పంచాయతీకి మేడ్చల్ సిద్ధం

Fri,December 14, 2018 12:44 AM

-రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గ్రామాల వారీగా ఓటరు
-జాబితాను సిద్ధం చేసిన జిల్లా పంచాయతీ అధికారులు
-జిల్లాలో కొనసాగుతున్న బీసీ ఓటర్ల గణన
-15వ తేదీన తుది జాబితా విడుదల
-ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
-అధికారుల సమావేశంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పంచాయతీ ఎన్నికలకు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి పర్యవేక్షణలో జిల్లా పరిధిలోని 61 గ్రామాలకు సంబంధించిన ఓటరు జాబితాను సిద్ధం చేశారు. ప్రభుత్వం గత మే, జూన్ నెలల్లోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలకు బ్రేక్ పడింది. కానీ 2019 జనవరిలోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని, త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,26,811 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 65,987, స్త్రీలు 60,812 మంది ఉన్నారని, అలాగే మరో 12 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారని జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో మొత్తం 596 వార్డులుండగా, వీటి పరిధిలో 596 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..
పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికలపై జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన ఆయన ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా సవరణలు చేయాలన్నారు. ఓటరు జాబితా సవరణ బాధ్యతను ఎంపీడీవోలు తీసుకోవాలని, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను ఓటరు జాబితాలో గుర్తించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే బీసీ ఓటర్ల గణన పూర్తైందని, ఈ నెల 9వ తేదీన ముసాయిదా బీసీ ఓటర్ల జాబితాను విడుదల చేసి వాటిపై వచ్చిన అభ్యంతరాలను 12వ తేదీ వరకు పరిష్కరించామని, 13, 14 తేదీల్లో గ్రామ సభలను నిర్వహించి, 15వ తేదీన తుది జాబితాను విడుదల చేయడం జరుగుతుందని, సాధ్యమైనంత త్వరగా సిబ్బందిని సమకూర్చుకోవడంతోపాటు ఎన్నికల నిర్వహణకు కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సామగ్రి, స్ట్రాంగ్‌రూంలను సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్ల రూట్‌మ్యాప్, మౌలిక వసతుల కల్పన, రవాణా వసతి, భద్రతా ఏర్పాట్లపై శ్రద్ధ వహించాలన్నారు. అలాగే జిల్లాలో హరితహారం, శానిటేషన్, అక్రమ కట్టడాలు, లేఅవుట్లపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుకర్‌రెడ్డి, డీపీవో రవికుమార్, డీఈవో విజయలక్ష్మి, డీఆర్‌డీఓ కౌటిల్య, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

441

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles