అప్రమత్తతే రక్ష

Fri,December 14, 2018 12:43 AM

-ఇన్‌స్టాగ్రాం.. ఫేస్‌బుక్ వాడుతున్నారా?
-అయితే జాగ్రత్త..గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ సంభాషణలను నమ్మి ఫొటోలు వీడియోలు షేర్ చేయవద్దు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నీ నగ్న ఫోటోలు కావాలి.. కెమెరా ముందు వచ్చి నగ్నంగా మాట్లాడాలి.. లేదంటే నీ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతా అంటూ ఈ మధ్య ఇన్‌స్టాగ్రాం, ఫేసుబుక్‌లను ఉపయోగిస్తున్న యువతులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు చేస్తున్న వ్యక్తులు ఎవరో తెలియకపోయినా బాధితులు కంగారు పడుతూ తీవ్ర మనో వేదనకు, హైటెన్షన్‌కు గురవుతున్నారు. దీంతో నిజంగానే తమ ఫొటోలు వారి వద్ద ఉన్నాయని భ్రమపడుతూ ప్రతీ నిమిషం కలవరంలో మునిగిపోతూ ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పాలా వద్దా.. మిత్రులకు చెప్పాలా వద్దు అంటూ మదనపడుతున్నారు. చివరకు తెలిసిన వారి ద్వారా వారికి వచ్చిన కాల్స్ వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించే సరికి వాటి ఆచూకీ దొరకపోవడంతో మరింతగా భయాందోళనకు గురవుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో ఫోన్ చేస్తున్న వ్యక్తి నెంబరు డిస్‌ప్లే కాకపోవడంతో మరింతగా గందరగోళానికి గురవతున్నారు.

ఇలాంటి ఫోన్ కాల్స్ బారిన పడ్డ కొంత మంది ఆ వేధింపులను తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు నిజంగానే నగ్నఫోటోలు పంపించి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఈ తరహా బెదిరింపులు, వేధింపులపై చాలా మంది బాధితులు తమకు ఈ టెన్షన్ నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్న సందర్భాలు చాలా పెరిగాయి. వీటిని విశ్లేషించి సైబర్ క్రైం పోలీసులు కేవలం కొంత మంది ఆకతాయిలు తమ వికృత పైశాచిక ఆనందం కోసం యువతులను టార్గెట్ చేస్తున్నారని గుర్తించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లలోని యువతులు, మహిళలను టార్గెట్ చేసుకుని ఈ విధంగా శాడిస్టు పోకిరీలు వెంటపడుతున్నారని పసిగట్టారు. చాలా వరకు హ్యాకర్లు ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ ఖాతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని యువతులను టార్గెట్ చేస్తున్నట్లు తేలింది. నిజంగానే వారి మాటలకు భయపడి ఫొటోలు పంపిస్తే బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. లేదంటే ఫేసుబుక్, ఇన్‌స్టాగ్రాంల నుంచి ఫొటోలను తీసుకుని వాటిని మార్ఫింగ్ చేస్తూ వణికిచేస్తున్నారని సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది.

అన్ని వీఓఐపీ ద్వారా ఫోన్ కాల్సే..
పోలీసులకు దొరక్కుండా ఉండాలని అమ్మాయిలను వేధిస్తున్న సైబర్ నేరగాళ్లు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఇంటర్నెట్ ఫోన్ కాలింగ్ చేస్తున్నారు. దీని వల్ల వారు ఫోన్ చేసే సమయంలో కొన్ని సందర్భాల్లో అది మనకు డిస్‌ప్లే కాదు. మరికొన్ని సార్లు +97,+96,+44 సీరీస్‌తో కూడిన నెంబర్లు, లేదా అరబ్ దేశాల ఫోన్ నెంబరు సీరిస్, బ్రిటన్, అమెరికా సీరిస్ నెంబర్లతో వీఓఐపీ ద్వారా ఫోన్లు చేస్తున్నారు. దీంతో ఆ ఫోన్‌లను ట్రాక్ చేసినప్పుడు వాటి చిరునామా విదేశాల్లో చూపిస్తుంది. ఇంకా కొన్ని సార్లు కొన్ని యాప్‌ల ద్వారా వారి అసలు నెంబర్లు కాకుండా ఇతరుల ఫోన్ నెంబర్లు కనిపించేలా ఫోన్ కాల్స్ చేస్తూ దర్యాప్తును దారి మళ్లిస్తున్నారు. కొన్ని ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నప్పుడు పశ్చిమబెంగాల్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలిసింది. అయితే యాప్‌ల ద్వారా ఫోన్ నెంబర్లను తీసుకోవడంతో వాటి ఆచూకీ దొరకడం కష్టంగా మారింది.

స్క్రీన్ షాట్ డేంజర్..
ఇన్‌స్టాగ్రాం ఖాతాదారులు ఉన్న వారు డిస్ అపీయరెన్స్ ఆప్షన్ కింద ఏదైనా పోస్టు చేసినప్పుడు అది ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుంది కదా అని నమ్మి చాలా వరకు యువతులు తెలిసిన వారికి ప్రైవేట్ ఫొటోలు, చాట్‌లను షేర్ చేస్తున్నారు. ఇదే కొంపముంచుతోంది. ఈ సమయంలోనే కొంత మంది హ్యాకర్లు వాటిని స్క్రీన్ షాట్ కింద పెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు తెగబడుతున్నారు. ఈ విషయం తెలియక చాలా మంది బాధితులు కంగారులో ఆ ఫొటోలను చూసి భయపడి గుర్తు తెలియని వ్యక్తులు కోరే విధంగా ప్రైవేట్ ఫొటోలను పంపి సమస్యను జఠిలం చేసుకుంటున్నారు. మరో వైపు ఫేసుబుక్‌లలోని ఫొటోలను కూడా అమ్మాయిలను వేధించే అలవాటు ఉన్న వారు తమ బ్లాక్‌మెయిలింగ్‌కు ఆయుధంగా వాడుకుంటున్నారు.

గ్రూపుల్లో బ్లాక్ షీప్స్..
ఇన్‌స్టాగ్రాం, ఫేసుబుక్‌లలో గ్రూపు చాటింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులోఉన్న వారంతా తెలిసిన వారేనా అన్ని సరిచూసుకోవాలి. ఆ గ్రూపుల్లో కొత్త వ్యక్తులను చేర్చుకోవద్దు. ఎందుకంటే ఇలా చేరిన వారే మీ పాలిట బ్లాక్ షీప్స్‌గా మారొచ్చు. గ్రూపుల్లో చేరి మీ చాటింగ్‌లను గమనించిన తర్వాత వాటిని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బ్లాక్‌మెయిలింగ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే మీ గ్రూపుల్లో కొత్త వారు చేరేటప్పుడు మీకు నేరుగా తెలిసి ఉంటేనే అనుమతించాలి. గ్రూపులో ఉన్న వారు సిఫార్సు చేసినా అతడిని నేరుగా గుర్తు పడితేనే అనుమతించాలి. ఈ విధంగా సోషల్ మీడియా గ్రూపుల్లో సిఫార్సుల మీద చేరి చాలా మంది వేధింపులకు గురిచేసిన ఫిర్యాదులు చాలా ఉన్నాయి.

587

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles