బీఆర్‌ఎస్‌లో కదలిక

Sun,December 16, 2018 12:17 AM

-ఏజీని కలిసిన బల్దియా అధికారులు
-త్వరలో చిక్కుముడులు వీడే అవకాశం
-ఉపగ్రహ పరిజ్ఞానంతో అక్రమ నిర్మాణాలపై నిఘా
సిటీబ్యూరో: ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న అక్రమ భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీఆర్‌ఎస్)లో కదలిక వచ్చింది. కోర్టులో నానుతున్న ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు నడుంబిగించారు. అడ్వకేట్ జనరల్‌తో వారు సమావేశమై కేసు పురోగతిని వివరించారు. అధికారుల ప్రయత్నాలు ఫలప్రదమైతే కోర్టు కేసు రూపంలో ఉన్న చిక్కుముడులు వీడిపోయే అవకాశమున్నది. కేసు పరిష్కారమైతే లక్షకుపైగా ఉన్న దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరడమే కాకుండా బల్దియాకు ఆర్థికంగా ఊరట లభించే అవకాశమున్నది.

రూ. 1000 కోట్లు..
అక్రమ భవనాలు, లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 2015 చివర్లో బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో బీఆర్‌ఎస్‌కు సుమారు 1.39లక్షల దరఖాస్తులొచ్చాయి. పథకానికి వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కావడంతో కోర్టు స్టే విధించింది. అనంతరం బీఆర్‌ఎస్ దరఖాస్తులు పరిశీలించి అందులో క్రమబద్ధీకరణకు అర్హతలేని భవనాలపై చర్యలు తీసుకోవాలని దాదాపు ఏడాది కిందటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బల్దియాలో సిబ్బంది కొరత ఉన్నారంటూ ఇంతవరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బీఆఎస్‌ఎస్‌పై దాఖలైన కేసు పరిష్కారమయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ అధికారులు అడ్వకేట్ జనరల్‌తో సమావేశమయ్యారు. ఎన్నికల హడావుడి పూర్తయినందున దీర్ఘకాల పెండింగ్ అంశాలపై దృష్టి కేంద్రీకరించిన జీహెచ్‌ఎంసీ, బీఆర్‌ఎస్ పథకాన్ని ప్రథమ ప్రాధాన్యతకింద చేపట్టింది. వీటి దరఖాస్తులు పరిష్కరిస్తే దాదాపు రూ. 1000కోట్లకుపైగా ఆదాయం సమకూరే వీలుంది. ఎన్నికల కారణంగా గడచిన మూడు నెలలుగా పన్నులు వసూలు కాలేదు. కోట్లాది రూపాయల అభివృద్ధి పథకాలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తిచేయడంతో పాటు సిబ్బంది వేతనాలు, నిర్వహణ ఖర్చుల కోసం ఆస్తిపన్ను, నిర్మాణాల అనుమతి పన్నులతోపాటు బీఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం అవశ్యకంగా మారింది. తొందరలోనే దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

290

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles