గుడుంబా కనుమరుగు.. జీవితాల్లో మరో వెలుగు!!


Fri,January 11, 2019 12:30 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గుడుంబా తయారీలో నిమగ్నమయ్యి చిత్తవుతున్న దూల్‌పూట వాసులకు జిల్లా యంత్రాంగం కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది. ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన పథకంతో వెలుగులు నింపుతోంది. ఈ పథకం అమలులో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఇక గుడుంబా జోలికెళ్లం.. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించండి అని అన్నటువంటి 947 మంది దూల్‌పేట వాసుల్లో 793 కుటుంబాలకు జిల్లా అధికారులు ఉపాధి కల్పించారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా వందకు వందశాతం సబ్సిడీతో మంజూరు చేస్తున్న పునరావాసం కల్పన క్రమంగా ముందుకుసాగుతోంది. మొత్తం 947 కుటుంబాలకు గాను పునరావాసం కల్పించేందుకు అధికారులు ప్రయత్నాలు సాగుతున్నాయి.793 యూనిట్ల గ్రౌండింగ్ కాగా, మిగతా యూనిట్లు గ్రౌండింగ్ దశలో ఉన్నాయి. మొత్తంగా రూ. 15. 86 కోట్లును పునరావాసంగా సాయంగా అందించారు.


గుడుంబాకు పుల్‌స్టాప్..
పట్టణ ప్రాంతమైన హైదరాబాద్ గుడుండాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ముఖ్యంగా దూల్‌పేట, మంగల్‌హాట్ ప్రాంతంలో గుడుంబా డెన్‌లుగా మారిపోయాయి. ఈ ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి గుడుంబా తయారీయే ప్రధాన వృత్తి. మహిళలు, చిన్నారులన్న తేడాల్లేకుండా కుటుంబమంతా ఈ వృత్తిలోనే కొనసాగుతుంది. పురుషులు గుడుంబాను సరఫరా చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కిన సందర్భాలెన్నో ఉన్నాయి. గుడుంబా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించేందుకు కోట్ల రూపాయలను పునరావాసం కోసం ప్రభుత్వం కేటాయించింది. ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించేందుకు ఈ నిధులును ఖర్చుచేస్తుంది. దీంతో గుడుంబా తయారీ వృత్తి నుంచి వి ముక్తి పొంది. ప్రత్యామ్నాయ ఉపాధిని తయారీదారులు వినియోగించుకుంటున్నారు.

నేరుగా ప్రభుత్వ సాయం
గుడుంబా పునరావాసం క్రింద ఒక్కోక్కరికి రూ. 2 లక్షలను సబ్సిడీగా లబ్దిదారులకు అందిస్తున్నారు. బ్యాంక్‌లతో సంబంధం లేకుండా.. నేరుగా ప్రభుత్వం నుంచే సాయాన్ని మంజూరు చేస్తున్నారు. ఇలా అందిస్తున్న మొత్తాన్ని డబ్బు, చెక్కు రూపంలో కాకుండా వస్తువుల రూపంలో అందిస్తున్నారు. ఇది వరకు కొటేషన్లు తీసుకురావడం, చెక్కులివ్వడం, బిల్లులు సమర్పించడం జరిగేది. కానిప్పుడు పునరావాసం క్రింద ఏ యూనిట్ ఎంచుకుంటే దానినే వస్తురూపంలోనే ఇస్తున్నారు. లబ్దిదారులకు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను అధికారులే దగ్గరుండి మరీ పరిష్కరించి యూనిట్ నడిచేందుకు చొరవ తీసుకుంటున్నారు. లబ్దిదారుల ఎంపిక నుంచి యూనిట్ల గ్రౌండింగ్ వరకు అంతా అధికారులే చూసుకుంటున్నారు.

చేతుల్లో పెట్టే వరకూ అధికారులదే బాధ్యత
ప్రభుత్వమందించే ఆర్థిక సాయ పథకాలంటే అధికారులు ఫైళ్లపై సంతకాలు పెట్టి మంజూరుచేసి చేతులు దులుపుకోవడం అలవాటుగా మారిన వ్యవహారం. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రభుత్వ అధికారులు లబ్దిదారులకు తిప్పలు తప్పిస్తున్నారు. స్వయంగా అధికారులే టెండర్లు ఆహ్వానించి, సరఫరాదారులను ఎంపికచేసి, వారి నుంచి యూనిట్లకు సంబంధించిన సరుకులు, వస్తువులను తెప్పించి, నేరుగా లబ్దిదారుల చేతుల్లో పెడుతున్నారు. ఇంతగా చొరవ తీసుకుని లబ్దిదారులకు అప్పగించడంలో అధికారుల చిత్తశుద్ధి, అంకిభావాన్ని ప్రశంసించాల్సిందే.

427

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles