జీవన సారం..పుస్తక రూపం

Sun,December 16, 2018 12:28 AM

-యువత పఠనాన్ని అలవర్చుకోవాలి
-గ్రామాల్లో గ్రంథాలయాలుఏర్పాటు చేయాలి
-జాతీయ పుస్తక ప్రదర్శనప్రారంభ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : 32వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన శనివారం సాయంత్రం తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పుస్తక పఠనంతో జన జీవనం మమేకమైందని, విద్యార్థులు, యువత పుస్తక పఠనాన్ని కాలక్షేపంగా కాకుండా నిరంతర పఠనాన్ని అలవర్చుకోవాలన్నారు. పల్లెల్లో గ్రంథాలయాలను నిర్మించాలన్నారు. సంగెం లక్ష్మీబాయి వేదికపై ప్రారంభ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల దివంగతులైన కపిలవాయి లింగమూర్తి ఆత్మకథను వెంకయ్య నాయుడు ఇదే వేదికపై ఆవిష్కరించి, మొదటి ప్రతిని శాస్త్రజ్ఞులు ఐవీ సుబ్బారావుకు అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ, వేదికపైనున్న వాళ్లంతా మట్టి మనుషులు.. పుస్తకం మలిచిన మనుషులని అన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గొప్ప వక్త అని కొనియాడారు. కార్యక్రమానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, విజయవాడ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ఎమెస్కో విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

-పుస్తక ప్రదర్శనలో 331 స్టాళ్లు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో 331 పుస్తకాల స్టాళ్లు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. అన్ని వయస్సుల వారిని అలరించేలా పుస్తకాలయాలు కొలువుతీరాయి. ఒకచోట చిన్నారులకు సంబంధించిన కథల పుస్తకాలు, డ్రాయింగ్స్, పెన్సిళ్లు, కలరింగ్ పుస్తకాల స్టాళ్లు ఉంటే, మరో చోట ఎంసెట్, ఎయిమ్స్ జీమ్యాట్, యూజీసీల పుస్తకాలు, ఇంకోచోట ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్స్ స్టాల్, ఇలా 331 పబ్లిషర్స్‌కు చెందిన పలు రకాల స్టాళ్లు పాఠకులను, వీక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ప్రారంభ వేడుకలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

చిన్నారుల కోసం అక్షరాభ్యాస్ వేదిక
చిన్నారుల కోసం ప్రత్యేకంగా అక్షరాభ్యాస్ పేరుతో 93వ స్టాల్ తల్లిదండ్రులను, చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. శిశు తరగతిలోనే గట్టి పునాది వేయాలని ఈ అక్షరాభ్యాస్ స్టాల్ ప్రధానోద్దేశం. మాతృభాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాషల్లో.. ఇంకా లెక్కల కోసం ఎక్కాలతో వేర్వేరుగా అక్షరాలతో పలక లాంటి పరికరం తయారు చేశారు. ఇది పాత కాలం నాటి పలక కంటే భిన్నంగా ఉంటుంది. అభ్యాసంతో మరింత పరిపూర్ణత వస్తుందనే విషయం తెలిసిందే. దీని ద్వారా చేతికి వేగంగా, చక్కగా రాయడం అలవడుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఎక్కాలు (టేబుల్స్)లను సునాయాసంగా ఈ కిట్ ద్వారా నేర్చుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.

తోపుడు బండి..
విద్యానగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు సాధిక్ ఈ స్టాల్ నిర్వాహకులు. ప్రజల్లో పఠనాసక్తి పెంచాలనే ప్రధాన ఉద్దేశంతో తోపుడుబండిపై పుస్తకాలను పెట్టుకొని తెలంగాణలో ఐదేండ్లుగా ఊరూరా తిరుగుతూ ఉచితంగా పంపిణీ చేశారు. పల్లెల్లో 150 గ్రంథాలయాలను నిర్మించారు. రూ.50 లక్షల విలువైన పుస్తకాలను పంచిపెట్టినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం, తోపుడు బండి స్టాల్ పేరిట పలు రకాల పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు.
మంచి పుస్తకం
తార్నాక నుంచి వచ్చిన మంచి పుస్తకం (ట్రస్ట్) పేరిట 84, 85వ నంబర్లలో వెలసిన స్టాళ్లు పిల్లలు, పెద్దల పుస్తకాలకు పేరెన్నికగన్నవి. పిల్లలు హాయిగా తెలుగులో చదువుకోవాలని మంచి పుస్తకం పేరిట దీన్ని స్థాపించినట్టు కో- ఆర్డినేటర్ భాగ్యలక్ష్మి తెలిపారు. పిల్లలు చిత్రాలు చూసి కథలను తెలుసుకొనే విధంగా పుస్తకాలు, శతకాలు, కలరింగ్ బుక్స్, కథల కార్డ్సు, కథా కదంబం, ఎలా తెలుసుకున్నాం? అనే అనువాద పుస్తకాన్ని శ్రీనివాస చక్రవర్తి 32 పుస్తకాలుగా రాశారు. ఇంకా కథలతో పాటు కలరింగ్ చేసుకొనే పుస్తకాలు అనేకం ఇక్కడ లభ్యమవుతున్నాయి.


ఆకట్టుకున్న కళా ప్రదర్శన
రవీంద్రభారతి : ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జాతీయ పుస్తక ప్రదర్శనలో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం సంగెం లక్ష్మీబాయి వేదిక పై ఒగ్గు డోలు కళారూపాన్ని ప్రదర్శించారు. ఉస్తాద్ ఒగ్గురవి సారథ్యంలో జనగామకు చెందిన సి.హెచ్.కరుణాకర్ బృందం ప్రదర్శించిన కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఆక్స్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థినుల ఘూమర్ డ్యాన్స్ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటింది.
కార్యక్రమాల వివరాలు..
ఆదివారంసాయంత్రం : ఫిలీం గజల్
22న సాయంత్రం : కొమ్ముకోయ నృత్యం.
23న సాయంత్రం : పేరిణి నాట్యప్రదర్శన

మేధస్సును పెంచేది పుస్తకమే
తెలుగు యూనివర్సిటీ: పాఠశాల స్థాయిలోనే చందమామ, బాలమిత్రలాంటి పిల్లల కథలు, పేదరాసి పెద్దమ్మ, పంచతంత్ర లాంటి విలువైన పుస్తకాలను చదివాను. కొంచెం ఎదిగిన తర్వాత శ్రీశ్రీ సాహిత్యం, గోపిచంద్, బుచ్చిబాబు, రంగనాయకమ్మ నవలలు, అనంతర కాలంలో ఉద్యమ సాహిత్యం, మార్క్స్, కమ్యూనిస్టు ప్రణాళిక, మాగ్జిమ్‌మోర్కీ అమ్మ వంటివి నన్ను ప్రభావితం చేశాయి. నేను పాత్రికేయ ప్రపంచంలో నిలబడటానికి, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడానికి నేను చదివిన పుస్తకాలే దోహదపడ్డాయి. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే పుస్తకానికి మించిన మార్గం లేదు. అనేక ఆలోచనలు, భావాలు, తాత్వికతల సమాహారమే పుస్తకం. స్మార్ట్ ఫోన్‌ల యుగంలో యువత పుస్తకాన్ని మరచిపోతున్నది. విజ్ఞానం యంత్రాల్లో ఉంటుందనుకుంటున్నారు.

ఎంత సాంకేతికంగా అభివృద్ధి అయిన యంత్రాలు వచ్చినా చిరస్థాయిగా నిలిచేది, మేధస్సును పెంచేది అంతిమంగా పుస్తకమే. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ పుస్తక ప్రదర్శన పుస్తక మహోత్సవంలాగా జరుగుతున్నది. డిజిటల్ యుగం అయినప్పటికి సోషల్ మీడియా విపరీతంగా వ్యాప్తిలోకి వచ్చినప్పటికి పుస్తకం ఇప్పటికీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ముఖ్యమైన సాధనం. ఈ జ్ఞాన దృష్టిని పెంచడానికి హైదరాబాద్ పుస్తక మహోత్సవం దోహదపడుతున్నది. మాగ్జిమ్‌మోర్కీ అమ్మ నుంచి మొదలు అల్లం రాజయ్య నవలల దాక కాల్పనిక సాహిత్యం, శ్రీశ్రీ నుంచి శివసాగర్ వరకు కవిత్వం, గద్దర్, గోరటి వెంకన్న పాటలు నన్ను ప్రభావితం చేశాయి. సమాజం మారాలన్నా, మంచి స్థితి రావాలన్నా జ్ఞాన మూలం పుస్తకం. పుస్తకమే వర్థిల్లాలి, జ్ఞానం గెలవాలని కోరుతున్నాను. పుస్తకం జీవితాలను తేజోవంతం చేస్తుంది. యువత విలువైన పుస్తకాలను కొనుక్కోవడం మంచిది.
-అల్లం నారాయణ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్

పఠనంతో పరిపూర్ణ వ్యక్తిత్వం
తెలుగు యూనివర్సిటీ: నిజాం కాలంలో ప్రాథమిక విద్య దశలోనే పుస్తక పఠనంపై ఆసక్తి ఉండేది. పుస్తకాలను కొనుగోలు చేసి చదివే ఆర్థిక స్థోమత లేక, అడుక్కొని చదివి వారికి తిరిగి ఇచ్చేవాడిని. 1950లో రజాకార్ల సమయంలో పుస్తకాలు చదవడం కోసం అనేక కష్టాలు పడ్డాం. 1954లో వెల్లంకి గ్రామంలో అందరం కలిసి ఒక చిన్న గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో 60 వేల పుస్తకాలను సేకరించి కూరెళ్ల గ్రంథాలయంలో పరిశోధకులకు అందుబాటులో ఉంచాం. గ్రామీణ వాసులతో పాటు పట్టణ వాసులు ప్రస్తుతం చౌటుప్పల్ సమీపంలో గల కూరెళ్ల గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదువుకుంటారు. ఇంట్లో ఉండి చదువుకొని పీహెచ్‌డీ పూర్తి చేశాను. నేత్ర సంబంధిత వ్యాధితో చూపు కోల్పోయాను. ఇప్పుడు ఎవరితోనైనా పుస్తకాలు చదివించుకొంటాను. పుస్తక పఠనం పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన మనిషిగా తయారు చేస్తుంది. మాలెపల్లి నవల, ఆంధ్రప్రభ, గోలకొండ పత్రికలలో వచ్చిన వ్యాసాలను చదివేవాడిని. పుస్తకమున్న హస్తమున పుత్తడి కంకణం ఉండినట్టునే, పుస్తకమున్న నేస్తమున పూర్ణగుణంబులుండినట్లే, పుస్తకమే మనసుకు పూర్ణతమిచ్చును విఠలాశ్వేరా అంటూ పుస్తకం గొప్పతనాన్ని వివరించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తిని ఇచ్చింది పుస్తకాలే. మానసిక, శారీరక ఆరోగ్యం పుస్తక పఠనం వల్ల కలుగుతుంది. పుస్తకం ఇంట్లో ఉంటే గొప్ప విజ్ఞానభాండాగారం ఉన్నట్లే. యువత పుస్తక పఠనం అలవర్చుకోవాలి.
-ఆచార్య కూరెళ్ల విఠలాచార్య, గ్రామీణ గ్రంథాలయాల నిర్మాత

పఠనంతో సృజనాత్మకత
తెలుగుయూనివర్సిటీ: ఉన్నత పాఠశాల స్థాయిలోనే కథలు, నవలలు, వ్యాసాలు ఆసక్తిగా చదివాను. నల్గొండ ఉన్నత పాఠశాలలో అప్పుడే గ్రంథాలయం ఏర్పాటు చేశారు. విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, శరత్‌చంద్ర పుస్తకాలతో పాటు అనువాద గ్రంథాలను చదవడంతో కొత్త ఆలోచన శక్తి పెరిగింది. సాహిత్య గ్రంథాలను చదివితే రచనాశైలి అలవడుతది. గోలకొండ పత్రికలో వచ్చిన వ్యాసాలను ఆసక్తిగా లోతుగా చదువుతూ కొత్త విషయాలను తెలుసుకునేవాళ్లం. మను వసుచరిత్ర తులనాత్మక పరిశీలన, శ్రీనాథుని సౌందర్యం, అభ్యసన దృష్టి వంటి గొప్ప పుస్తకాలతో పాటు పలు కథలు, నవలలు చదివాను. పలు పత్రికలకు సంపాదకత్వం వహించాను. సంస్కృత సాహిత్య చరిత్ర గ్రంథం 900 పేజీలలో భర్త గోపాలరెడ్డితో కలిసి రచించాం. పుస్తకాలను ఎక్కువ సార్లు చదివితేనే విజ్ఞానం వస్తుంది. చదువుకు మించిన జ్ఞానం మరొకటి లేదు. అనేక పుస్తకాలు వస్తున్నాయి కానీ వాటిని కొని చదివే యువత సంఖ్య తగ్గుతున్నది. చదివి విజ్ఞానం సంపాదించే యువత రావాలి. ఆధునిక విద్యతో పాటు ప్రాచీన విద్యను అభ్యసించాలి. పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం మంచిదే కానీ యువత పుస్తకాలను ఎక్కువగా కొనుగోలు చేసి చదవడం మంచిది.
-ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి

1006

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles