరక్షించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం యూఎల్‌సీ విభాగాన్ని పటిష్ఠం చేస్తూ వస్తున్నది. 2012 లెక్కల ప్రకారం జిల్లాలోని 16 మండలాల పరిధిలో మొత్తం 1074 సీలింగ్ కేసులున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇవన్నీ ఖాళీ స్థలాలు కావడంతో అధికారులు వీటిపై దృష్టిపెట్టలేదు. దీంతో క్రయ విక్రయాలు జరిగాయి. 1074 కేసుల్లో 135 ప్రాంతాల్లోని స్థలాలను ప్రభుత్వ విభాగాలకు కేటాయించారు. మరో 160 కేసులు కోర్టు కేసులతో పెండింగ్‌లో పడ్డాయి. మరో 325 స్థలాల్లో ఏకంగా నిర్మాణాలు వెలిశాయి. 152 ప్రాంతాల్లో ఖాళీ స్థలాలున్నట్లగా అధికారులు గుర్తించారు. ఉన్నవాటినైనా పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో యూఎల్‌సీ విభాగాన్ని రెవెన్యూలో అంతర్భాగం చేశారు. ఈ విభాగంలో పారదర్శకత, అక్రమాలను నివారించేందుకు తాజాగా డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టంను అమలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

రఘునందన్‌రావు చొరవతో..
జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు చొరవతోనే యూఎల్‌సీలో డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టంను అమలు చేస్తున్నారు. అయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు అక్కడి యూఎల్‌సీ విభాగంలో డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టంను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయగలిగారు. రంగారెడ్డి జిల్లా తరహాలో హైదరాబాద్‌లో అమలు చేసేందుకు పక్కా వ్యుహాత్మకంగా ముందుకెళ్లారు. ఫైళ్ల స్కానింగ్ ప్రక్రియ ముగియగానే ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

618

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles