since 1959.. ప్రజా సేవలో ఉస్మానియా


Fri,January 11, 2019 12:32 AM

- దంత వైద్యశాలకు 60 ఏండ్లు
- 12 మందితో ఆవిర్భావం.. ప్రపంచ వ్యాప్తంగా సేవలు
- 9 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో విస్తృతం
- దవాఖాన అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి
- కోట్ల రూపాయలతో సౌకర్యాలు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందనే సామెత వైద్య, ఆరోగ్య రంగానికి నూటికి నూరుశాతం వర్తిస్తుంది. నోరు ఆరోగ్యంగా ఉంటేనే ఇతర అవయవాలు బాగుంటాయి. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటే ఊరు, పల్లె, పట్టణం, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయి. మరి ఆ నోరు ఆరోగ్యంగా ఉండాలంటే దంతాలు బాగుండాలి అంటున్నారు మన వైద్య నిపుణులు. సాధారణంగా దంతాలపై చాలా మంది పెద్దగా దృష్టిపెట్టరు. పంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దంతవైద్యుడి వద్దకు పరుగులు తీస్తారు. కానీ 60 ఏండ్ల క్రితమే దంత వైద్య ఆవశ్యకతను అప్పటి ప్రభుత్వం గుర్తించింది. 1959లో నగరంలోని అఫ్జల్‌గంజ్ దవాఖాన(ఉస్మానియా జనరల్ హాస్పిటల్)కు అనుబంధంగా ప్రభుత్వ దంత కళాశాల (జీడీసీ)ను స్థాపించింది. 12 బీడీఎస్(బ్యాచ్‌లర్ ఆఫ్ డెంటల్ సైన్స్) సీట్లతో పురుడు పోసుకున్న జీడీసీ నేడు 100 డిగ్రీ సీట్లు, 24 పీజీ సీట్లు, 9 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో విస్తరించింది. ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి ఉన్న ఏకైక దంత వైద్య కళాశాలకు డా.ఎం.జి.రావు అధిపతిగా వ్యవహరించారు. అప్పట్లో దంత వైద్య విద్యను అభ్యసించాలంటే మద్రాసులోని దంత కళాశాలకు వెళ్లాల్సి వచ్చేది. అంతే కాకుండా దంత వైద్య విద్యను సెకండ్ ఆప్షన్‌గా పరిగణించేవారు.

అభివృద్ధి ఘనత కేసీఆర్‌దే..
ప్రభుత్వ వైద్య విద్య కళాశాల 60 ఏండ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం దంత కళాశాలను అభివృద్ధి చేసింది. రూ.25 కోట్లతో దంత వైద్య కళాశాల, వైద్యశాలలో అత్యాధునిక వైద్యపరికరాలు, స్కానింగ్, ఎక్స్‌రే యంత్రాలు వంటి సౌకర్యాలను సమకూర్చింది. 12.5 కోట్ల రూపాయలతో నూతనంగా ఆడిటోరియం, గ్రంథాలయం, హాల్ తదితర నిర్మాణాలను తెలంగాణ సర్కార్ చేపట్టింది. దంత వైద్యానికి ప్రాధాన్యతను కల్పిస్తూ ప్రభుత్వం 2000 డెంటల్ సర్జన్స్ పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసింది. దీంతో మొన్నటి వరకు ఉపాధి అవకాశాలు కరువై, ఇతర దేశాలకు వలసవెళ్తున్న దంతవైద్య విద్యార్థులకు రాష్ట్రంలోనే మంచి ఉపాధి అవకాశాలు లభించాయి. అంతే కాకుండా సొంత రాష్ట్ర ప్రజలకు సేవచేసే అదృష్టం లభించింది. ప్రభుత్వ దంత కళాశాల పరిధిలోని దవాఖానలో ప్రతి రోజు సుమారు 1000 మంది ఓపీ సేవలు పొందుతుంటారు. కార్పొరేట్‌కు దీటుగా అన్ని రకాల దంత వైద్య సేవలు ప్రభుత్వ దంత వైద్యశాలలో ఉన్నాయి. వేలు, లక్షల రూపాయల విలువ చేసే ఖరీదైన దంత వైద్యాన్ని ఇక్కడ పైసా ఖర్చులేకుండా ఉచితంగా అందిస్తున్నాం. అందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్య సమాజ స్థాపకుడిగా పేరుగాంచిన సీఎం కేసీఆర్‌కు వైద్య సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
-వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ దంత వైద్య కళాశాల, దవాఖాన

ప్రపంచ వ్యాప్తంగా సేవలు..
నగరంలోని ప్రభుత్వ దంత కళాశాలల్లో విద్యనభ్యసించిన దంత వైద్య విద్యార్థులు నేడు ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. అమెరికా, జపాన్, రష్యా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని పేరుగాంచిన దంత వైద్య కళాశాలల్లో వైద్యులుగాను, అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు. కళాశాల ఆవిర్భవించి 60 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇక్కడ విద్యనభ్యసించి, ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో వైద్యసేవలు అందిస్తున్న ప్రముఖ దంత వైద్యనిపుణులు డా.మీర్జాతో పాటు దేశ, విదేశాల నుంచి వందల సంఖ్యలో పూర్వ విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నగరానికి చేరుకున్నారు.

1980లో పీజీ సీట్లు..
కేవలం డిగ్రీ కోర్సుకే పరిమితమైన ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు 1980లో పీజీ సీట్లు మంజూరయ్యాయి. కాలక్రమంలో దంత వైద్యానికి సంబంధించి తొమ్మిది సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం నగరంలో ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 100 మంది డిగ్రీ, 24 మంది పీజీ, 50 మంది సీనియర్ రెసిడెంట్స్, రెసిడెంట్ వైద్య విద్యార్థులు దంత వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.

59 మంది అధ్యాపకులు..
ఒకప్పుడు దంత వైద్య విద్యను బోధించేందుకు అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండేది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ దంత కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులే అధ్యాపకులుగా ఎదిగి విద్యనభ్యసించిన మాతృసంస్థలోనే ప్రొఫెసర్లుగా బోధిస్తూ అధ్యాపకుల కొరతకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు దంత వైద్య కళాశాలలకు నగరంలోని ప్రభుత్వ దంత కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులే ప్రిన్సిపాళ్లుగా వ్యవహరించడం గమనార్హం.

753

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles