ఇంతింతై.. కారు బలం రెట్టింపై..

Thu,December 13, 2018 01:57 AM

-టీఆర్‌ఎస్‌కు భారీగా పెరిగిన ఓట్లు
-16,80,774 ఓట్లతో 14 స్థానాల్లో జయకేతనం
-అద్భుత ఫలితాలిచ్చిన కేటీఆర్ రోడ్‌షోలు
-నగరంలో ఖాతా తెరువని టీడీపీ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో 46.9 శాతం ఓట్లతో 88 స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ పార్టీ.. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ ఆధిక్యతను ప్రదర్శించింది. 24అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికలతో పోల్చుకుంటే గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికలు, రెండేండ్ల క్రితం జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పోల్చుకుంటే టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్లు భారీగా పెరిగాయి. 2014 ఎన్నికల్లో వచ్చిన ఓట్లకన్నా ఈసారి రెట్టింపు ఓట్లు సాధించగా, గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకన్నా దాదాపు రెండు లక్షల వరకు పెరగడం విశేషం. తాజా శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్‌లోని 24 స్థానాల్లో టీఆర్‌ఎస్, ప్రజాకూటమి మధ్య ప్రధాన పోటీ నెలకున్న విషయం విధితమే. మొత్తం 40,54,625 ఓట్లు పోల్ కాగా, 24స్థానాల్లో పోటీచేసిన టీఆర్‌ఎస్ 16,80,774 ఓట్లు సాధించి 14 స్థానాలను గెలుచుకున్నది. క్రితం సారి మూడు స్థానాలకే పరిమితమైన గులాబీ పార్టీ ఈసారి ఏకంగా 14 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష పార్టీలను చిత్తు చేసింది. అలాగే, 24 స్థానాల్లో పోటీచేసిన ప్రజాకూటమికి 11,02,104ఓట్లు వచ్చాయి. కూటమిపై టీఆర్‌ఎస్ 5,78,670 ఓట్ల ఆధిక్యత సాధించింది. అంతే కాదు, పాతబస్తీలో మజ్లిస్ పార్టీ పోటీ చేసిన ఏడు స్థానాల్లో టీఆఎస్‌ఎస్ దాదాపు స్నేహ పూర్వక పోటీ చేసినట్లు భావించవచ్చు. అంటే, గ్రేటర్‌లోని 24 స్థానాలకుగాను టీఆర్‌ఎస్ దృష్టి కేంద్రీకరించిన స్థానాలు 17 మాత్రమే. 17స్థానాల్లో 14 నియోజకవర్గాల్లో విజయం సాధించిందని చెప్పవచ్చు. అంతేకాదు, మజ్లిస్ పార్టీ గెలుచుకున్న స్థానాల్లో స్నేహపూర్వక పోటీ చేసినప్పటికీ ఆ స్థానాల్లో సైతం గణనీయంగా ఓట్లు వచ్చాయి. అలాగే, 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ 14,68,618 ఓట్లు సాధించి 99 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గ్రేటర్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది.

కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ 16 స్థానాల్లో పోటీచేసి 7,09,948 ఓట్లు సాధించగా, ఆ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా లభించకపోగా, ఈసారి రెండు స్థానాలను గెలుచుకోవడం కొంత ఊరటగా చెప్పవచ్చు. ఇక టీడీపీ క్రితంసారి ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఆ పార్టీ 14,66,078 ఓట్లు సాధించింది. కాగా, ఈసారి టీడీపీ ఆరు స్థానాల్లోనే తమ అభ్యర్థులను నిలిపి ఎక్కడా కనీసం ఖాతాకూడా తెరువలేదు. ఆ పార్టీకి కేవలం 3,53,676 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒంటరిగానే 24 స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది. ఆ పార్టీకి 6,37,720ఓట్లు వచ్చాయి. క్రితం సారి ఐదు స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈ సారి కేవలం ఒకే స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. మజ్లిస్ గత ఎన్నికల్లో గ్రేటర్‌లోని దాదాపు అన్ని స్థానాల్లో పోటీచేసి 11,42,654ఓట్లు సాధించి ఏడు స్థానాలను గెలుచుకోగా, ఈసారి కేవలం ఎనిమిది స్థానాల్లో పోటీచేసి 5,55,743 ఓట్లతో గత ఏడు స్థానాలను నిలుపుకున్నది. గత గ్రేటర్ ఎన్నికల్లో సైతం మజ్లిస్ మొత్తం 150 డివిజన్లలో పోటీ చేసి 5,30,812 ఓట్లతో 43వార్డులను గెలుచుకున్నది.

579

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles