నగరంపై కేటీఆర్ తనదైన ముద్ర

Sat,December 15, 2018 01:08 AM

-సమగ్రాభివృద్ధికి చర్యలు
-తరచూ సమీక్షలతో పకడ్బందీ పర్యవేక్షణ
-సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజా సమస్యలపై తక్షణ స్పందన
-అధికారులను పరుగులు పెట్టించిన యువనేత
హైదరాబాద్ నగరంలో న భూతే న భవిష్యతి అనే చందంగా అభివృద్ధి పథకాలు చేపట్టి అనతికాలంలోనే పురపాలకశాఖ మంత్రిగా నగరంపై తనదైన ముద్ర వేసుకున్న ఘనత కేటీ రామారావుకే దక్కింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నుంచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే నగర సమగ్రాభివృద్ధికి కృషి చేశారు. ప్రజా సమస్యలకు పెద్దపీట వేస్తూ సామాజిక మాధ్యమాలే వేదికగా అధికారులను పరుగులు పెట్టిస్తూ పని చేయించారు. కుల-మత, ధనిక-పేద, చిన్నా-పెద్దా, ఆడ-మగ, భాషా-ప్రాంతం అనే భేదాభిప్రాయాలు లేకుండా అన్ని వర్గాలచే శభాష్ అనిపించుకున్నారు. శుక్రవారం కేటీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా నగరానికి ఆయన చేసిన సేవలపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.

- సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్‌ఎస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టే నాటికి నగరంలో గుంతల రోడ్లు, ముంపు, ట్రాఫిక్ తదితర సమస్యలు ప్రధానమైనవి. వీటితోపాటు పేదలకు గృహాలు, మార్కెట్లు, ఫంక్షన్‌హాళ్ల కొరత, చెరువుల కాలుష్యం, కబ్జాలు, బస్ షెల్టర్లు తదితర అంశాలు కూడా ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం దాదాపు ఏడాదిపాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వహించిన సీఎం కేసీఆర్ పట్టణాభివృద్ధి రంగ నిపుణులతో పలు దఫాలు చర్చించి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు రూపొందించారు. అంతేకాదు, అప్పటి మున్సిపల్ కమిషనర్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో పక్కా ప్రణాళికతో వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ పురపాలకశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అభివృద్ధి పథకాలు పరుగులుపెట్టాయి. గతంలో కనీవినీ ఎరుగని విధంగా నగరంలో దాదాపు 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో కొన్ని ఇప్పటికే వివిధ దశల్లో ఉండగా, అనేక పథకాలు టెండర్ల దశలో ఉన్నాయి.

ఎస్‌ఆర్‌డీపీపై ప్రధాన దృష్టి...
ట్రాఫిక్ శాశ్వత పరిష్కారమే లక్ష్యంతో నగరంలోని ప్రధాన రోడ్లను సిగ్నల్ ఫ్రీ రోడ్లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో దాదాపు రూ. 23 వేల కోట్ల అంచనాలతో చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్లాన్(ఎస్‌ఆర్‌డీపీ) పనులను కేటీఆర్ పరుగులు పెట్టించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నాలుగు ప్యాకేజీల్లో నగర వ్యాప్తంగా చేపట్టిన స్కైవేలు, మేజర్ కారిడార్లు, మేజర్ రోడ్లు, గ్రేడ్ సెపరేటర్లు/ ైఫ్లెఓవర్లు తదితర ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఉన్నతాధికారులే కాకుండా క్షేత్రస్థాయి అధికారులతోనూ మాట్లాడుతూ పనుల పురోగతిలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేశారు. ఫలితంగా నిర్ధారిత గడువుకన్నా ముందే ఎస్‌ఆర్‌డీపీలోని పలు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. పూర్తయిన వాటిలో అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాలైన వెస్ట్‌జోన్‌లో అయ్యప్ప సొసైటీ, మైండ్‌స్పేస్ జంక్షన్, ఎల్బీనగర్‌లో చింతలకుంట తదితర ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, అలాగే, కామినేని జంక్షన్, మైండ్‌స్పేస్ జంక్షన్‌లలో రెండు ైఫ్లెఓవర్లు ఉన్నాయి.

రూ.721 కోట్లతో రోడ్ల అభివృద్ధి..
రోడ్డుపై గుంత కనపడకుండా చేయాలనే సంకల్పంతో అధికారులు అడిగినన్ని నిధులు మంజూరు చేశారు. ప్రధాన రోడ్ల కోసం ప్రత్యేకంగా మేజర్ రోడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా జీహెచ్‌ఎంసీతోపాటు రోడ్ల అభివృద్ధి సంస్థకు ఏకంగా రూ. 721కోట్లు మంజూరు చేశారు. అంతేకాదు, రోడ్ల ఏర్పాటులో మూస పద్ధతులకు స్వస్తి పలికి నూతన విధానాలను చేపట్టారు. నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ అవసరాలకు అనుగుణంగా వైట్ ట్యాపింగ్, ప్లాస్టిక్ రోడ్లు, రబ్బర్ రోడ్లు, పేవర్ బ్లాక్స్ తదితర కొత్తకొత్త రోడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. రోడ్ల మరమ్మతుకు వార్డుల వారీగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి గుంతలు మరమ్మతులు చేసే విధంగా తగిన ప్రణాళికలను అమలు చేశారు. పాదచారుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్లతో సరిసమానంగా ఫుట్‌పాత్‌ల ఏర్పాటును ప్రోత్సహించారు. ఫలితంగా నగరంలోని ప్రధాన రోడ్ల రూపురేఖలు మారిపోయాయి.

లక్షణంగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు...
కేటీఆర్ ప్రత్యేక చొరవతో నగరంలోని పేదల కోసం మొదటి దశలో ఒక లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మించాలనే లక్ష్యంతో సుమారు రూ. 8.5 వేల కోట్లతో 109 ప్రాంతాల్లో ఇండ్ల కాలనీలకు శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మురికివాడల్లో నివసించే పేదలను డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు ఒప్పుకునేలా ఎంతగానో కృషిచేశారు. ఫలితంగా దాదాపు 40చోట్ల మురికివాడల్లో డబుల్ బెడ్‌రూమ్ కాలనీలు ఏర్పాటయ్యే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వాలు మురికివాడల నిర్మూలనలో భాగంగా చేపట్టిన రాజీవ్ ఆవాస్ యోజన పథకం కేవలం శంకుస్థాపనకే పరిమితం కాగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, ముఖ్యంగా కేటీఆర్ దిశానిర్దేశాల ప్రకారం పనులను విజయవంతంగా నిర్వహిస్తూ నాచారం సహా పలు ప్రాంతాల్లో కాలనీల నిర్మాణం పూర్తిచేశారు. ఒక్కో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఆయా ప్రాంతాలను బట్టి సుమారు రూ.25 నుంచి రూ.35లక్షల వరకు విలువ చేస్తాయంటే పేదల జీవితాల్లో ఏ మేరకు మార్పు వస్తుందో ఊహించుకోవచ్చు.

రూ.287 కోట్లతో చెరువుల అభివృద్ధి..
చెరువులను అభివృద్ధి చేయాలని సంకల్పించిన కేటీఆర్ అధికారులకు తగు దిశానిర్దేశం చేశారు. నిపుణులతో చర్చించి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కబ్జాలను అరికట్టి, కాలుష్యం లేకుండా చేయడంతోపాటు ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు రూ.287 కోట్లతో చెరువుల సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మదీనగూడ పటేల్ చెరువు రూ.12.20కోట్లు, కూకట్‌పల్లి అంబర్ చెరువు రూ.25.34, హస్మత్‌పేట్ బోయిన్ చెరువు రూ.14.45, ఉప్పరపల్లి మల్కచెరువు రూ.4.70, నెక్నాపూర్ పెద్దచెరువు రూ.21.62, గంగారం పెద్దచెరువు రూ.19.05, చెర్లపల్లి చెరువు రూ.12.28, ఆర్కేపురం ముక్కుడి చెరువు రూ.11.82, కాప్రా ఊరచెరువు రూ.9.41, మన్సూరాబాద్ పెద్దచెరువు రూ.7.39, అంబర్‌పేట మోహిని చెరువు రూ.10.07, ఉప్పల్ నల్లచెరువు రూ.7.85, జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ రూ.42.22 తదితర చెరువుల అభివృద్ధి పనులు ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయి.

మార్కెట్లు, ఫంక్షన్‌హాళ్లు, నాలాలు..
కనీసం ప్రతి పది వేల మంది జనాభాకు ఒక మార్కెట్ ఉండాలన్న ముఖ్యమంత్రి సూచనల ప్రకారం జీహెచ్‌ఎంసీ అధికారులు మొదటి దశలో 40 ప్రాంతాల్లో చేపట్టిన మోడల్ మార్కెట్ల నిర్మాణాలను మంత్రి కేటీఆర్ సకాలంలో పూర్తి చేసేలా కృషిచేశారు. ప్రస్తుతం వీటి నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. అలాగే, ఫంక్షన్‌హాళ్ల ఖర్చును భరించే స్థితిలోలేని నిరుపేదలు రోడ్లపై షామియానాలు వేసుకొని ఫంక్షన్లు చేసుకోకుండా వారు కూడా గౌరవంగా వేడుకలు నిర్వహించుకునేందుకు బహుళ ప్రయోజనకర ఫంక్షన్‌హాళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. బన్సీలాల్‌పేట్, మారేడ్‌పల్లి సహా పలుచోట్ల ఇప్పటికే వీటి నిర్మాణం పూర్తయింది. నామమాత్ర అద్దెపై వీటిల్లో వేడుకలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ముంపు సమస్య నివారించేందుకు నాలాల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నారు. నగరంలో సుమారు వెయ్యికిపైగా మోడ్రన్ బస్‌షెల్టర్ల నిర్మాణం చేపట్టారు.

మన నగరంతో ప్రజలకు దగ్గరగా...
క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వాటిని తక్షణమే పరిష్కరించే లక్ష్యంతో కేటీఆర్ మన నగరం పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నగరవాసుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. జోన్లవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి కాలనీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, బస్తీవాసులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. చాలావరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అంతటితో ఆగకుండా ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సామాన్యులు పంపే విజ్ఞప్తులు, ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. ముఖ్యంగా మన నగరం కార్యక్రమం నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.

టీ-హబ్, వీ-హబ్, పోలీస్ టవర్స్...
ఏదైనా సంస్థలు స్థాపించాలనే ఉత్సాహం ఉన్న వారికి కేటీఆర్ ప్రత్యేక చొరవతో టీ-హబ్ రూపంలో ఓ వేదికను ఏర్పాటు చేశారు. దీని ద్వారా అనేక అంకుర సంస్థలు ఏర్పాటయ్యాయి. వివిధ సంస్థలు పరస్పర భాగస్వామ్యం కోసం ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా తయారైంది. అలాగే, మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకోసం వీ-హబ్ పేరుతో ఏర్పాటు చేసిన వేదిక సైతం వారికి ఎంతగానో ప్రయోజనకారిగా మారింది. మహిళలు సొంతంగా తమ కాళ్లపై తాము ఎదగడమే కాకుండా పలువురికి ఆదర్శంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతున్నది. ఇక నగరంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో బంజారాహిల్స్‌లో పోలీస్ ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టారు. నగరంలో చీమచిటుక్కుమన్నా వెంటనే పోలీసుకు సమాచారం అందేలా అత్యాధునిక కంట్రోల్ రూమ్‌ను ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో శాంతిభద్రతల విషయంలో నగర ఖ్యాతి మరింత ఇనుమడించనున్నదని చెప్పవచ్చు.

385

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles