తెలుగు వర్సిటీకి తెలంగాణ వెలుగు


Fri,January 11, 2019 12:31 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు యూనివర్సిటికీ వెలుగులు తెచ్చింది. యూనివర్సిటీలోని విద్యార్థులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులను దూరం చేసి.. వర్సిటీ ప్రతిష్టను రాష్ట్ర ప్రభుత్వం మరోమెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే గతంలో ఏ ప్రభుత్వమూ కేటాయించని విధంగా ఒక్క ఏడాది కాలంలోనే అభివృద్ధి కోసం ఏకంగా రూ.20 కోట్లు కేటాయించింది. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లను మంజూరు చేయడంతో ఇప్పటికే వర్సిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.


రూ.9 కోట్లతో హాస్టల్ భవనం..
వర్సిటీ అభివృద్ధికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా బాచుపల్లిలో యూనివర్సిటీ బాలుర విద్యార్థుల కోసం నాలుగంతస్తుల హాస్టల్ భవనాన్ని(జీ ప్లస్ ఫోర్) రూ.9 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ వసతి గృహంలో అధునాతన లైబ్రరీ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు ఇప్పటికే ఉన్న వసతి గృహాలు, లైబ్రరీలకు మరమ్మతులు చేయిస్తున్నారు. నాంపల్లిలోని యూనివర్సిటీలో ప్రత్యేకంగా పరిపాలన భవనాన్ని రూ.3.5 కోట్లతో చేపట్టారు. ఇప్పటికే ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా వర్సిటీ ప్రాంగణంలోనే రూ.80 లక్షలతో ఓపెన్ ఎయిర్ థియెటర్‌ను రంగస్థలం పేరుతో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే వర్సిటీలో ఉన్న భవనాలకు లిఫ్ట్ సౌకర్యం లేదు. దివ్యాంగులు, పైఫ్లోర్స్, మెట్లు ఎక్కలేని సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీన్ని గమనించిన వర్సిటీ అధికారులు ఆ ఇబ్బందులను దూరం చేసేందుకు రూ.25 లక్షలతో లిఫ్ట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది త్వరలోనే అందుబాటులోకి రానున్నది. వీటితో పాటు వర్సిటీకి అనుబంధంగా ఉన్న వరంగల్, నల్లగొండ కేంద్రాల్లోనూ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న వర్సిటీ అనుబంధ కేంద్రానికి ఏండ్ల తరబడి ప్రహరీ, గేటు సౌకర్యం లేదు. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఆ నిర్మాణాలను ఇప్పటికే పూర్తి చేశారు.

టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో..
తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ స్థితిలోనూ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారు. వర్సిటీ పరిధిలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్నీ తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఈ సంస్థ ద్వారానే భవన నిర్మాణాలకు సంబంధించిన టెండర్లు పిలుస్తున్నారు. నిర్మాణాలకు సంబంధించిన నాణ్యత ప్రమాణాలు, టెండర్ల కేటాయింపు దీని పరిధిలో సాగుతుంది. ఈ విషయాల్లో వర్సిటీ అధికారుల ప్రమేయం ఏమాత్రం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకి కేటాయించిన నిధుల్లో ఇప్పటికే కొన్ని విడుదల చేసింది. అయితే త్వరలో యూనివర్సిటీకి న్యాక్ బృందం రానుంది. యూనివర్సిటీ సందర్శన అనంతరం న్యాక్ గ్రేడ్‌ను ఇవ్వనుంది. గ్రేడ్ ఇచ్చిన అనంతరం మరికొన్ని నిధులు విడుదలకానున్నాయి.


త్వరలోనే పనులు పూర్తి..
తెలుగు యూనివర్సిటీకి సంబంధించి బాయ్స్ హాస్టల్ భవనం, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, ఆడ్మినిస్ట్రేషన్ భవన్‌లను నిర్మిస్తున్నాం.. ఈ పనులన్నీ త్వరలో పూర్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం వల్లే ఈ పనులు చేపట్టగలిగాం. కేవలం యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలోనే కాకుండా ఇతర జిల్లాల్లో అనుబంధంగా ఉన్న కేంద్రాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే కొన్నినిధులు మంజూరయ్యాయి. తర్వలోనే మిగతా నిధులు విడుదలవుతాయి. యూనివర్సిటీలోని దివ్యాంగ విద్యార్థుల కోసం పై ఫ్లోర్‌లను చేరుకునేందుకు ప్రత్యేకంగా లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తున్నాం.
- ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ఉపకులపతి

630

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles