పాత్రధారి గాంధీ.. సూత్రధారి పోచంపల్లి..

Fri,December 14, 2018 12:44 AM

చందానగర్, నమస్తే తెలంగాణ : శేరిలింగంపల్లిలో రెండోసారి అరెకపూడి గాంధీ భారీ మెజారిటీతో గెలుపొందడంలో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, శేరిలింగంపల్లి ఇన్‌చార్జి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. తనకు అత్యంత సన్నిహితుడైన పోచంపల్లికి మంత్రి కేటీఆర్ ఏరికోరి శేరిలింగంపల్లి బాధ్యతలు అప్పగించారు. ఉత్తర భారత, సీమాంధ్ర సెటిలర్స్ అధికంగా ఉండే శేరిలింగంపల్లిలో టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ఎత్తుకున్న పోచంపల్లి అందుకు అనుగుణంగా శేరిలింగంపల్లిలో చక్రం తిప్పారు. శాసన సభ్యుడికి, స్థానిక కార్పొరేటర్లకు మధ్య గతంలో కొంత సమన్వయ లోపం ఉన్నది. పోచంపల్లి ఎంటర్ అయ్యాక వారి మధ్య ఉన్న మనస్పర్థలన్నీ దూరమై అందరూ కలిసి కట్టుగా పార్టీ విజయం కోసం పని చేయడం మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ శాసన సభను రద్దు చేయడంతోపాటు శేరిలింగంపల్లి అభ్యర్థిగా గాంధీని ఎంపిక చేయడంతో తాజా మాజీ ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లందరినీ ఏకం చేసి ప్రచారంలో స్పీడును పెంచాడు శ్రీనివాస్‌రెడ్డి. కార్పొరేటర్లందరికీ పూర్తి స్థాయిలో పెద్దరికం ఇవ్వడంతోపాటు కీలక సమయాల్లో సామర్థ్యం కలిగిన నాయకులను తెరపైకి తీసుకువచ్చి మంత్రాంగం నడిపారు.

ప్రతిపక్షలకు చాన్స్ ఇవ్వకుండా అటు అభ్యర్థి, ఇటు కార్పొరేటర్లు, మరోవైపు ముఖ్య నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గమంతా రెండు మూడుసార్లు ఇంటింటికి తిరిగి కారు గుర్తును స్మరణ చేసేంత రీతిలో ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని సామాజిక వర్గాలన్నింటికి గాంధీని చేరువ చేయడంలో, వారందరితో విడివిడి సమావేశాలు ఏర్పాటు చేయించడం, వారికున్న సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను చూపడంతో పాటు కచ్చితమైన హామీని ఇప్పించడంలో పోచంపల్లి దూరదృష్టి అద్వితీయం. ప్రచారతంతు ముగిసిన తర్వాత ఎన్నికల రోజుకు మధ్య ఉన్న 40గంటల సమయాన్ని పార్టీ ముఖ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఉత్తేజ పర్చడంతోపాటు బూత్ కమిటీ సభ్యులు కీలకంగా వ్యవహరించడంలో శ్రీనివాస్‌రెడ్డి వేసిన ఎత్తులు అద్భుతంగా పనిచేశాయి. సెటిలర్స్ అధికంగా ఉండే శేరిలింగంపల్లిలో టీడీపీ ప్రభావం అధికంగా ఉండటం, ఓటర్లను ధన, వస్తు ఇతరత్రా రూపాల్లో ప్రలోభాలకు గురిచేయడంతో సందిగ్ధంలో పడిన టీఆర్‌ఎస్ శ్రేణులను ఉత్తేజ పరిచి గెలుపు తీరాలకు చేర్చడంలో శ్రీనివాస్‌రెడ్డి సఫలీకృతులయ్యారు. పలు డివిజన్లలో జరిగిన ప్రధాన బహిరంగ సభల్లో తప్ప ప్రత్యక్షంగా ఎక్కువగా తెరపైన కనిపించని శ్రీనివాస్‌రెడ్డి తెరవెనుక ఉండి పాత్రదారి అయిన గాంధీ గెలుపులో కీలక సూత్రదారిగా వ్యవహరించారు. పోచంపల్లి వ్యూహాం పూర్తి స్థాయిలో ఫలించడం పట్ల ఎమ్మెల్యే గాంధీతోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

409

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles