ఆశీర్వదించిన ప్రజలకు రుణపడి ఉంటా

Fri,December 14, 2018 12:42 AM

-ఎమ్మెల్యే దానం నాగేందర్
ఖైరతాబాద్ : నాపై నమ్మకంతో ఆశీర్వదించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తొలిసారి గురువారం రాత్రి ఖైరతాబాద్‌కు చేరుకున్న ఆయన లైబ్రరీ వద్ద గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజ్‌దూత్ చౌరస్తా నుంచి ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, జాగిర్‌దార్‌బాడా, లక్ష్మీనగర్, మార్కెట్ రోడ్, రైల్వే గేటు చౌరస్తా మీదుగా ల్రైబరీ వరకు ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించగా, అడుగడునా అడపడుచులు నీరాజనం పట్టారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానన్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టిస్తామని, రేకులు, పెంకుటిల్లు ఉన్న వారికి ప్రభుత్వం తరఫున రూ.6లక్షలు అందజేసి నూతన గృహం కట్టుకునేందుకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 130 యూనిట్ల ఉచిత విద్యుత్, ఒక్క రూపాయితో మంచినీటి కనెక్షన్ ఇప్పిస్తానన్నారు. ఖైరతాబాద్‌తోపాటు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ ప్రజలు అత్యధిక ఓట్లు వేసి ఆదరించారని, అన్ని రంగాల ప్రజలను అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. అలాగే ఖైరతాబాద్ ప్రజల చిరకాల స్వప్నమైన 50పడకల దవాఖాన సేవలను ప్రారంభించేందుకు కృషి చేస్తానని, మరో రెండు అంతస్తులు పెంచి పేద ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తానని తెలిపారు. టీఆర్‌ఎస్ నాయకులు చందు, మహేందర్ బాబు, వైల ప్రవీణ్, గజ్జెల అజయ్, సింగారి సదుర్శన్, రాజ్‌కుమార్, పృథ్విరాజ్, మురళీ, కుమార్, కృష్ణ, ప్రవీణ్, దాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.

348

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles