దటీజ్ కేటీఆర్..

Sat,December 15, 2018 01:12 AM

-టీఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగాతీర్చిదిద్దిన రాముడు
-నగరంలో కారు బలం వెనుకఅజేయశక్తి యువనేతే..
-కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణపై గులాబీ శ్రేణుల హర్షం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ రాజకీయాలపై కల్వకుంట్ల తారక రామారావుది చెరగని ముద్ర..! ఎన్నికలు ఏదైనా ఆయన మ్యాజిక్ ఫలించాల్సిందే..! తారక మంత్రం పారాల్సిందే..! ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ యువనేతగా ముందుకు కదలడం.. నగర పార్టీ కార్యకలాపాల్లో అన్నీ తానై వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుపోతూ క్యాడర్‌లో ధైర్యం నూరిపోయడం.. నేనున్నానంటూ ప్రజలకు భరోసా ఇవ్వడం, గ్రేటర్‌లో తలపండిన రాజకీయ నేతలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు కలిగిన నేతగా ఆయన గుర్తింపు సాధించారు. మోడ్రన్ లీడర్‌గా పేరు తెచ్చుకుని కేటీఆర్ తన వాగ్ధాటితో అనతికాలంలోనే విశ్వనగర విజన్ నేతగా అన్ని వర్గాలను ఆకర్షించారు.

అంతేకాదు పార్టీని కానీ, తనను కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే తనదైన శైలిలో పంచ్‌లు వేసి దిమ్మ తిరిగేలా చేస్తారు. చమత్కారాలతో నవ్వులు పూయిస్తారు. సాటి మనిషికి సాయపడి ఎందరి హృదయాల్లో ముద్ర వేసుకున్నారు. మోడ్రన్ లీడరే కాదు పురపాలక శాఖ మంత్రిగా అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించి అభివృద్ధిలోనూ తనదైన మార్కును ప్రదర్శించారు. ప్రాంతాలను, పరిస్థితులకు తగ్గట్టుగా అందరినీ ఆకట్టుకుంటారు. ఇవన్నీ కలగలుపుతూ ఒంటిచేత్తో అటు గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 99 స్థానాలు, ఇటు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 24 నియోజకవర్గాలకు గానూ 14స్థానాల్లో విజయదుందుభి మోగించడంలో అన్నీ తానై నడిపించిన యువనేతగా కేటీఆర్ కింగ్‌మేకర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ శక్తి, సామర్థ్యాలను గుర్తించిన సీఎం కేసీఆర్ తనయుడికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు.

విజయ రాముడు ..
తారకరాముడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం తథ్యం.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తనకిచ్చిన బాధ్యతను భుజాలపై వేసుకొని గ్రేటర్ టీఆర్‌ఎస్ పార్టీని అనతికాలంలోనే బలమైన శక్తిగా మార్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో చాలా డివిజన్లలో సంస్థాగతంగా బలపర్చుతూ దాదాపు 120 డివిజన్లలో 135చోట్ల ప్రసంగాలతో గ్రేటర్ హైదరాబాద్‌ను 360 డిగ్రీల కోణంలో కేటీఆర్ చుట్టుముట్టి వచ్చారు. విశ్వనగర సాధనకు తామేమి చేస్తామో కేటీఆర్ ప్రతి చోట వివరిస్తూ సాగారు. 99చోట్ల జయకేతనం ఎగురవేసి సొంతంగా మేయర్ స్థానాన్ని దక్కించుకోవడంలో ముఖ్యపాత్ర పొషించారు. వెనువెంటనే రెండేండ్లలోనే పురపాలక శాఖ మంత్రి హైదరాబాద్ విశ్వనగర అభివృద్ధిలో ప్రగతిని సాధించారు. ఈ అభివృద్ధికి ఆకర్షితులైన టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంలో కేటీఆర్ రోల్ అద్భుతమని రాజకీయ విశ్లేషకులు, పార్టీ శ్రేణులు కొనియాడారు. ఇదే తరహా శాసనసభ ఎన్నికల్లోనూ కేటీఆర్ సుడిగాలి ప్రచారం నిర్వహించారు.

పొలిటికల్ టూరిస్టులను ఒక్కటంటే ఒక్కడిగా కేటీఆర్ సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచి గెలిచారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యూహాలను అక్షరాల పాటించారు. కార్పొరేషన్ ఫలితాల స్ఫూర్తిగా మెజారిటీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేశారు. మన హైదరాబాద్-మనందరి హైదరాబాద్ ఆత్మీయ సమావేశాలతో అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టారు. మినీ ఇండియా లాంటి నగరంలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజల బాధ్యత నాదేనని, సోదరుడిగా, అన్నగా, మీలో ఒక్కరిగా, కేసీఆర్ కుమారుడిగా అండగా ఉంటానంటూ ప్రజలందరిలో భరోసా నింపుతూ అడుగులు వేశారు. పార్టీ అసంతృప్తులను ఒక్కతాటిపైకి తీసుకురావడమే కాదు రోడ్‌షోలతో అభ్యర్థుల గెలుపును సునాయసం చేసి చూపించారు. 14స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో ముఖ్యభూమిక పోషించారు. కేటీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను గుర్తించిన కేసీఆర్ రాబోయే రోజుల్లో పార్టీని సమర్థవంతంగా క్రమశిక్షణతో నడిపిస్తారన్న నమ్మకం కుదరడంతో ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు.

కేటీఆర్ నియామకం గొప్ప నిర్ణయం
కేటీఆర్‌ను టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం గొప్ప నిర్ణయం. మంత్రిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల ముందుకు తానేమిటో నిరూపించుకున్నారు. అతి చిన్న వయస్సులో పార్టీ బాధ్యతలు తీసుకుని వర్తమాన రాజకీయాల్లో యువనేతగా ఆదర్శంగా నిలిచారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. మంత్రిగా పరిశ్రమలు, ఐటీ, పంచాయతీ శాఖలకే వన్నె తీసుకొచ్చారు. రాష్ర్టానికి గొప్ప పారిశ్రామిక విధానం రూపొందించడంలో కేటీఆర్‌ది కీలక పాత్ర. కేటీఆర్ శక్తి సామర్థ్యాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రపంచ దేశాల ప్రముఖుల మొదలు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు మెచ్చుకొని ప్రశంసలు కురిపించారు. యువ కెరటం కేటీఆర్‌కు అప్పగించడం రాజకీయాల్లో యువతరానికి నాంది. తాజా ఎన్నికల్లో ఫలితాలే ఆయన సమర్ధతను తెలియజేస్తున్నాను. ఆయన నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తారు. ఈ నిర్ణయం చాలా సంతోషించదగింది. అని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు డాక్టర్ రాజసుమన్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన విభాగం సీనియర్ నాయకుడు పాటిమీది జగన్మోహన్ రావు తదితరులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

601

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles