వృద్ధాప్యంలోనూ చలాకీగా ఉండొచ్చు

Sun,December 16, 2018 12:19 AM

-ముసలితనంలో ఎదురయ్యే సమస్యలకు చెక్
-మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్
-ట్రాన్సేషనల్ కేర్‌లకు పెరుగుతున్న డిమాండ్
మాదాపూర్ : మనిషి వయసు మీద పడిన కొద్దీ తన ఒంట్లో శక్తి అంతకంతకు తగ్గిపోతున్నది. దానితోపాటు శారీరకంగా, మానసికంగా కృషించి పోతుంటారు. వృద్ధాప్యంలో కూడా ఉల్లాసంగా, ఆరోగ్య పరంగా వచ్చే సమస్యలను అధిగమించేందుకు కేడబ్ల్యూ కాన్ఫరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్ముక్ ఫెస్టివల్ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమం సీనియర్ సిటిజన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో కొలువుదీరిన కార్యక్రమంలో వృద్ధులు ఆనందంగా, ఉల్లాసంగా గడిపేందుకు వివిధ రకాల ఉత్పత్తులు, గేమ్‌షోలను నిర్వహించారు. వృద్ధులకు విరమణ అనేది కేవలం మెదడుకు సంబంధించినదని ఉత్సాహం, పట్టుదలతో శారీరకంగా ఎదుర్కోవలసిన సమస్యలను ఇట్టే అధిగమించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. మన ఇండియాలో 60ఏండ్లు రాగానే ముసలివాళ్లుగా పరిగణిస్తారని, విదేశాల్లో 80 ఏండ్లు దాటితే గానీ ముసలి వారిగా పరిగణించరని అంటున్నారు. 2040 సంవత్సరం నాటికి వృద్ధుల సంఖ్య మరింత పెరుగుతుందని, వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించేందుకు కృషి చేస్తామని పేర్కొంటున్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 60 స్టాల్స్‌లో మానసిక, ఆరోగ్య పరంగా ఒత్తిడికి గురికాకుండా వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు అనేక రకాలైన వస్తు, ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. నూతన టెక్నాలజీతో కూడిన ఆన్‌లైన్ సేఫ్టీ గైడ్ వర్క్‌షాప్, లైవ్ ఎవర్ గ్రీన్ పేరిట ఆరోగ్యాన్ని పెంపొందించే ఉత్పత్తులు, వీల్‌చైర్స్, బ్యాటరీతో నడిచే మొబిలిటీ స్కూటర్స్, కండ్లు సరిగా కనబడని వారి కోసం భూతద్దం అమర్చి తయారు చేసిన నెయిల్ కట్టర్స్, వృద్ధాప్యంలో టెక్నాలజీపై అవగాహన పెంచుకునేందుకు ఎమ్ పవర్ పేరిట సరికొత్త యాప్‌లతోపాటు వాకింగ్ స్టిక్స్, నెక్ ప్యాడ్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వంటి వస్తువులను ఉంచారు. వీటిని సందర్శించేందుకు నగర నలుమూలల నుంచి సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి దాదాపు 8వేలకు పైగా సీనియర్ సిటిజన్స్ విచ్చేయనున్నట్లు నిర్వాహకులు అంచన వేస్తున్నారు.

435

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles